తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 261

రేకు: 0261-01 బౌళి సం: 03-349 అధ్యాత్మ


పల్లవి :

ఇంతలోనే యెచ్చరేది ఇంతలో మోసపోయేది
చెంత వలసినట్లు జేసుకొంట(?) దేహికి


చ. 1:

నిమిషములోనిది నింగిఁ దిరిగాడేది
జమళిలోను వెలికి సరిదూఁగేది.
సమతైవుంటేనుండు చాలించిపోతేఁ బోవు
భ్రమవంటిది ప్రాణము పట్టరాదు దేహికి


చ.2:

నీరు బుగ్గవంటిది నిచ్చ కొత్తలైనది
పోరచి పంచభూతాల పొరుగైనది.
తీరితేనే తీరును తీరకుండితే నిలుచు
నారువంటిది మేను నమ్మరాదు దేహికి


చ. 3:

రేపుమాపులైనది రెండు మొకాలైనది
పైపై శ్రీవేంకటేశు భారమైనది
రూపై దగ్గరియుండు రుచులై యెదుటనుండు
తీపువంటిది కాలము తెగదెందు దేహికి

రేకు: 0261-02 దేవగాంధారి సం: 03-350 అద్వైతము


పల్లవి :

పాపము పాపము ప్రజలా లా
పైపై నిటువలెఁ బలుకకురో


చ. 1:

హరియందుఁ బుట్టినజుఁడును శివుఁడును
హరితో సరి వీరనుటెట్లూ
పొరిఁ గొండలందుఁ బుట్టిన శిలలివి
వరుసఁ బెట్టితే సరియౌనా


చ. 2:

యిందిరాధిపుని విలఁగల సిరులివి
అంది మరొకరివి అనుటెట్లు
కొందరము యేరుగుడిచి కాలువలఁ
బొంది పొగడితేఁ బొసఁగీనా


చ. 3:

శ్రీవేంకటపతి సేవకులకు సరి
ఆవల మరి కలరనుటెట్లు
కావించిన యల కామధేనువుల-
కేవి యూరఁబసు లీడవునా

రేకు: 0261-03 గుజ్జరి సం: 03-351 దశావతారములు


పల్లవి :

చెప్పఁగా నెఱఁగరా చేరి వేదవ్యాసులు
తప్పక చేతులెత్తి దైవ మితఁడన్నది


చ. 1:

యిరవుగా నెఱఁగరా యెల్ల దేవతలలో
పొరిఁ గృష్ణుఁడు అగ్రపూజ గొన్నది
తిరమై తెలియరా యీ దేవుని పాదపూజ
హరుని శిరసుమీఁద నమరి వుండినది


చ. 2:

యింకా నెఱఁగరా యితని రామమంత్రము
తెంకినుండి హరుఁ డుపదేశించేది
పొంకమిదెరఁగరా భువిమీఁద శరభము-
మంకుదన మెల్లఁ దీర మానిపివేసినది


చ. 3:

చూచియు నెఱఁగరా సొరిది శ్రీవేంకటాద్రి-
నేచిన వరములెల్లా నియ్యఁగాను
కాచే దెఱఁగరా ఘనుడితఁ డెవ్వరైనా
చేచేత శరణంటేఁ జేకొనే బిరుదు

రేకు: 0261-04 వసంతవరాళి సం: 03-352 వైరాగ్య చింత


పల్లవి :

పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
కఱకఱలే కాని కడగంట లేదు


చ. 1:

హరి నిన్న భుజియించి చాలునన్న యన్నమే
అరిది నేఁడప్పటిని నాస రేఁచీని
ధరలో రాతిరి గూడి తనిసిన సతులే
పరగ నప్పటిని విభ్రాంతి రేఁచీని


చ. 2:

మాయఁ గట్టి విడిచిన మలినపుఁ గోకలు
యీయెడ నుదికితేనే యిచ్చ రేఁచీని
కాయముపై మోఁచి పెట్టెఁ గట్టివేసిన సొమ్ములు
మాయలై దినదినము మమత రేఁచీని


చ. 3:

నీవు వట్టిన చలమో నేము సేసినట్టి తప్పో
శ్రీవేంకటేశ్వరుఁడ చిక్కితి మిందు
మోవరాని మోపయి ములుగనియ్యదు మమ్ము
చేవ సంసారముపైఁ జమ్మి రేఁచీని

రేకు: 0261-05 బౌళి సం: 03-353 రామ


పల్లవి :

ఇంకానేలా తర్కవాదములు యిన్నియు నిందునే ముగిసెను
యింకానేలా కొందరు మోక్షం బెవ్వరికిని లేదనుమాటా


చ. 1:

సరయువు పొంతను సకల జీవులకు
సిరుల మోక్షమిచ్చితివని విన్నపుడే
మరలుచు నాయనుమానము వాసెను
ధర నీవొకఁడవే దైవమవని కంటినయ్యా


చ. 2:

తగిన లంకవొద్దను రాక్షసులను
తెగనడిచి ముక్తితెరువు చూపినపుడే
వగలఁ బెక్కుదేవతల వరంబులు
జగతి నీపగకు సరిగావయ్యా


చ. 3:

యేమని చెప్పుదునిట్టి నీ మహిమ
వేమరుఁ బురాణవిధి విన్నపుడు
శ్రీమంతుఁడవు శ్రీవేంకటేశ్వర
కామింప నీకంటే ఘనము లేదుగదవోఅయ్యా

రేకు: 0261-06 సామంతం సం: 03-354 వైరాగ్య చింత


పల్లవి :

అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను
నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో


చ. 1:

వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా
చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా
ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా
యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో


చ. 1:

యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా
తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా
ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా
పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో


చ. 1:

యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా
కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా
యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా
నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో