రేకు: 0282-01 లలిత సం:03-470 విష్ణు కీర్తనం
పల్లవి : |
అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ-
డతనికంటే మరి యధికులు యేరయ్యా
|
|
చ. 1: |
కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరి కైనాఁ
గమలనాభునికి నొక్కని కే కాక
కమలజుఁడైన బ్రహ్మ కలఁడా యెవ్వని నాభి-
సమరవంద్యుఁడు మా హరికే కాక
|
|
చ. 2: |
అందరు నుండెడి భూమి యన్యులకుఁ గలదా
అందపు గోవిందునికే ఆలాయఁగాక
చెందిన భాగీరథి శ్రీపాదాలఁ గలదా
మందరధరుఁడయిన మాధవునికిఁ గాక
|
|
చ. 3: |
నిచ్చలు నభయమిచ్చేనేరుపు యెందుఁ గలదా
అచ్చుగ నారాయణునియందే కాక
రచ్చల శరణాగత రక్షణ మెందుఁ గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకే కాక
|
|
రేకు:0282-02 రామక్రియ సం: 03-471 తిరుపతి క్షేత్రం
పల్లవి : |
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ
|
|
చ. 1: |
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెసఁ బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుఁడుండేటి శేషాద్రి యీకొండ
|
|
చ. 2: |
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విఁ దపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడవాటి కొండ
|
|
చ. 3: |
వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపుఁ గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపుఁ గొండ
|
|
రేకు: 0282-03 సామంతం సం: 03-472 దశావతారములు
పల్లవి : |
విజయపుటమ్ము వేసె వేంకటేశుఁడు
విజయుని సఖుఁడు యీ వేదమూరితి
|
|
చ. 1: |
పాఱితెంచి దశకంఠు పదిశిరసులమీఁద్ర
ఆఱికినమ్ము వేసె నాదిదేవుఁడు
ఆఱడి సేనల తోడ నంబుధి మీఁద వేసె
వేఱొకయమ్ము దొడిగి విష్ణుదేవుఁడు
|
|
చ. 2: |
చాలుగ నేడుదాళ్లు సర్వము నొక్కటిగాఁగ
ఆలములో నమ్మువేసె నఖిలేశుఁడు.
ఆలించి రుక్మిణిఁ బెండ్లి యాడునాఁడు వైరులపై
జాలి(?)యమ్ము వేసెను విజయకృష్ణుఁడు
|
|
చ. 3: |
భజన నిందిరఁగూడి పంతమున నమ్మువేసె
విజయదశమిని శ్రీవేంకటేశుఁడు
సుజనుల దేవతల సొరిది నిందరిఁ గాచు
విజయము చేకొనె విష్ణుదేవుఁడు
|
|
రేకు: 0282-04 లలిత సం: 03-473 అన్నమయ్య స్తుతి
పల్లవి : |
నీదాఁకా వలెనా నిచ్చలు నారాయణా
ఆది నీ దాసుఁడే చాలు నందరి రక్షించను
|
|
చ. 1: |
నీ పాదమూలమున నిలిచిన జలమును
మోపుగా మోచె రుద్రుఁడు ముందు ముందే
కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే
పైపై మునులు యిహపరములు గనిరి
|
|
చ. 2: |
పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె
దండిగా దేవతలెల్ల ధన్యులైరి
అండనే నీసాకార మాతుమఁ దలఁచి కాదె
నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి
|
|
చ. 3: |
చేరి నీవిహారమైన శ్రీవేంకటాద్రిఁ గాదె
కోరి నరులు వరాలు కొల్లగొనిరి
ఆరీతిఁ దాళ్లపాక అన్నమయ్య ఘనుఁడాయ
వారివారమై నేము వహికినెక్కితిమి
|
|
రేకు: 0282-05 శుద్ధవసంతం: సం: 03-474 దేవుడు-జీవుడు
పల్లవి : |
దీనుఁడ నేను దేవుఁడవు నీవు
నీ నిజమహిమే నెరపుటఁ గాకా
|
|
చ. 1: |
మతి జనన మెఱఁగ మరణం బెఱఁగను
యితవుగ నిను నిఁక నెరిఁగేనా
క్షితిఁ బుట్టించిన శ్రీపతివి నీవే
తతి నాపై దయ దలఁతువుఁ గాకా
|
|
చ. 2: |
తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని
తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
అలరిన నాలో యంతర్యామివి
కలుష మెడయ ననుఁ గాతువుఁ గాకా
|
|
చ. 3: |
తడవ నాహేయము తడవ నామలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీవేంకటవిభుఁడవు
కడదాఁకా నిఁకఁ గాతువుఁ గాకా
|
|
రేకు: 0282-06 మాళవి సం: 03-475 గురు వందన, నృసింహ
పల్లవి : |
నారాయణాచ్యుతానంత నిన్నొకచోట
గోరి వెదకనేల వీరివల్లఁ గంటిఁబో
|
|
చ. 1: |
సొలసి నీ రూపము శ్రుతులలోఁ జెప్పుఁ గాని
బలిమి నాచార్యుఁడైతేఁ బ్రత్యక్షము
పలికి నీ తీర్థము భావనలందే కాని
అల నీ దాసుల మరచేత నిదివో
|
|
చ. 2: |
నీ యానతు లెన్నఁడు నేము దెలియము గాని
మా యాచార్యునిమాట మంత్రరాజము
కాయములో నీ వుండేది కడు మఱఁగులు గాని
యీయెడ నీ పరికర మిన్నిటా నున్నదివో
|
|
చ. 3: |
అరిది నీవందన మొకర్చావతారానఁ గాని
గురుపరంపరనై తేఁ గోట్లాయఁ బో
హరి నిన్ను శ్రీవేంకటాద్రినే చూచితిఁ గాని
పరమున నిహమునఁ బంచి చూపె నతఁడు
|
|