తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 244
రేకు: 0244-01 భైరవి సం: 03-248 నామ సంకీర్తన
పల్లవి:
ఏపాటి గలవాఁడ నిదివో నేను
నాపాటు చూచి హరి నన్నుఁ గావఁగదవే
చ. 1:
నిలువు నూరు వండీని(?)) నిచ్చలు నీదేహమైతే
వొలిసీ దుఃఖములకు నోరువ లేదు
కులము గోటిసేసును గుంపుల జన్నాదులైతే
అలరి వొరులఁబోయి అడిగేదే యెపుడు
చ. 2:
పట్టితే పసిఁడి రాలీ బచ్చన సంసారము
గుట్టుదెలియఁ బ్రాణము కూటిచేతిది
వుట్టిపడీ మానుషము వొకనాటి కొకనాఁడు
పట్టికాంతలయెదుట భంగపడే మిదివో
చ. 3:
చేరి చెట్టడిచితేను చేటఁడు చుట్టరికాలు
యీరీతి నిన్నాళ్లదాఁకా నెందుండిరో
ఆరిచితే మూరెఁడెక్కీనదే నామకీర్తనము
కూరిమి శ్రీవేంకటేశ కొన నాలికెకును
రేకు: 0244-02 వరాళి సం: 03-249 శరణాగతి
పల్లవి:
దైవమా నీచేతిదే మాధర్మపుణ్యము
పూవువంటి కడు లేఁతబుద్ధివారము
చ. 1:
యేమిటివారము నేము యిదివో మాకర్మ మెంత
భూమి నీవు పుట్టించఁగఁ బుట్టితిమి
నేమముతో నడచేటి నేరుపేది మావల్ల
దీముతో మోచిన తోలుదేహులము
చ. 2:
యెక్కడ మాకిఁక గతి యెరిఁగే దెన్నఁడు నేము
చిక్కినట్టి నీ చేతిలో జీవులము
తక్కక నీ మాయలెల్లఁ దాఁటఁగలమా మేము
మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము
చ. 3:
యేది తుద మొదలు మాకిఁక నిందులో నీవే
ఆదిమూర్తి నీకు శరణాగతులము
యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నీదయ గలుగఁగాను నీ వారము
రేకు: 0244-03 బౌళి సం: 03-250 శరణాగతి
పల్లవి:
శరణు నేఁ జొచ్చినది సరి నీవు మన్నించేది
యిరవైన గురుతుగా కిందుఁ గూడపెట్టేవా
చ. 1:
యెంగిలినోరు వెట్టుక యే మాటలాడినాను
సంగతిగా నవి నేఁడు సత్యమయ్యీనా
అంగనల మోహము నాయంతరంగానఁ బెట్టక
ముంగిటి ఆచారాలు ముఖ్యమయ్యీనా
చ. 2:
ఆసలు మెడఁగట్టుక అన్ని యుఁ జదివినాను
దోసములెల్లా మాని దొరనయ్యేనా
రోసాలు మదిఁబెట్టుక రోఁతమేను గడిగితే
వేసాలయ్యే తోఁచుఁగాక వేరే పుణ్యమున్నదా
చ. 3:
ఘనసంసారము మోచి కర్మమెంత సేసినాను
తను దా జన్మించినట్టి తప్పు దీరీనా
యెనలేక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
తనిసితి నిఁక నేను తమకించేనా
రేకు: 0244-04 సాళంగనాట సం: 03-251 శరణాగతి
పల్లవి:
ఇంకనేల నాకు వెరపింతమాట గలిగియు
సంకెలెల్లఁ బాసె నాస్వతంత్రము లొక్కటే
చ. 1:
నేనెంత పాపబుద్ధినై నేరమెంత సేసినాను
కానీలే నన్నెలేవాఁడు కావఁగలఁడు
ఆనతిచ్చెఁ దొల్లె యాతఁ డదె చరమార్థమందు
మేనిదోసమెల్లఁ బాపి మేలొసఁగేననుచు
చ. 2:
మట్టులేకతనినెంత మరచి నే వుండినాను
పుట్టించిన దేవుఁడే ప్రోవఁగలఁడు
గుట్టుచూపె తొల్లె తన గుణము పాండవులందు
గట్టిగాఁ దనవారైతే కాచుకుందుననుచు
చ. 3:
తప్ప నే నడచినాను తగిలి శ్రీవేంకటేశుఁ-
డొప్పులు సేసి రక్షించ నొద్దఁగలఁడు
చెప్పనేల గోపికలు సేసిన దోసాలు దొల్లి
కప్పుక పుణ్యాలు సేసె ఘనుఁడఁ దాననుచు
రేకు: 0244-05 భూపాళం సం: 03-252 శరణాగతి
పల్లవి:
నిత్యానందులము నిర్మలులమిదే నేము
సత్యముగ మమ్మాతఁడు సరిఁ బుట్టించఁగను
చ. 1:
యెక్కడవోయి వెదకే మిటమీఁద దైవమును
వొక్కట నంతర్యామై వున్నాఁడదె
ఇక్కడ నాతనిగుణా లెన్నేసి చదివే మిఁక
పక్కన తన దాసుల భక్తికి సులభుఁడు
చ. 2:
యేమేమి వేఁడుకొనేము యిటమీఁద నాతని
నామములు నాలికపై నటించీనదే
నేమమున నింకా నెట్టు నిచ్చలు భుజించేమో
కామించి సంసారపు కైంకర్య మాతనిదే
చ. 3:
ధ్యాన మేమని సేసేము తలఁచినందెల్లాను
పూని శ్రీవేంకటేశుఁడే వుండఁగాను
నానాఁట నిఁక నేమి నమ్మితి మనేదేమి
పేని మమ్ముఁ దన కుక్షిఁబెట్టి పెంచఁగాను
రేకు: 0244-06 మాళవిగౌళ సం: 03-253 కృష్ణ
పల్లవి:
ఏమని చెప్పగవచ్చు నీసంతోషవుసుద్ది
నామము శ్రీకృష్ణుఁడట నారాయణునికి
చ. 1:
జనని దేవకిదేవి జనకుఁడు వసుదేవుఁ-
డనఘుడైనయట్టి ఆదిమూర్తికి
ఘనలోకరక్షణ కంసుమామ గండమును
తనకుఁ గారణమట దైవశిఖామణికి
చ. 2:
పుట్టినది మధుర పెంపుడుఁజోటు రేపల్లె
వొట్టిన మాయల పురుషోత్తమునికి
పట్టిన పాండవపక్షపాతము కౌరవవైర-
మిట్టి వ్రాఁతఫలమట యీశ్వరేశ్వరునికి
చ. 3:
గోవులఁ గాచేదియు గొల్లెతలఁ బొందేదియు
ఆవేళ గుణము యీ యచ్యుతునికి
శ్రావణబహుళాష్టమి చంద్రోదయము రోహిణి
కావింప జన్మమిదివో శ్రీవేంకటపతికి