తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 252


రేకు: 0252-01 మలహరి సం: 03-296 అధ్యాత్మ

పల్లవి:

ఇన్నిటి మూలం బీశ్వరుఁ డాతని-
మన్నన కొలఁదినె మలయుటఁ గాక

చ. 1:

మాయామయమై మనియెడి జగమిది
చాయల నిందు నిజము గలదా
కాయము సుఖదుఃఖములకుఁ బొత్తిది
రేయిఁబగలు నొకరీతే కలదా

చ. 2:

దైవాధీనము తగు సంసారము
వావిరి జీవుల వసమవునా
ధావతి మనసిది తన కర్మమూలము
వేవేలై నా విడువఁగ వశమా

చ. 3:

పంచేంద్రియములఁ బరగేటి బ్రదుకిది
చంచలంబు నిశ్చలమవునా
యెంచఁగ శ్రీవేంకటేశ్వరు కృపతో
సంచయమయితే సతమవుఁగాక


రేకు: 0252-02 ధన్నాసి సం: 03-297 నామ సంకీర్తన

పల్లవి:

ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్లా
చెందిన మాకిఁక బుద్ది చెప్పవే నారాయణా

చ. 1:

హరినామ మొకటనే అణఁగెఁ బాపములు
వొరసి యన్నినామము లూరకున్నవి
సిరులిచ్చెఁ గలవెల్లా శ్రీపతినామ మొకటే
పెరనామములెల్లా పెట్టెలలో నున్నవి

చ. 2:

గోవిందనామ మొకటే కూడపోసెఁ బుణ్యములు
వేవేలు నామములకు వెలలున్నవా
శ్రీవిష్ణునామ మొకటే చేతికిచ్చె వైకుంఠము
తావైయున్న నామములు తమకించీ నీవికి

చ. 3:

ఇత్తల కేశవునామ మియ్యఁగలవెల్లా నిచ్చె
పొత్తుల నామములెల్లాఁ బొంచుకున్నవి
చిత్తమున నిన్నుఁ జూపె శ్రీవేంకటేశ నామమే
హత్తిన నామములెల్లా నందులోనే వున్నవి


రేకు: 0252-03 భూపాళం సం: 03-298 ఆరగింపు

పల్లవి:

వేఁకునఁ దిరుపళచ్చి విష్ణునికిఁ జేయరో
ఆఁకటి కొదగినట్టి ఆరగింపులు

చ. 1:

అతి బ్రహ్మాండాలు గుక్షి నటు ధరించినయట్టి-
అతనికిఁ జేయరో ఆరగింపులు
ప్రతిలేని క్షీరాబ్దిఁ బవళించి లేచినట్టి-
చతురునికిఁ జేయరో చవి నారగింపులు

చ. 2:

యేడుదినములదాఁకా నెత్తెను గోవర్ధనము
ఆడివచ్చే బాలునికి నారగింపులు
మేడెపు గోపికలతో మిక్కిలిఁ బెనఁగినట్టి-
వేడుకకానికిఁ దేరో విందు లారగింపులు

చ. 3:

పట్టపుదేవుళ్లుఁ దాను బంతి సాగి వున్నవాఁడు
అట్టె సేయరో పులుఁగ మారగింపులు
నెట్టన శ్రీవేంకటాద్రినిలయుఁ డారగించీని
మట్టులేక వడ్డించరో మంచి యారగింపులు

రేకు: 0252-04 దేసాక్షి సం: 03-299 ఆరగింపు


పల్లవి :

ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు
రూపులతోఁ బదివేలు రుచులై నట్లుండెను


చ. 1:

మేరుమందరాలవలె మెరయు నిడ్డెనలు
సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు
ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను
బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను


చ. 2:

పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు
వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు
బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను
అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను


చ. 3:

పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును
వండి యలమేలుమంగ వడ్డించఁగా
అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ
దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను

రేకు: 252-05 గుండక్రియ సం . 03-300 నృసింహ, రామ


పల్లవి :

జయ జయ రామా సమరవిజయరామా
భయహర నిజభక్తపారీణ రామా


చ. 1:

జలధి బంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్యరామా
కలిగి యజ్ఞము గాచే కౌసల్యరామా


చ. 2:

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురుమౌనులనుఁ గాచే కోదండరామా
ధర నహల్య పాలిటి దశరథరామా
హరురాణి నుతుల లోకాభిరామా


చ. 3:

అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణరామా
వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా
మతిలోనఁ బాయని మనువంశరామా

రేకు: 0252-06 సాళంగనాట సం: 03-301 హనుమ


పల్లవి :

మొక్కరో మొక్కరో వాఁడె ముందరనిలుచున్నాఁడు
యెక్కువ రామునిబంటు యేకాంగవీరుఁడు


చ. 1:

పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుఁడు
పట్టేను యెడమచేతి బలుముష్టి
మెట్టినాఁడు పాదముల మించు రాకాశితలలు
కొట్టేననుచు నెత్తె గొప్ప వలకేలు


చ. 2:

వంచెను శిరసుమీఁద వాలుగాఁ దన తోఁక
పెంచెను మిన్నులుమోవ పెనుదేహము
నించినాఁడు రౌద్రము నిడుపాటిదవడల
కాంచనపు పుట్టుకాశ కడు బిగిఇంచెను


చ. 3:

పెనచి తొడలుదాఁక పెద్ద పదకము వేసె
తనువుపై వేలాడే దండల తోడ
అనయము శ్రీవేంకటాద్రిదేవుని బంటు
వెనుబలమై యున్నాఁడు విట్ఠలములోనను