తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 230
రేకు: 0230-01 లలిత సం: 03-168 వైరాగ్య చింత
పల్లవి:
ఎట్టున్నదో నీచిత్త మెదురాడ నే వెఱతు
గట్టిగా హరి నీమాయ కడవఁగరాదు
చ. 1:
నిచ్చ పతితులఁ జూచి నేను సంసారినై యుందు
అచ్చపు సన్యాసులఁ జూచటువలె నయ్యేనందు
హెచ్చి మోచి వచ్చితేను యెక్కడిగొడవ యందు
ఇచ్చట నిశ్చలబుద్ధి యెందూ నేఁగానను
చ. 2:
కర్ములఁ జూచొకవేళ కర్మము నేఁ జేయఁబోదు
మర్మపు జ్ఞానులఁ జూచి మంచిదందును
అర్మిలి రెండూఁ జూచి అంతలో సందేహింతు
నిర్మలమయిన బుద్ధి నే నెందుఁ గానను
చ. 3:
వారఁణాసి వోఁజూచి వారివెంటఁ దగులుదు
తేరి కొంత దవ్వు వోయి తిరుగుదును
నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి
యీ రీతి దేరిన బుద్ధి యెందూ నే గానను
రేకు: 0230-02 లలిత సం: 03-169 శరణాగతి
పల్లవి:
శ్రీపతి యీతఁడుండగాఁ జిక్కినవారి నమ్ముట
తీపని మీసాలమీఁది తేనె నాకుట సుండీ
చ. 1:
తలఁచినంతటిలోనె దైవ మెదుటఁ గలఁడు
కొలువనేరనియట్టి కొరతే కాని
ఇల నరులఁ గొలుచు టెందో కోకలు వేసి
బలుకొక్కెరలవెంటఁ బారాడుట సుండీ
చ. 2:
శరణన్నమాత్రమున సకలవరము లిచ్చు
నిరతి మరచినట్టి నేరమే కాని
పోరి నితరోపాయానఁ బొరలుట గాజుఁబూస
గరిమ మాణికమంటాఁ గట్టుకొంట సుండీ
చ. 3:
చేత మొక్కితేఁ జాలు శ్రీవేంకటేశుఁడు గాచు
కాతరాన సేవించని కడమే కాని
యీతల నిది మాని మరెన్నిపుణ్యాలు సేసినా
రీతి నడవిఁగాసిన రిత్తవెన్నెల సుండీ
రేకు: 0230-03 బౌళి సం: 03-170 వైరాగ్య చింత
పల్లవి:
కొలఁది పుణ్యపాపాలే కొంగు రొక్కములు వెట్టి
వెలదెంచి బేరమాడ వేగిరమే రారో
చ. 1:
జననాలు మరణాలు సంసారభోగములును
అనిశము భూమి మీఁద నగ్గువలు
కొనేవారుఁ దినేవారు కూడికూడి మూఁకలై
దినసంత లెక్కెనిదే దేహులాల రారో
చ. 2:
అంగనల వలపుల అంగళ్లు వెట్టిరదే
చెంగట వయసులనే చింతల కింద
సంగతిఁ గాయమనే సంచుల నించుకొందము
చెంగి పోరాదు మనకు జీవులాల రారో
చ. 3:
లంపటాలు సంపదలు లలి నంబారాసులాయ
ఇంపుల ముంచి తలల కెత్తుకోరో
దింపక ఇందులోననే తిరిగి శ్రీవేంకటేశు-
పంపున లాభము చేరె ప్రాణులాల రారో
రేకు: 0230-04 ముఖారి సం: 03-171 శరణాగతి
పల్లవి:
దైవమా వో దైవమా నన్ను దయఁజూడ దగదా
నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా
చ. 1:
చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను
భువి దొల్లే నోచితి పుట్టేనంటాను
యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా
నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా
చ. 2:
మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను
వెగటు లంపటమైతే వేసరుకొందు
వగపును నగవును పడి నొక్క మొకమందే
తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా
చ. 3:
మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని
సతులంటా సుతులంటా సంసారినైతి
గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే
యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను
రేకు: 0230-05 లలిత సం: 03-172 శరణాగతి
పల్లవి:
హరి నిను నెరఁగని యలమటలింతే శాయ
శరణంటి నిదె నీకే సర్వేశ కావవే
చ. 1:
చొచ్చితి స్వర్గము దొల్లి సుక్కతములెల్లాఁ జేసి
ఇచ్చఁ గొలిచితి సుర లిందరిని
గచ్చులఁ బుణ్యము ధీరఁ గమ్మటి జన్మములకే
వచ్చితి పురుషార్థము వడి నెందూ గానను
చ. 2:
వెదకితి భూములెల్ల విశ్వకర్తెవడో యంటా
చదివితిఁ బుస్తకాలు సారెసారెకు
తుద ననుమానమున దొమ్మి నీకలు దెల్లఁగా
ముదిసితి నింతేకాని ముందరేమీఁ గానను
చ. 3:
చింతలెల్ల నుడిగితి శ్రీవేంకటేశ్వర నిన్ను
వింత లేక శరణని వెలసితిని
చెంతల నిన్నాళ్లదాఁకా చిక్కి కర్మముల వట్టి
గంతులు వేసితిఁగాని కడ గాననైతిని
రేకు: 0230-06 మాళవిగౌళ సం: 03-173 శరణాగతి
పల్లవి:
నీకు నాకు నెట్టుగూడె నీ వెట్టు నన్నేలితివి
యీ కరుణకే మొక్కితి నిందిరారమణా
చ. 1:
కమలాక్ష నీ వనంతకల్యాణగుణనిధివి
అమితదుర్గుణరాసి నన్నిటా నేను
అమరఁగ స్వతంత్రుఁడ వటు నిన్ను నెంచితేను
తమి నించుకంతా స్వతంత్రుఁడ నేఁ గాను
చ. 2:
దేవ నీవైతే సర్వదేవరక్షకుఁడవు నే
జీవుఁడ నింద్రియాలఁ బెంచేవాఁడను
ఆవల బ్రహ్మాండాల కన్నిటా బొడవు నీవు
భావించ నేనణువై పరగేటివాఁడను
చ. 3:
నానార్థసంపన్నుఁడవు నావల్ల నేమి గంటివి
ఆనుక నా యంతర్యామివై పాయవు
శ్రీనిధివి నీవైతే శ్రీవేంకటాద్రిపతివి
దీనుఁడ నొకఁడ నేను ద్రిష్టించి కాచితివి