తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 288
రేకు: 0288-01 నాట సం: 03-506 నృసింహ
పల్లవి:
కంభమున వెడలి ఘన నరసింహము
కుంభిని హిరణ్యుఁ గూలిచెను
చ. 1:
తొడికి దైత్యుఁ దన తొడపైకిఁ దిగిచి
కడుపు చించి రక్తము చల్లి
జడియక పేగులు జందెంబులుగా
మెడఁ దగిలించుక మెరసీ వాఁడే
చ. 2:
పెదవులు చింపుచు పెనుగోళ్ల నదిమి
వుదుటుఁ బునుక గొరికుమియుచును
సదరపు గుండెలు చప్పరింపుచును
మెదడు గందముగ మెత్తీ వాఁడే
చ. 3:
దేవతల భయము దీర్చి యంకమున
శ్రీవనితనుఁ గృప సేయుచును
పావనపు టహోబలగిరి దైవము
శ్రీవేంకటగిరిఁ జెలఁగీ వాఁడే
రేకు: 0288-02 సాళంగనాట సం: 03-507 నృసింహ
పల్లవి:
ఆదిమపురుషుడు అహోబలమునను
వేదాద్రిగుహలో వెలసీ వాఁడే
చ. 1:
వుదయించె నదిగో వుక్కుఁ గంభమున
చెదరక శ్రీనరసింహుడు
కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు-
నెదుట గద్దెపై నిరవై నిలిచె
చ. 2:
పొడచూపె నదిగో భువి దేవతలకు
చిడుముడి శ్రీనరసింహుఁడు
అడర నందరికి నభయం బొసగుచు
నిడుకొనెఁ దొడపై నిందిరను
చ. 3:
సేవలు గొనె నదె చెలఁగి సురలచే
శ్రీవేంకటనరసింహుడు
దైవమై మమ్మేలి దాసుల రక్షించె
తావుకొనఁగ నిటు దయతోఁ జూచి
రేకు: 0288-03 దేవగాంధారి. సం: 03-508 వేంకటగానం
పల్లవి:
ఏమని నుతింతు నేను యిందిరానాయక నీవు
కామించి కోరినవారి కల్పలతవు
చ. 1:
నెట్టనఁ దలఁచేవారి నిండు నిధానమవు
పట్టినవారి చేతి బంగారమవు
చుట్టరికమెంచేవారి చోటికిఁ దల్లిదండ్రివి
ముట్టి కొలిచినవారి ముంజీతమవు
చ. 2:
సేవ చేసినవారికి చేతిలో మాణికమవు
భావించువారికి పరబ్రహ్మమవు
కావలెనన్నవారికి ఘన మనోరథమవు
వావిరిఁ బూజించువారి వజ్రపంజరమవు
చ. 3:
బత్తి సేసినవారికి భవరోగ వైద్యుఁడవు
హత్తి నుతించినవారి యానందమవు
పొత్తుల అలమేల్మంగ బువ్వపు శ్రీవేంకటేశ
ఇత్తల మా పాలిటికి నిహపరదాతవు
రేకు: 0288-04 దేసాళం సం: 03-509 కృష్ణ
పల్లవి:
సురలు సంతోషించి రసురలెల్లా నడఁగిరి
తొరలి దిక్కుల దేవదుందుభులు మొరసె
చ. 1:
కఁడగి వసుదేవుని కాంత దేవకిదేవికి
వుడివోని వేడుకఁ జంద్రోదయవేళ
కొడుకై జన్మించినాఁడు కూరిమి శ్రీకృష్ణుఁడు
నడురేయి నిదే శ్రావణబహుళాష్టమిని
చ. 2:
రేపల్లె కెమున దాఁటి రేతిరే తెచ్చి తండ్రి
పాపని యశోదవద్దఁ బండఁగఁ బెట్టి
ఆపొద్దే మధురలోని కాఁడుఁబాపఁ దెచ్చుకొనె
కోపగించి కంసుని మార్కొనె నందనందని
చ. 3:
పురుఁడు వెళ్లెను మరి పుణ్యావాజన సేసిరి
మురిపేన గొల్లెతలు ముద్దాడిరి
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగపతై
యిరవై కొల్చినవారి నిందరి రక్షించెను
రేకు: 0288-05 బౌళి సం: 03-510 తేరు
పల్లవి:
దేవదుందుభులతోడ దివ్యులతోడ
యీవేళ శ్రీహరి తేరు యేఁగీ వీధులను
చ. 1:
గరుడధ్వజముతోడ కనకపు గుఱ్ఱాలతో
పరపై యష్టదిక్కుల బండికండ్లతో
నిరతితో పట్టుమాలి నిడుపపగ్గాలతోడ
యిరవై శ్రీపతి తేరు యేఁగీ వీధులను
చ. 2:
పచ్చల ప్రతిమలతో పగడపు నొగలతో
హెచ్చిన వైడూర్యపు టిరుసులతో
కుచ్చుల ముత్యాలతో గుంపుఁ బైఁడికుండలతో
యిచ్చల భూధవు తేరు యేఁగీ వీధులను
చ. 3:
మంచి నీలాల గద్దెతో మణిదర్పణాలతోడ
పొంచిన సింగారాలతో పూదండలతో
అంచె శ్రీవేంకటేశుతో నలమేలుమంగతోడ
యెంచఁగ దేవుని తేరు యేఁగీ వీధులను
రేకు: 0288-06 పాడి సం: 03-511 విష్ణు కీర్తనం
పల్లవి:
సేవించి చేకొన్నవారి చేతి భాగ్యము
వేవేగ రారో రక్షించి విష్ణుఁ డీడను
చ. 1:
గరుడగంభము కాడ కడుఁ బ్రాణాచారులకు
వరము లొసఁగీని శ్రీవల్లభుఁడు
తిరమై కోనేటి చెంతఁ దీర్థఫలములెల్ల
పరుషల కొఁగీని పరమాత్ముఁడు
చ. 2:
సేన మొదలారి వద్ద చిత్తములో సుజ్ఞానము
నానాగతిఁ బుట్టించీని నారాయణుఁడు
కానుక పైఁడిగాదెల కాఁడఁ దన నిజరూపు
అనుక పొడచూపీని అఖిలేశుఁడు
చ. 3:
సన్నిధి గర్భగృహాన చనవిచ్చి మాటలాడి
విన్నపాలు వినీ శ్రీవేంకటేశుఁడు
యెన్నికఁ బాదాలవద్ద యిహముఁ బరముఁ జూపీ
మన్ననల అలమేలుమంగవిభుఁడు