తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 44
రేకు: 0044-01 లలిత సం: 01-268 వైరాగ్య చింత
పల్లవి:ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము
మోదమెరంగని మోహము ముందర గననీదు
చ.1:నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు
సత్యాలాపవిచారము జరగదు లోభికిని
హత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకును
ప్రత్యక్షంబగుపాపము పాయదు కష్టునకు
చ.2:సతతానందవికాసము సంధించదు తామసునకు
గతకల్మషభావము దొరకదు వ్యసనికిని
జితకాముఁడు దా నవుటకు సిద్దింపదు దుష్కర్మికి
అతులితగంభీరగుణం బలవడ దథమునకు
చ.3:శ్రీవేంకటగిరివల్లభు సేవా తాత్పరభావము -
ద్రోవ మహలంపటులకు తోఁపదు తలఁపునకు
దేవోత్తముఁగడు నీతని దివ్యామృతమగు నామము
సేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు
రేకు: 0౦44-02 శుద్దవసంతం సం; 01-269 నామ సంకీర్తన
పల్లవి:నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణే
సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో
చ.1:నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి-
పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యయ పత్యక్షాయ సన్మానససాం-
గత్యాయ జగదవనకృత్యాయ తేనమో
చ.2:అక్రమోద్దతబాహువిక్రమాతిక్రాంత
శుక్రశిష్యోన్యూలనక్రమాయ
శక్రాదిగీర్వాణవక్రభయభంగని-
ర్వక్రాయ నిహతారిచక్రాయ తేనమో
చ.3:అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ-
కాక్షాయ శ్రీవత్సలక్షణాయ
అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం-
రక్షానుకంపాకటాక్షాయ తేనమో
చ.4:కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ
మురవైరిణే జగన్మోహనాయ
తరుణేందుకోటీరతరుణీ మనస్స్తో త్ర-
పరితోషచిత్తాయ పరమాయ తే నమో
చ.5:పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ
థాత్రీశకామితార్థప్రదాయ
గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర-
నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నారయణాయ
రేకు: 0044-03 కన్నడగౌళ సం: ౦01-270 వైరాగ్య చింత
పల్లవి:నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి
కామింప నిట్టిదని కానరా దటుగాన
చ.1:నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి-
నుండుదువుగాని నీ వొకటియునుఁ గావు
దండిగలగిరి ప్రతిద్వని దోచుఁగాని యది
కొండలోపల లేదు కొండయునుఁ గాదు
చ.2:బలసి యిన్నిటిలోపలనుఁ జైతన్యమై
మెలఁగుదువుగాని యేమిట నీవు లేవు
పలుదెరఁగులైన దర్పణమునందొక నీడ
వొలయుఁగా కందు దలపోయు నది లేదు
చ.3:వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ-
వుడివోయి యందుండ కుండుటయు లేదు
చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ-
పొడవు పరిపూ ర్ణమై పొలుపాందుఁగాన
రేకు: 0౦44-04 మాళవి సం: 01-271 శరణాగతి
పల్లవి:అది నాయపరాధ మిది నాయపరాధ
మదియు నిదియు నాయపరాధము
చ.1:నెరయ రూపములెల్ల నీరూపమేకా
నరయని యది నాయపరాథము
పరిపూర్జుఁడగు నిన్నుఁ బరిచ్చిన్నునిఁగా-
నరయుట యది నాయపరాధము
చ.2:జీవాత్మునిఁగాఁ జింతింపఁ దలఁచుట
యావంక నది నాయపరాధము
సేవించి నిను నాత్మఁ జింతింపకుండుట
ఆవల నిది నాయపరాధము
చ.3:యీడెరఁగక వేంకటేశుఁడ నినుఁ గొని-
యాడుట యది నాయపరాధము
యేడఁ జూచిన నాయెదుర నుండఁగ నిన్ను
నాడ నీడ వెదకుటపరాధము
రేకు: ౦౦44-05 కన్నడగౌళ సం: 01-272 వేంకటగానం
పల్లవి:సతతవిరక్తుఁడు సంసారి గాఁడు
రతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె
చ.1:నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ
బ్రత్యక్షవిభవ సంపన్నుఁడు గాఁడు
నిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైన
ప్రత్యక్షవిభవ సంపన్నుఁ డితఁడె
చ.2:యోగియైనవాఁడు వొనర నేకాలము
భోగియై భోగిపై భోగింపలేఁడు
యోగియు నితఁడే వుడుగక భోగిపై
భోగించునటువంటి పురుషుండు నితఁడె
చ.3:దేవుడైనవాఁడుఁ దెలుప లోకముల
దేవతారాధ్యుఁడై దీపింపలేఁడు
దేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైన
శ్రీవేంకటగిరిదేవుండితఁడె