తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 2
రేకు: 0002-01 శుద్ధవసంతం సం: 01-007 అధ్యాత్మ
పల్లవి: సదా సకలము సంపదలే
తుద దెలియఁగ వలెఁ దొలఁగఁగవలయు
చ. 1: అహర్నిశమును నాపదలే
సహించిన నవి సౌఖ్యములే
యిహమున నవి యిందఱికిని
మహిమ దెలియవలె మానఁగవలెను
చ. 2: దురంతము లివి దోషములే
పరంపర లివి బంధములు
విరసములౌ నరవిభవములౌ-
సిరులే మరులౌ చిరుసుఖ మవును
చ. 3: గతి యలమేల్ మంగ నాంచారికిఁ
బతియగువేంకటపతిఁ దలఁచి
రతు లెఱుఁగగవలె రవణము వలెను
హిత మెఱుఁగఁగవలె నిదె తనకు
రేకు: 0002-02 శుద్ధవసంతం సం: 01-008 నామ సంకీర్తన
పల్లవి: ఇందిరానామ మిందరికి
కుందనపుముద్ద వో గోవింద
చ. 1: అచ్చుతనామము అనంతనామము
ఇచ్చినసంపద లిందరికి
నచ్చినసిరులు నాలుకతుదలు
కొచ్చికొచ్చీ నోగోవిందా
చ. 2: వైకుంఠనామము వరదనామము
ఈకడనాకడ నిందరికి
వాకుఁదెరపులు వన్నెలు లోకాలఁ
గూకులు వత్తులు నోగోవిందా
చ. 3: పండరినామము పరమనామము
ఎండలువాపెడి దిందరికి
నిండునిధానమై నిలచినపేరు
కొండలకోనేటివోగోవిందా
రేకు: 0002-03 బౌళి సం: 01-009 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట
యెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు
చ. 1: అవయవములలో నదిగా దిదిగా-
దవి మే లివి మే లన నేలా
భువియుఁ బాతాళము దివియు నందలిజంతు-
నివహ మింతయునూ నీదేహమేకాన
చ. 2: నీవు లేనిచోటు నిజముగఁ దెలిసిన
ఆవల నది గా దనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము
భావింప నీవే పరిపూర్ణుఁడవుగాన
రేకు: 0002-04 సామంతం సం: 01-010 వైష్ణవ భక్తి
పల్లవి: సహజ వైష్ణవాచార వర్తనుల-
సహవాసమె మాసంధ్య
చ. 1: అతిశయమగు శ్రీహరిసంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురతమెఱసిన సంధ్య
చ. 2: పరమభాగవతపదసేవనమే
సరవి నెన్న మాసంధ్య
సిరివరుమహిమలు చెలువొందఁగ వే-
సరక వినుటె మాసంధ్య
చ. 3: మంతుకెక్క తిరుమంత్రపఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుఁడు వేంకటగిరిరాయని-
సంతర్పణమే మాసంధ్య
రేకు: 0002-05 మాళవిశ్రీ సం: 01-011 భక్తి
పల్లవి: ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు
చ. 1: అటమటపువేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు.
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
చ. 2: బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొండనుచుఁ బర మొసంగును దైవము
బండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు.
యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు
చ. 3: మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు.
తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు.
రేకు: 0002-06 ధన్నాసి సం: 01-012 వేంకటగానం
పల్లవి: సందడి విడువుము సాసముఖా
మంధరధరునకు మజ్జనవేళా
చ. 1: అమరాధిపు లిడుఁ డాలవట్టములు
కమలజ పట్టుము కాళాంజి
జమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడ
అమర నిడుఁడు పరమాత్మునకు
చ. 2: అణిమాదిసిరులనలరెడు శేషుఁడ
మణిపాదుక లిడు మతి చెలఁగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును
చ. 3: వేదఘోషణము విడువక సేయుఁడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి
ఆదరమున సిరు లందీ వాఁడె
రేకు: 0002-07 శంకరాభరణం సం: 01-013 నృసింహ
పల్లవి: మలసీఁ జూడరో మగ సింహము
అలని మీఱిన మాయల సింహము
చ. 1: అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళము మీఁది పెనుసింహము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానఁగలేని ఘనసింహము
చ. 2: మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి-
చిచ్చిఱకంటితోడి జిగిసింహము
తచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి
నచ్చినగోళ్ళ శ్రీనరసింహము
చ. 3: బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు
అంకపుదనుజసంహారసింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింక లేక వడిఁ బెరిగినసింహము
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.