తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 212


రేకు: 0212-01 లలిత సం: 03-067 అధ్యాత్మ

పల్లవి:

చెలఁగి నా కిందుకే చింతయ్యీని
తెలిసినదాఁకా నిది ద్రిష్టమయ్యీనా

చ. 1:

హరి పుట్టించిన దేహి హరినే కొలువక
నరులఁ గొలుచుట అన్యాయమయ్యా
గరిమ నేరు గుడిచి కాలువఁ బొగడఁబోతే
యెరవెరవే కాక యితవయ్యీనా

చ. 2:

దేవుఁ డిచ్చినట్టి బుద్ది దేవుని పయిఁ బెట్టక
భావ మింద్రియాల కియ్యఁ బాపమయ్యా
జీవిత మొకరి సొమ్ము జీవించి యొకరి వెంట
ఆవలఁ బరువులిడు టందమయ్యినా

చ. 3:

అరిది శ్రీవేంకటేశుఁ డంతరాత్మయి వుండఁగాను
శరణనకుండు టనాచారమయ్యా
ధరఁ దన యింటఁ గోటిధన మట్టే వుండఁగాను
మరలి తిరియఁబోతే మట్టుపడీనా


రేకు: 0212-02 పాడి సం: 03-068 అద్వైతము

పల్లవి:

కాకుంటే యీ శూన్యవాద కఠినచిత్తుల చేత
పైకొని వివేకులకు బ్రదుకఁగ వచ్చునా

చ. 1:

అల్లనాఁడు నిరాకార మనెడి మాటలచేత
వెల్లిఁబోయ లోకములో విజ్ఞానమెల్లా
కల్లని మీ త్రివిక్రమాకారము చూపి మీరు
చెల్లఁ బెట్టితిరి వేదశిఖలందు మరియు

చ. 2:

ఆలకించి యహంబ్రహ్మ మనెడి బుద్ధుల చేత
గాలిఁ బోయ భక్తి యల్లా కాలమందే
యేలి ప్రహ్లాదునికిఁగా హిరణ్యకశిపు నొద్ద
యేలికబంటువరుస లిందె చూపితిరి

చ. 3:

అంతా నొక్కటియనే అధర్మవిధులచేత
గుంతఁబడెఁ బుణ్యమెల్లాఁ గొల్లఁబోయి
ఇంతట శ్రీవేంకటేశ యెక్కుడు నేనని కొండ
వింతగాఁగఁ బొడవెక్కి విఱ్ఱవీఁగితివి


రేకు: 0212-03 శుద్ధవసంతం సం: 03-069 శరణాగతి

పల్లవి:

చేకొనువారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే
యే కడఁ జూచిన యితరము లేదు

చ. 1:

తలఁపులోన నంతర్యామిదివో
తెలిసి చూచితే ద్రిష్టంబు
చలమునఁ దన మతి సందేహించిన
కలఁగి మూఁడులోకంబుల లేఁడు

చ. 2:

వెసఁ గను దెఱచిన విశ్వాత్మకుఁడిదె
దెసల నింతటా ద్రిష్టంబు
పసిగొని తనుఁ బాపములు భ్రమించిన
కసరి సృష్టి చీఁకటిపడునపుడే

చ. 3:

చేరి కొలిచితే శ్రీవేంకటపతి
సారె బ్రతుకునకు శాసనము
పైరగు తనలో భక్తి వదిలితే
కూరిమి తెర మఱుఁగునకును మఱఁగు


రేకు: 0212-04 వరాళి సం: 03-070 శరణాగతి

పల్లవి:

పెంచి తమ పెట్టుఁజెట్టు పెరికివేయ రెవ్వరు
మంచివాఁడఁ గాకున్న మన్నించకుండేవా

చ. 1:

తెరువు దప్పి యడవిఁ దిరిగేటివారిఁ దెచ్చి
తెరువునఁ బెట్టుదురు తెలిసినవారలు
నరుఁడనై నేరక నడిచేటి నన్ను నీవు
మరిగించి కావక మానవచ్చునా

చ. 2:

దిక్కుమాలినట్టివారిఁ దెచ్చి దయగలవారు
దిక్కయి కాతురు వారి దిగఁదోయరు
తక్కక మాయలోఁ బడి దరిదాపు లేని నన్ను
వెక్కసాన రక్షించక విడిచేవా నీవు

చ. 3:

ఆవల భయపడ్డవా రంగడిఁ బడితే దొర-
లోపల విచారించి వూరడింతు రంతలోనే
శ్రీవేంకటేశ నీవు సృష్టికల్లా నేలికవు
వేవేలు మా మొర నీవు విచారించకుండేవా


రేకు: 0212-05 సామంతం సం: 03-071 ఉపమానములు

పల్లవి:

ఎన్నఁడు మంచివాఁడ నయ్యేను నేను
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా

చ. 1:

వేఁపమానికిని చేఁదు విడువక వుండేది
యే పొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటానఁ బరగి వుండేటి నేను
చాపలదుర్గుణినౌట సహజమే

చ. 2:

పాముకు విషమెప్పుడు పండ్లఁ బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుఁడ నాకుఁ గరుణ యించుక లేక
సామజపు దుర్మదము సహజమే

చ. 3:

అటుగాన శ్రీవేంకటాధిప నాకిఁక వేరే
తటుకన నేఁడు శాంతము వచ్చీనా
ఘటన నీ కృపయందు గలిగిన మేలు నాపై
తటుకన ముంచి నన్ను దరి చేర్పవే


రేకు: 0212-06 గుజ్జరి సం: 03-072 శరణాగతి

పల్లవి:

వెఱ్ఱి మానుప రెవ్వరు వేఁదురు నాయంత విడువదు
ముఱ్ఱఁబాలలోఁ బుట్టిన ముంచిన వెఱ్ఱెయ్యా

చ. 1:

జగములు రక్షించఁ బాల్పడి సర్వేశ్వరుఁడే వుండఁగఁ
అగణితుఁ డాతనిశక్తి యల్పముగాఁ దెలిసి
జిగి నా సంసారరక్షణ సేసెదనంచునుఁ దిరిగెద
నగుఁబాట్ల యల్పుఁడ నే నావెఱ్ఱిదేయయ్యా

చ. 2:

అంతర్యామై దేవుఁడు అటు సుఖదుఃఖము లొసఁగఁగ
అంతయు మనుజులు సేసేరని నేఁ దిరిగితిని
బంతినే నావంటి జీవులబడిఁ దిరిగాడుచుఁ గర్మపు-
దొంతులఁ జిక్కిననా వెఱ్ఱితోడనే యిదేయయ్యా

చ. 3:

శ్రీవేంకటపతి యెదుటనే చేకొని వరము లొసఁగఁగ
దావతిపడి యితరుల నేఁ దగులుచు నడిగితిని
యీ వేళనే నా గురుఁడును యీ దైవము నిటు చూఁపఁగ
తోవెరిఁగిటు నే బతికితి తొల్లెల్ల వెఱ్ఱినయ్యా