తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 259

రేకు: 0259-01 ముఖారి సం: 03-337 విష్ణు కీర్తనం


పల్లవి :

పుణ్యమున నన్నుఁగాచి పురుషార్ధివౌదుఁ గాక
గణ్యమా నే నీకు నాకత యెంతవున్నది.


చ. 1:

వెలయ నిన్నుఁబొగడే వేదము లనంతములు
యెలమి నిన్నుఁ బొగడ నెంతవాఁడను
యిల నిన్నుఁ బూజించేరు ఋషులు కోటానఁగోటి
అలరి నిన్నుఁ బూజించేయంతవాఁడనా


చ. 2:

శరణు నీకుఁ జొచ్చిన జంతువు లనంతములు
వరుస నే నందులో నెవ్వరిఁ బోలుదు
సొరిది నిన్నుఁ గొలిచే సురలు సేనా సేన
పరగ నేఁ గొలిచేటి పని నీకు నెంత


చ. 3:

కాల మెంతైనాఁ గద్దు కర్మములు వేవేలు
ఆలించ నందులో నే నణుమాత్రము
తాలిమి శ్రీవేంకటేశ దయాధర్మము నీది
పాలించవే నీవు నన్నుఁ బలుకు లేమిటికి

రేకు: 0259-02 లలిత సం: 03-338 వైరాగ్య చింత


పల్లవి :

నాలో నున్నాఁడవు నన్నుఁ గావ(క) నీకుఁబోదు
యీలీలఁ బట్టుచీరెరవిచ్చిన వానివలె


చ. 1:

చుట్టుకొంటిఁ గర్మములు సొరిదిఁ బసిరికాయ
నట్టనడిమి పురువునడకవలె
వట్టిజాలిఁ దిరిగితి వడిఁ బంచేంద్రియముల
పట్టిన నీటిలో జలభ్రమణమువలెను


చ. 2:

ధరలోనఁ బుట్టి పుట్టి తగ వచ్చినందే వచ్చి
వరుస రాట్నపుగుండ్రవలె నైతిని
అరసి నే నంటుకొంటి అంగనల పొందులను
చొరఁబారి వేలుకాడే సూదిరాతివలెను


చ. 3:

అంతటను స్వర్గనరకాదిలోకాలు మెట్టితి
బంతిగట్టి నురిపెడి పసురమునై
చెంతల శ్రీవేంకటేశ చేరితి నీవద్ద నేఁడు
వంతుకుఁ గామధేనువు వద్ది దూడవలెను

రేకు: 0259-03 సామంతం సం: 03-339 వైరాగ్య చింత


పల్లవి :

జననమరణములు జంతురాసులకు
వెనకముందరను విడువని కొలలు


చ. 1:

తలఁచినచోటను తగుదేహములై
పొలసిపోయినాఁ బోనీవు
వెలుపల లోపల వెలయ భోగములు
కలలోపలివలెఁ గన్నది తెలివి


చ. 2:

 పూచినచోటుల పుత్రమిత్రులై
కాఁచి కరఁచినాఁ గరఁగవివి
తూఁచిన నిరుదెస దుఃఖసుఖంబులు
వూఁచి విడుచుటే వోపిన తెలివి


చ. 3:

అనాది వాసనలంటిన జిగురులు
మనోగుణములై మానవివి
వినోదములు శ్రీవేంకటేశుకని
కనే వుపాయము కందువ తెలవి

రేకు: 0259-04 ధన్నాసి సం. 03-340 వైరాగ్య చింత


పల్లవి :

అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా
దిక్కుల నిదె ఇన్నియుఁ దీరుచుకొంటిమయ్యా


చ. 1:

తనువిది మలమూత్రంబుల దాకొనియుండిన పట్ణము
దినదినమును వుచ్చిష్టపుదిడ్లఁ దూరెదము
జననము నెత్తురు నెమ్ములు సారెకు నూరెడిగుంతలు
మనిమని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము


చ. 1:

మదనజలంబుల కాలువ మాపెద్దల పూర్వంబులు
పొదలిన పుత్రుల యిసిళ్లపుట్టలు పెట్టెదము
యెదుటనె సంసారంబులు యెడయని కారాగృహములు
మదిమది నరకము చవిగొను మనుజుల మిదె నేము


చ. 1:

వుట్టినదే నగ్నత్వము బూతో బండో యెరఁగము
చిట్టంట్లవాచవులగు జీవుల మ్రింగెదము
నెట్టన శ్రీవేంకటేశ్వర నీతోఁ గూడఁగ జగములు
మట్టినచోటే మట్టే మనుజుల మిదె నేము

రేకు: 0259-05 దేసాక్షి సం: 03-341 వైరాగ్య చింత


పల్లవి :

తప్పులు వొప్పులు దేహి తన మూలమే
రెప్పలతుద నివిగో రేపులు మాపులును


చ. 1:

తనలోని పాపములే తగిలి యెదిటివారి-
నినుపు నేరములై నిందింపించు
మనసులో పుణ్యములే మహిఁ గన్నవారిమీఁద
పొనుఁగని నేరుపులై పొగడింపించును


చ. 2:

తొల్లిటి మరణములు తోడనే పుట్టినపుడే
యెల్లవారుఁ జూడఁగాను యేడుపించును
పెల్లరేఁగి తాఁజేసే పెనుఁ గర్మబంధములే
మెల్లనే నానాఁటికి మేను గొప్పచేసును


చ. 3:

సావిఁ దన నడకలే స్వర్గనరకములై
జీవులకు మాయగప్పి చిక్కింపించు
శ్రీవేంకటేశ్వరు సేవ చేతిలోని మోక్షమై
కేవలపు ప్రపంచము గెలుపించును

రేకు: 0259-06 శ్రీరాగం సం: 03-342 గురు వందన, నృసింహ


పల్లవి :

నడుమ రెంటికిని నా మేను
వడఁబడె యెందలివాఁడనొ నేను


చ. 1:

కంటిమి జగమిది కన్నుల యెదుటను
అంటి యిదియు నిజమనరాదు
వింటి స్వర్గము వేరే కలదని
కంటగించి అది గాదనరాదు


చ. 2:

కట్టుకొంటి మిదె ఘనసంసారము
గట్టిగ నిఁకఁ దొలఁగఁగరాదు
పట్టుకొంటి మిదె పాపపుణ్యములు
తెట్టదెరువుననె దించాలేము


చ. 3:

నగితి నొకసెలవి నానాఁటి బదుకు
మొగి నొకచే నిను మొక్కితిని
అగపడె శ్రీవేంకటాధిప నీకృప
నిగుడి గురుచే నినుఁ గనఁగలిగె