తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 11
రేకు: 0011-01 ఆహిరి సం: 01-067 జోల
పల్లవి: అలరఁ జంచలమైనఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల
చ. 1: ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె నుయ్యాల
చ. 2: మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల
చ. 3: కమలకును భూసతికి కదలు కదలుకుమిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాఁగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల
రేకు: 0011-02 నాట సం: 01-068 నృసింహ
పల్లవి: ఘోరవిచారణ నారసింహ నీ-
వీరూపముతో నెట్లుండితివో
చ. 1: ఉడికెడికోపపుటూర్పులఁ గొండలు
పొడివొడియై నభమునకెగయ
బెడిదపురవమున పిడుగులు దొరుగఁగ
యెడనెడ నీవపుడెట్లుండితివో
చ. 2: కాలానలములు గక్కుచు నయన-
జ్వాలల నిప్పులు చల్లుచును
భాలాక్షముతో బ్రహ్మండకోట్ల-
కేలికవై నీవెట్లుండితివో
చ. 3: గుటగుటరవములు కుత్తికఁ గులుకుచు
గిటగిటఁ బండ్లు గీఁటుచును
తటతటఁ బెదవులు దవడలు వణఁకఁగ
ఇటువలె నీవపుడెట్లుందితివో
చ. 4: గోళ్ళమెఱుఁగుల కొంకులపెదపెద-
వేళ్ళ దిక్కులు వెదకుచును
నీళ్ళతీగెలు నిగుడఁగ నోర ను-
చ్చిళ్ళు గమ్మఁగ నెట్లుండితివో
చ. 5: హిరణ్యకశిపుని నేపడఁచి భయం-
కరరూపముతోఁ గడుమెరసి
తిరువేంకటాగిరిదేవుఁడ నీవిఁక
యిరపుకొన్ననాఁడెట్లుందితివో
రేకు: 0011-03 గౌళ సం: 01-069 హనుమ
పల్లవి: నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క-
వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు
చ. 1: ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీబంటు
చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు
చ. 2: వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె
నిట్టతాడువంటివాఁడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు
చ. 3: అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు
నిలుచున్నాఁ డదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుఁడు
కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు
రేకు: 0011-04 దేవగాంధారి సం: 01-070 అంత్యప్రాస
పల్లవి: తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
దెలియుట దనలోఁ దెలియుట కొరకే
చ. 1: ఉదయమందుట భవముడుగుట కొరకే
చదువుట మేలువిచారించు కొరకే
బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే
చ. 2: తగులుట విడివడఁదలఁచుట కొరకే
నొగులుట కర్మమునుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే
చ. 3: యీవలఁ జేయుట ఆవలి కొరకే
ఆవలనుండుట యీవలఁ కొరకే
యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే
రేకు: 0011-05 కన్నడగౌళ సం: 01-071 ఉపమానములు
పల్లవి: ఎంతసేసినా నెడయకే పోయ
ముంతలోనినీట మునిఁగిలేచుట
చ. 1: ఉట్టిపై చెరలాట మూరఁబొత్తులకూడు
పట్టుచాలనికొమ్ము బహునాయకము
వెట్టిమోపరిలాగు వెఱ్ఱివోయినపోక
నట్టింటివైరంబు నగుఁబాటుబ్రదుకు
చ. 2: రాకపోకలచేత రాఁగిన పెనుఁబుండు
వాకులేనివరము వలవనివలుపు
యేకాలము వేంకటేశునికృపలేక
ఆకడీకడ నడయాడెడినడపు