తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 271

రేకు: 0271-01 సామంతం సం: 03-406 శరణాగతి


పల్లవి :

ఎవ్వరి దూరఁగనేల యేమీ ననఁగనేల
నవ్వుచు హరికి మొక్కి నడచుటఁ గాక


చ. 1:

కోపమే యెక్కుడు సేసు కొందరి గుణములోన
పాపమే యెక్కుడు సేసు పరులఁ గొందరికి
దీపన మెక్కుడు పేసు దేహములఁ గొందరికి
శ్రీపతి ఆనాజ్ఞ లివి చెల్లీ లోకానను


చ. 2:

కొందరి నసురలఁగా గుట్టుతోడ నటు సేసు
కొందరి దేవతలఁగా కోరి తానే యిటు సేసు
కొందరి మనుజులఁగా కూటపు జీవులఁ జేసు
విందువలె హరిమాయ వెలసి లోకానను


చ. 3:

వరుస నెరిఁగి నడవ నెవ్వరి కిచ్చగాదు.
సరిని వనాది నుండే సహజమే కలది
చిరపుణ్యు లిన్నిటిలో శ్రీవేంకటేశుఁ గని
శరణనఁగా సుఖము జరగీ లోకానను

రేకు: 0271-02 గుండక్రియ సం: 03-407 శరణాగతి


పల్లవి :

పొదలఁ బొదలఁగఁ దనువు పుణ్యపాపముపొత్తు
వదల వదలఁగ మనవద్దనే నిలుచు


చ. 1:

పెరుగు నింద్రియసుఖము పెంచఁగాఁ బెంచఁగా
ధరఁ బెరుగుఁ గోరికలు తలఁచఁ దలఁచ
కెరలు లంపటము మిక్కిలి కూర్చుఁ(ర్చఁ?) గూర్చఁగా
మరలింప మరలింప మనసులో నణఁగు


చ. 2:

కలుగు పనులే మైనఁ గడుఁ జేయఁ జేయఁగా
మలసి కలుగును రుచులు మరుగ మరుగ
బలియు నజ్ఞానంబు భ్రమయఁగా భ్రమయఁగా
నిలువ నిలువఁగ మనసు నిశ్చలం బవును


చ. 3:

నెగడు గుణములు పెక్కు నించఁగా నించఁగా
మిగుల(లు?) సంసారంబు మెలఁగ మెలఁగ
తగిలి శ్రీవేంకటేశు దగ్గరి కొలువఁగఁ గొలువ
పొగడఁ బొగడఁగ నతఁడు పొంతనే నిలుచు

రేకు: 0271-03 ధన్నాసి సం: 03-408 వైరాగ్య చింత


పల్లవి :

నీ వెటుసిన నిజభోగ్యంబౌ
చేవలఁ గైకొని చెలఁగుటఁ గాక


చ. 1:

దేవ నీ యానతిఁ దిరిగేటి చి త్తము
నావద్ద నిలుపఁగ నా వసమా
యీవల నీవే యిచ్చిన పుట్టుగు
యేవిధిఁ దిప్పిన యిఁక మాన వశమా


చ. 2:

వామన నీ పంపు వచ్చిన ప్రకృతిదే
నా మాట వినుమన నా వసమా
శ్రీమంతుఁడ నీచేఁత దేహమిది
దోమటీ గుడువక తోయఁగ వశమా


చ. 3:

నగధర నీ విటు నడపేటీ కర్మము
నగినగి తోయఁగ నా వసమా
తగు శ్రీవేంకటదైవమ నాపాలఁ
దగిలితి వితరముఁ దలఁచఁగ వశమా

రేకు: 0271-04 భైరవి సం: 03-409 తిరుపతి క్షేత్రం


పల్లవి :

విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో
శాశ్వతులమైతి మింక జయము మా జన్మము


చ. 1:

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
మెండుగఁ బ్రత్యక్షమాయ మేలువో నా జన్మము


చ. 2:

మేడవంటి హరిరూపు మించైన పైఁడి గోపుర -
మాడనే వాలిన పక్షు లమరులు
వాడలఁ గోనేటిచుట్ల వైకుంఠనగరము
యీడ మాకుఁ బొడచూపె ఇహమేపో పరము


చ. 3:

కోటి మదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటు లేని శ్రీవేంకటేశుఁడితఁడు
వాఁటపు సొమ్ములు ముద్ర వక్షపు టలమేల్మంగ
కూటువై నన్నేలితి యెక్కువవో నాతపము

రేకు: 0271-05 ఆహిరి సం: 03-410 శరణాగతి


పల్లవి :

నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య
పైకొని శ్రీహరి నీవే పరిహరించవే


చ. 1:

విజ్ఞానములు గొన్ని విందు నే నూరకే
సుజ్ఞానములు గొన్ని చూతు నే నేపొద్దు
అజ్ఞానము నే ననిశము నడచేది
ప్రజ్ఞాహీనుఁడ నెంత పాపకర్మమో


చ. 2:

సుకృతము లోకమరి సొరిది నే బోధింతు
ప్రకృతి యొక్కొక వేళ భావింతు నాత్మలో
అకృతములే నే ననిశముఁ జేసేది
వికృతాచారుఁడ నింకా వికార మెంతో


చ. 3:

ధర్మమార్గమూఁ గొంత తలఁపున నెరిఁగితి
నిర్మలచిత్తమై మోక్షనిలయము నెరిఁగితి
నిర్మించి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను
మర్మ మెరిఁగితి నెట్ల మన్ననఁ గాచితివో

రేకు: 0271-06 రామక్రియ సం: 03-411 విష్ణు కీర్తనం


పల్లవి :

ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ
వంతులకుఁ గొలిచేటివారి భాగ్య మిఁకను


చ. 1:

గక్కన మన్మథునిఁ గన్నతండ్రి గనక
యెక్కువ చక్కఁదనాల కితఁడే దొడ్డ
నిక్కపు సూర్యచంద్రాగ్నినేత్రుఁడు గనక
దిక్కులఁ గాంతుల నీ దేవుఁడే దొడ్డ


చ. 2:

అంచెల లక్ష్మికి మగఁడై నాఁడు గనక
యెంచ రాని సంపదల కితఁడే దొడ్డ
పంచినచోటఁ జక్రము పంపు చేసీఁ గనక
మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ


చ. 3:

దైవికపుఁ బురుషోత్తముఁ డితఁడు గనక
దేవతల కెల్లా నీ దేవుఁడే దొడ్డ
వావాత శ్రీవేంకటాద్రి వరములిచ్చీఁ గనక
యేవల దాతలలోన నితఁడే దొడ్డ