తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 18

రేకు: 0018-01 సాళంగం సం: 01-107 వైరాగ్య చింత


పల్లవి :

పుట్టుమాలిన బరుబోఁకివి నన్నుఁ
దిట్టే వదేమోసి దిమ్మరిమాయ


చ. 1:

ఒరపులాడక పోవె వోసి మాయ నాతోఁ
దొరలేవు నిను ముట్ట దోసము
వెరపించే వేమోచి విష్ణుభక్తినంటా -
నెరఁగనటే నీయేతు లన్నియును


చ. 2:

వుదుటు చెల్లదు పోపో వోసి మాయ నా-
యెదుర మాఁటలు నీకు నిఁకనేలే,
వదరేపు హరిభక్తి వనిత, తెలియరు నే-
నిదురవుచ్చినవారు నీవు నా కెదురా


చ. 3:

వొల్లవటే జీవ మోసిమాయ నీ
కల్లలిన్నియును లోక మెఱఁగును,
నల్లనివిభునిమన్ననభక్తినంటాఁ
జెల్లఁబో పాపపుచేఁదు మేయకువే


చ. 4:

పూరకుండవుగా వోసిమాయ నిన్నుఁ
బేరఁ బిలువము గుంపెనలాడేవు,
నారాయణభక్తినాతి నన్నును నిన్నుఁ
గోరి యుందరు నెఱఁగుదు రేల పోవె


చ. 5:

వోవవు ననుఁజూచి వోసిమాయ నా-
తోవ వచ్చినను నొత్తువు నీవు,
శ్రీ వేంకటగిరిదేవునిభక్తి నా -
హవళికే నిన్ను నలమి రిందరును

రేకు: 0018-02 గుజ్జరి సం: 01-108 వేంకటగానం


పల్లవి :

నాపాలి ఘన నిధామవు నీవే నన్ను
నీ పాల నిడుకొంటి నీవే నీవే


చ. 1:

ఒలిసి నన్నేలె దేవుఁడవు నీవే, యెందుఁ
దొలగని నిజబంధుఁడవు నీవే
పలుసుఖమిచ్చేసంపదవునీవే, యిట్టే
వెలయ నిన్నియును నీవే నీవే


చ. 2:

పొదిగి పాయని యాప్తుఁడవు నీవే, నాకు
నదనఁ దోడగుదేహమవు నీవే
మదమువాపెడి నామతియు నీవే, నాకు
వెదక నన్నియును నీవే నీవే


చ. 3:

యింకా లోకములకు నెప్పుడు నీవే, యీ
పంకజభవాదిదేవపతివి నీవే
అంకలి వాపఁగ సంతకు నీవే తిరు-
వేంకటేశ్వరుఁడవు నీవే నీవే

రేకు: 0018-03 వరాళి సం: 01-109 దశావతారములు


పల్లవి :

పుడమినిందరి బుట్టె భూతము కడుఁ-
బొడవైన నల్లని భూతము


చ. 1:

కినిసి వోడమింగెడి భూతము
పునుకవీఁపుపెద్ద భూతము
కనలి కలియు చీఁకటి భూతము
పొనుగుసోమపుమోము భూతము


చ. 2:

చేటకాళ్ళా మించిన భూతము
పోటుదారల పెద్ద భూతము
గాఁటపుజడలబింకపు భూతము
జూటరి నల్లముసుఁగు భూతము


చ. 3:

కెలసి బిత్తలేతిరిగేటి భూతము
పొలుపుదాంట్లపెద్ద భూతము
బలుపు వేంకటగిరిపయి భూతము
పులుగుమీఁది మహా భూతము

రేకు: 0018-04 సామంతం సం: 01-110 వేంకటగానం


పల్లవి :

చాలదా మా జన్మము నీ-
పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె


చ. 1:

కమలాసనాదులు గానని నీపై
మమకారము సేయ మార్గము గలిగె
అమరేంద్రాదుల కందరాని నీ-
కొమరైన నామము కొనియాడఁ గలిగె


చ. 2:

సనకాదులును గానఁజాలని నిన్నుఁ
తనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగె
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న-
నిను సంతతమును వర్ణింపఁగలిగె


చ. 3:

పరమమై భవ్యమై పరిగిననీ-
యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె
తిరువేంకటాచలాధిప నిన్ను యీ-
ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె

రేకు: 0018-05 ఆహిరి సం: 01-111 కృష్ణ


పల్లవి :

దిక్కిందరికినైన దేవుఁడు కడుఁ
దెక్కలికాఁడైన దేవుఁడు


చ. 1:

కొత్తపైండ్లికూఁతుఁ గోరి చూడఁబోయు
యెత్తి తేరిమీఁద నిడుకొని
నెత్తికన్ను మానినవాని పెండ్లికి
దెత్తిగొన్న యట్టి దేవుఁడు


చ. 2:

గొప్పయునపెద్దకొండమీఁద నుండి
దెప్పరమ్ముగా దిగఁబడి
కప్పి రెండుదునుకలు గూడినవాని
తిప్పుఁదీరులాడే దేవుఁడు


చ. 3:

బెరసి మేనమామబిడ్డకునై పోయు
నిరతఁపుబీరాలు నెరపుచు
యిరవైనమాయపుటెద్దులఁ బొరిగోన్న-
తిరువేంకటగిరి దేవుఁడు

రేకు: 0018-06 శ్రీరాగం సం: 01-112 వైరాగ్య చింత


పల్లవి :

ఏమి గలదిందు నెంత గాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ


చ. 1:

కొండవంటిది యాస, గోడ వంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పుండువంటిది మేను, పోలించినను మేడి
పండువంటిది సరసభావమింతియును


చ. 2:

కంచువంటిది మనసు, కలిమిగలదింతియును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మెలింతియును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిభ్రాఁతి


చ. 3:

ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింత
పాఁకువంటిది కర్మ బంధమెల్ల
యేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కి
కాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ