తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 6

రేకు: 0006-01 ధన్నాసి సం: 01-036 వైష్ణవ భక్తి
పల్లవి: వైష్ణవులుగానివార లెవ్వరు లేరు
విష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గాన
చ. 1: అంతయు విష్ణు మయం బట మరి దేవ-
తాంతరములు గలవననేలా
భ్రాంతిఁ బొంది యీ భావము భావించి-
నంతనే పుణ్యులవుట దప్పదుగాన
చ. 2: యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరి
యెవ్వరిఁ దలచిన నేమి
అవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-
రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు
చ. 3: అతిచంచలంబైన యాతుమ గలిగించు-
కతమున బహుచిత్తగతులై
యితరులఁ గొలిచిన యెడయక యనాథ-
పతితిరువేంకటపతి చేకొనుఁగాక

రేకు: 0006-02 శ్రీరాగం సం: 01-037 భక్తి
పల్లవి: మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-
వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడో
చ. 1: అందరికి నితఁడెపో అంతరాత్ముఁడనుచు-
నందు రితఁడో మఱియు నవల నొకఁడో
నందకధరుఁడు జగన్నాథుఁడచ్చుఁతుడు గో-
విందుఁ డీతఁడుగాక వేరొకఁడు గలఁడో
చ. 2: తనర నిందరికిఁ జైతన్యమొసఁగిన యాతఁ-
డొనర నితఁడో మఱియు నొకఁడు గలఁడో
దినకరశతతేజుఁడగు దేవదేవుడు, త-
ద్వినుతుఁ డితఁడుగాక వేఱొకఁడు గలఁడో
చ. 3: పంకజభవాదులకుఁ బరదైవ మీతఁడని
అంకింతురితఁడో అధికుఁడొకఁడో
శాంకరీస్తోత్రములు సతతమునుఁ గైకొనెడి-
వేంకటవిభుఁడో కాక వేరొకఁడు గలఁడో

రేకు: 0006-03 భూసాళం సం: 01-038 తిరుపతి క్షేత్రం
పల్లవి: ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-
నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి
చ. 1: అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి
చ. 2: కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమమణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలుకంటి
చ. 3: అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటి
సరిలేని అభయహస్తము గంటిని
తిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి
హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి

రేకు: 0006-04 బౌళి సం: 01-039 వైరాగ్య చింత
పల్లవి: తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని
ఆపదలచేతఁ బొరలాడేముగాన
చ. 1: అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-
రెప్పుడునుఁ దమవార లేలౌదురు
అప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమత
చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక
చ. 2: పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు-
యిందరునుఁ దమవార లేలౌదురు
కందువగు తమకార్యగతులు దీరినదాఁక
సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక
చ. 3: తెగని కర్మము దమ్ముఁ దిప్పుకొని తిరిగాడ
ఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికి
తగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము
విగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక

రేకు: 0006-05 శ్రీరాగం సం: 01-040 యజ్ఞము
పల్లవి: అదిగాక నిజమతం బదిగాక యాజకం-
బదిగాక హృదయసుఖ మదిగాక పరము
చ. 1: అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు-
నమరినది సంకల్పమను మహపశువు
ప్రమదమను యూపగంబమున విశసింపించి
విమలేందు యాహుతులు వేల్పంగవలదా
చ. 2: అరయ నిర్మమకార మాచార్యుఁడై చెలఁగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాఁగ
దొరకొన్న శమదమాదులు దానధైర్యభా-
స్వరగుణాదులు విప్రసమితి గావలదా
చ. 3: తిరువేంకటాచలాధిపునిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతని కృపాపరిపూర్ణ జలదిలో
నరుహులై యవబృథం బాడంగవలదా

రేకు: 0006-06 శంకరాభరణం సం: 01-041 అధ్యాత్మ
పల్లవి: తలపోఁత బాఁతె తలఁపులకుఁ దమ
కొలఁ దెఱంగనిమతి గోడాడఁగా
చ. 1: ఆపదలు బాఁతె అందరికినిఁ దమ-
చాపలపు సంపదలు సడిఁబెట్టఁగా
పాపములు బాఁతె ప్రాణులకును మతిఁ
బాపరానియాస దమ్ముఁ బాధించఁగా
చ. 2: జగడాలు బాఁతె జనులకునుఁ దమ-
పగలైనకోపాలు పై కొనఁగా
వగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁ
దగిలించు మమత వేదనము సేయఁగా
చ. 3: భయములు బాఁతె పరులకును తమ-
దయలేక అలయించు ధనముండఁగా
జయములు బాఁతె సతతమును యింత-
నయగారివేంకటనాథుఁ డుండఁగాను

రేకు: 0006-06 ధన్నాసి సం: 01-042 అధ్యాత్మ
పల్లవి: పుట్టగులమ్మీ భువిఁ గొనరో
జట్టికిని హింసలే మీ ధనము
చ. 1: ఆపద లంగడి నమ్మీఁ గొనరో
పాపాత్ములు పై పయిఁ బడకా
కైపులఁ బుణ్యులఁగని కోపించే-
చూపులు మీ కివి సులభపు ధనము
చ. 2: కడుఁగుంభీ పాతకంబులు గొనరో
బడిబడి నమ్మీఁ బాలిండ్ల
తొడరుఁ బరస్త్రీ ద్రోహపుధనములె
తడవుటె మీ కివి దాఁచిన ధనము
చ. 3: లంపుల చండాలత్వము గొనరో
గంపలనమ్మీఁ గలియుగము
రంపపు వేంకటరమణునికథ విన-
నింపగు వానికి నిదే ధనము

రేకు: 0006-07 లలిత సం: 01-043 అధ్యాత్మ
పల్లవి: అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి
కప్పినదియుఁ గప్పనిదియుఁ గనుఁగొనఁగలనాఁడు
చ. 1: ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పినినాఁడు
పాపములకు పుణ్యములకుఁ బనిదొలఁగిననాఁడు
కోపములకు శాంతములకుఁ గూటమి మానిననాఁడు
లోపల వెలుపల తనమతిలోఁ దెలిసిననాఁడు
చ. 2: తనవారలఁ బెరవారలఁ దాఁ దెలిసిననాఁడు
మనసునఁ జైతన్యంబున మఱపందిననాఁడు
పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులఁ
గనుఁగొని నీభావముగాఁ గనువిచ్చిననాఁడు

రేకు: 0006-07 సామంతం సం: 01-044 వేంకటగానం
పల్లవి: కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి-
నిలయుని శ్రీనిధియైనవాని
చ. 1: ఆదిదేవుని నభవుని సామ-
వేదనాదవినోదుని నెర-
వాది జితప్రియ నిర్మలతత్త్వ-
వాదులజీవనమైనవాని
చ. 2: దేవదేవుఁడైన దివ్యుని సర్వ-
భావాతీతస్వభావుని
శ్రీవేంకటగిరి దేవుఁడైన పర-
దేవుని భూదేవ తత్పరుని