తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 78


రేకు: 0078-01 శ్రీరాగం సం: 01-370 శరణాగతి


పల్లవి:
ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే రిపుడు

చ.1:
వొంటికాలఁ గుంటికుంటి వూరిబందెలకుఁ జిక్కి
పంటదాఁకా దున్నె నొాక్కపసురము
గంటుగంటులాక లొత్తి కల్లల నడిమిపంట
కుంటివాఁడు గావలుండి కుప్ప లేరుపరచె

చ.2:
కలది కుక్కిమంచము కన్నవారెల్లాఁ బండేరు
తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు
వెలిఁగంతల కొంపలు వీడుఁబట్లు చూపేరు
తలవరులెందు లోనాఁ దప్పు వెదకేరు

చ.3:
వొళ్ళుచెడ్డవాఁ డొకఁడు వుభయమార్గము గొని
కల్లదొరపుట్టుబడి కడుఁగట్టీని
చల్లనిశ్రీ వేంకటేశ సకలలోకపతివి
యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే


రేకు: 0078-02 లలిత సం; 1-371 అధ్యాత్మ


పల్లవి:
తప్పదు తప్పదు దైవము కృపయిది
ముప్పిరి నింతా ముకుందుఁడే

చ.1:
వెక్కసపుమతి వెలుతురుదీరిన-
నెక్కడ చూచిన నీశ్వరుఁడే
గుక్కక యాసలు గోసివేసినను
నిక్క మడుగడుగు నిధానమే

చ.2:
పొంచి శరీరపుభోగము లుడిగిన
చుంచుఁబావములు సుకృతములే
దంచెడివిషయపుతగులమిఁ బాసిన
యెంచిచూచినను యీహమే పరము

చ.3:
శ్రీవేంకటపతిసేవే కలిగిన
వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే
భావము నమ్మిన ప్రసన్నులకును


రేకు: 0078-03 బౌళి సం: 01-372 శరణాగతి


పల్లవి:
దేవ నీవిచ్చేయందుకు దీనికిఁగా నింతయేల
యేవేళ మాయెరుకలు యెందుకుఁ గొలువును

చ.1:
యెవ్వరివసములు బుద్దెరిఁగినడచేమన
యివ్వల నారాయణ నీవియ్యక లేదు
దవ్వు చేరువ మనసు తనయిచ్చయితేఁ గనక
రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా

చ.2:
సారేకు నిన్నుఁదలపించ జంతువులవసమా
కేరి నీవు జిహ్వాఁ బరికించఁగాఁగాక
యీరీతి లోకమెల్లాఁ దమయిచ్చకొలఁదులనయితే
దూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు

చ.3:
యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేఁతలే
కుందవ స్వతంత్రులు గారు గాన
చందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు
చెంది నీవే కాతుగాక చేఁతలూను వలెనా


రేకు: 078-04 సామంతం సం; 01-373 వైష్ణవ భక్తి


పల్లవి:
పరుసమొక్కటేకాదా పయిఁడిగాఁ జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమి

చ.1:
వనజనాభువిభక్తి వదలకుండినఁ జాలు
మనసు యెందు దిరిగినా మరియేమి
మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు
తనవెంతహేయమ్మైనా దానికేమి

చ.2:
శ్రీకాంతునామము జిహ్వుఁ దగిలితే జాలు
యేకులజుఁడైనాను హీనమేమి
సాకారుఁడైనహరి శరణుచొచ్చినఁ జాలు
చేకొని పాపము లెన్ని చేసిననేమి

చ.3:
జీవుంఁడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ
శ్రీవేంకటేశున కాచింతయేమి
యేవలవఁ బరమైన యిహమైన మాకుఁ జాలు
కైవశమాయ నతఁడు కడమలింకేమి


రేకు: 0078-05 భూపాళం సం: 01-374 మేలుకొలుపులు


పల్లవి:
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా

చ.1:
ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా

చ.2:
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా

చ.3:
పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ
గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా


రేకు: 0078-06 పాడి సం: 01-375 వైష్ణవ భక్తి


పల్లవి:
ఇందునుండ మీ కెడ లేదు
సందడి నేయక చనరో మీరు

చ.1:
నాలుక శ్రీహరినామం బున్నది
తూలుచుఁ బారరొ దురితములు
చాలి భజంబున చక్రం బున్నది
తాలిమి భవబంధము లటు దలరో

చ.2:
అంతర్యామై హరి వున్నాఁ డిదె
చింతలు వాయరొ చిత్తమున
వింతలఁ జెవులను విష్ణుకథ లివిగొ
పొంతఁ గర్మములు పోరో మీరు

చ.3:
కాపయి శ్రీవేంకటపతిపే రిదె
నాపై నున్నది నయమునను
కోపపుకామాదిగుణములాల మీ-
రేపున కడఁగడ నెందైన బోరో