తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 226


రేకు: 0226-01 సాళంగనాట సం: 03-144 హనుమ

పల్లవి:

అవధారు దేవ హరికులరామ
వివిధమై నీబంటు వెలయుచున్నాఁడు

చ. 1:

అదె కలశాపురము హనుమంత రాయఁడు
కదనములోన రక్కసులఁ గొట్టి
యెదుట నిందరిలోన నేకాంగవీరుఁడై
కొదలేక ప్రతాపించి కొలువై వున్నాఁడు

చ. 2:

చల్లని వనాలనీడ సాగుడుఁ గొండలోన
వల్లెగా వేసుకొన్న వాలముతోడ
పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని
కొల్లున మంటపములోఁ గొలువై వున్నాఁడు

చ. 3:

పెక్కు పండ్లగొలలు పిడికిటఁ బట్టుకొని
చక్కఁగాఁ బెరిగి పెద్దజంగ చాఁచి
యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ
గుక్కక నీపై భక్తిఁ గొలువై వున్నాఁడు


రేకు: 0226-02 మాళవిగౌళ సం: 03-145 తేరు

పల్లవి:

రెక్కలకొండవలె మీరిన బ్రహ్మాండమువలె
వెక్కసమైన తేరుపై వెలసీని దేవుఁడు

చ. 1:

బిఱబిఱఁ దిరిగేటి పెనుబండికండ్లతో
గుఱుతైన పడగెల గుంపులతో
తఱితో ధరణి గ్రక్కదలఁ గదలెను తేరు
మెఱసీ వీధివీధుల మేఁటియైన దేవుఁడు

చ. 2:

ధగధగమను నాయుధపు మెరుఁగులతోడ
జిగిమించుఁ బగ్గముల చేరులతో
పగటు రాకాసులపైఁ బారీనదె తేరు
నిగిడి నలుదిక్కుల నీటు చూపీ దేవుఁడు

చ. 3:

ఘణఘణ మనియెడి గంటల రవముతోడ
ప్రణుతి నలమేల్మంగ పంతాలతోడ
రణములు గెలిచి మరలెనదే తిరుతేరు
గణుతికెక్కెను శ్రీవేంకటగిరిదేవుఁడు


రేకు: 0226-03 దేసాళం సం: 03-146 అధ్యాత్మ

పల్లవి:

ఇందిరయుఁ దానుఁ గూడి యిట్టె వరాలొసఁగుతా
సందడించి దిక్కులెల్లా సాధించీ నిదివో

చ. 1:

వేదములే గుఱ్ఱములు విష్ణుని రథమునకు
వాదపు శాస్త్రములే తీవ్రపుఁ బగ్గాలు
పాదగు పంచభూతాలే పరగు బండికండ్లు
ఆదిగొని మనోవీధులందు నేఁగీ నిదివో

చ. 2:

జీవులెల్లా సారథులు శ్రీవిభుని తేరునకు
కావించుఁ నెజ్ఞాలు పడిగల గుంపులు
భావించఁ దన ప్రకృతి పట్టపుసింహాసనము
వేవేలు సంపదలతో వెలసీ నేఁడిదివో

చ. 3:

చందురుఁడు రవియును సరుస బైఁడికుండలు
చెందిన పుణ్యములెల్ల సింగారాలు
అందపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను
కందువల మెరయుచు కరుణించీ నిదివో


రేకు: 0226-04 ఆహిరి సం: 03-147 పోలికలు

పల్లవి:

విన్నపము లేమి సేసే వేగినంతాను
మన్నించి రక్షించే నీ మహిమలే ఘనము

చ. 1:

నీవంక నేరమి గద్దా నేనే అపరాధిని
దేవ నే జడుఁడఁగాన తెలుసుకోను
వావాత మీగురుఁ డాడేవాక్యము నీయాధీనము
పావనమైన నీపలుకెల్లా సత్యము

చ. 2:

మంచితనమల్లా నీదె మాయదారివాఁడ నేను
చంచలుఁడఁ గనక వివా(చా?)రించుకోను
అంచల నీదాసుని ఆనతి యమోఘము
యెంచ నీవిచ్చిన వరమెం(మిం?)దుకంటే బలువు

చ. 3:

కరుణెల్లా నీసొమ్ము కఠినచిత్తము నాది
నరుఁడఁ గనక అట్టె యరసుకోను
పరగ మా జనకుని ప్రతిజ్ఞయు నీపంపు
నిరతి శ్రీవేంకటేశ నీపంతము సతము


రేకు: 0226-05 రామక్రియ సం: 03-148 హనుమ

పల్లవి:

మొక్కరయ్య అన్నిటికి మూల మీతఁడు
చుక్కలు మొలపూసలై సొంపుమీరీ నితఁడు

చ. 1:

అదె కలశాపుర హనుమంతుఁడు
వుదయార్కు ఫలమని వొగ్గుచున్నాఁడు
వుదుటు బాలక్రీడ నుబ్బుచున్నాఁడు
మదించి రామునిబంటై మలయుచున్నాఁడు

చ. 2:

జలనిధి కొకజంగ చాఁచుకున్నాఁడు
యిలఁ బ్రతాపమునఁ జేయెత్తుకున్నాఁడు
బలువాల మల్లార్చి పట్టుకున్నాఁడు
వెలయఁగఁ గీలుగంటు వేసుకున్నాఁడు

చ. 3:

సరుగ లంకారాజ్యము సాధించినాఁడు
అరిది సీతకు సేమ మందించినాఁడు
నిరతి శ్రీవేంకటాద్రినిలయునికి
పరగిన సేవలనుఁ బ్రబలుచున్నాఁడు


రేకు: 0226-06 శంకరాభరణం సం: 03-149

పల్లవి:

అక్కలాల చూడుఁడందరును
నిక్కి వారవట్టీ నేఁడు గృష్ణుఁడు

చ. 1:

ఆనవాలవుట్టి అడుకులవుట్టి
పానకపుటుట్టి బలిమినే
ఆనుక కోలల నందియంది కొట్టి
తేనెవుట్టి (?) గొట్టీ దేవకీసుతుఁడు

చ. 2:

పెరుగువుట్టి మంచి పేరిన నేతివుట్టి
సరివెన్నవుట్టి చక్కెరవుట్టి
వెరవుతోఁ గొట్టి వెస బాలులతో
పొరుగువుట్టి (?) గొట్టీ పొంచి రాముఁడు

చ. 3:

మక్కువ నలమేలుమంగఁ గూడి నేఁడు
చొక్కి శ్రీవేంకటేశుఁడు వీధుల
నిక్కి వుట్లెల్లా నిండాఁ గొట్టి వుట్టి(?)-
చక్కిలాలు గొట్టీ జగతీశుఁడు