తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 239
రేకు: 0239-01 బౌలి. సం: 03-222 భగవద్గీత కీర్తనలు
పల్లవి:
నీవొక్కఁడవే సర్వాధారము నిన్నేయెరిఁగిననన్నియు నెఱఁగుట
భావించి యింతయుఁ దెలియఁగ వలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు
చ. 1:
నీయందె బ్రహ్మయు రుద్రుఁడు నింద్రుఁడు నీయందె దిక్పాలకులు
నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వాఖ్యదేవతలు
నీయందె వురగులు యక్షరాక్షసులు నీయందె గరుఁడగంధర్వులు
నీయందె పితరలు సిద్ధసాధ్యులు నీయందె ద్వాదశాదిత్యులు
చ. 2:
నీవలననె కిన్నరకింపురుషులు నీవలననె విద్యాధరులు
నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు
నీవలననె గ్రహములు చంద్రుఁడును నీవలన(నె?) నభోంతరిక్షములు
నీవలననె జలధులు పవమానుఁడు నీవలననె గిరులును భూమియును
చ. 3:
నీలోననె నదులును నగ్నియు నీలోననె సచరాచరములును
నీలోననె వేదశాస్తము మొదలుగ నిఖిలశబ్దమయము
నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిది మతము
రేకు: 0239-02 మలహరి సం: 03-223 అధ్యాత్మ
పల్లవి:
దేహము సమ్మంధము యివి దేహికిఁ బనిలేదు
వూహించ నేర్చినవారలే వోరుచుకుందురయ్యా
చ. 1:
విడువవు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు
వెడవెడ మరణభయంబులు విడిచినయందాఁకా
వుడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు
పొడవగు విరక్తి తనలోఁ బొడమినయందాఁకా
చ. 2:
మానదు చిత్తవికారము మానదు దుర్గణదోషము
మానదు భోగము లన్నియు మానినయందాఁకా
పోనీదు సేసిన దురితము పోనీదు వ్రాఁతఫలంబును
పూనిన తన యజ్ఞానము పోయినయందాఁకా
చ. 3:
తెగవటు భవబంధంబులు తెగ వెడయని గర్వంబులు
నిగిడిన యీ యీత్మజ్ఞానము నీవిచ్చినయందాఁకా
జగదేకవిభుఁడ శ్రీవేంకటేశ్వర సర్వము నీయానతికొలఁదే
తగులుచుండు నివినిశ్చలముగ నీదాస్యము గలిగినయందాఁకా
రేకు: 0239-03 దేవగాంధారి. సం: 03-224 ఉపమానములు
పల్లవి:
చూడవే గోవింద సోద్యము లిన్నియు
యేడాఁ గర్తపు యిన్నిట నాకు
చ. 1:
చీరినఁ దునుఁగక చేసిన దురితము
నారవలెనే కడు నారటిలీ
కారుకొని తలఁపు కలఁకగుణంబుల
వారక పెనునదివలెఁ బారీని
చ. 2:
యెఱ్ఱఁగాఁ గ్రూరత్వ మెప్పుడుఁ గొలిమిలో
కఱ్ఱువలెనే కడుఁగాఁగీని
వొఱ్ఱియై ప్రకృతి వొరసి వేఁటలో
యిఱ్ఱివలెనే యెలయించీని
చ. 3:
వీడక నీమూర్తి వెంటవెంటనే
తోడునీడయై తొరలీని
యీడనే శ్రీవేంకటేశ నీ మహిమ
వాడని వనములవలెఁ జిగిరించీని
రేకు: 0239-04 ముఖారి సం: 03-225 అధ్యాత్మ
పల్లవి:
ఎవ్వరి వసము గెల్వ నింతా వీనిమయమే
యివ్వల నీవు గాచితేనేమోకాని
చ. 1:
వొక్కలోభము నెంచితే వొగి లోకమెల్లాఁ దానే
యెక్కడ చూచినాఁ దానే యీదీపనము
వెక్కసమైనది తానే వేగిలేచి సేసేపని
తక్కక యిన్నిటా నెట్టు తప్పించుకోవచ్చును
చ. 2:
పలుమారు వచ్చీఁదానే పనిలేని పరాకు
వళచుకొన్నది తానే వట్టిభీతి
నిలుచుకున్నది తానే నిలువుననే సిగ్గు
మెలుపున నెటువలె మెదలఁగవచ్చును
చ. 3:
కనుగొంటే నెందూఁ దానే కార్పణ్యము దైన్యము
అనిశము మించీఁ దానే యాచకత్వము
నను నేలకొంటి విదే నమ్మితి శ్రీవేంకటేశ
జనుఁడను యివి నేను సాధించుటెట్టు
రేకు: 0239-05 మాళవిగౌళ సం: 03-226 వేంకటగానం
పల్లవి:
ఇంద రెరిఁగినపని కిఁకఁ దప్పించుకోరాదు
పొందుగాని మాయలఁ బొరలఁగ నేఁటికి
చ. 1:
గతియై బ్రహ్మాండాలు కల్పించ నేరిచి
సుతులై బ్రహ్మాదులు చూపట్టఁగా
క్షితి వేదశాస్త్రాలచేతఁ బొగడించుకొంటా
నితరు లెరఁగకుండా నింత దాఁగనేఁటికి
చ. 2:
వున్నత పరమపద మొసఁగ నీవు గర్తవై
అన్నిటా లక్ష్మీనాథుఁడవనఁ బెంపొంది
పన్నుక యిన్నివిద్యలాఁ బ్రసిద్ధుఁడై వుండి
కన్నులకుఁ బ్రత్యక్షముఁ గాకుండ నేఁటికి
చ. 3:
సురల యాపదలెల్లా సులభాననె తీర్చి
పరగ ధర్మములెల్లాఁ బరిపాలించి
పరుషలకు వరాలు పలుమారుఁ గృపచేసి
మరిగి శ్రీవేంకటేశ మాటాడ వదేఁటికి