తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 209


రేకు: 0209-01 దేసాక్షి సం: 03-049 భక్తి

పల్లవి:

నీవే నేరవుగాని నిన్నుఁ బండించేము నేము
దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు

చ. 1:

వట్టి భక్తి నీ మీఁద వళుకువేసి నిన్నుఁ
బట్టి తెచ్చి మతిలోనఁ బెట్టుకొంటిని
పట్టెడు దులసి నీపాదములపై బెట్టి
జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు

చ. 2:

నీవు నిర్మించినవే నీకే సమర్పణసేసి
సోవల నీకృపయెల్లఁ జూరగొంటిమి
భావించొకమొక్కు మొక్కిభారము నీపై వేసిరి
పావనపు నీదాసులే పంతపు చతురులు

చ. 3:

చెరువుల నీళ్లుదెచ్చి చేరఁ(రె?)డు నీపైఁ జల్లి
వరము వడసితిమి వలసినట్టు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటి విద్యలనే
దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు


రేకు: 0209-02 దేసాళం సం: 03-050 అధ్యాత్మ

పల్లవి:

ఎన్నఁడు దీరీ నీ తెందేపలు
పన్నిన జీవుల బంధములు

చ. 1:

భారపుఁ జిత్తము ప్రవాహరూపము
వూరెటి మదములు వూటెత్తె
తీర వింద్రయపు దేహభ్రాంతులు
కోరేటి కోర్కులఁ గొండలు వెరిగె

చ. 2:

ఉడికేటి పాపము లుగ్రనరకములు
తొడికేటి కర్మము తోడంటు
విడువవు భవములు వెంటవెంటనే
చిడుముడిఁ జిత్తము చీఁకటి వడెను

చ. 3:

రపణపు భవములు రాట్నపుగుండ్రలు
చపలపు బుద్ధులు జలనిధులు
ఇపుడిదె శ్రీవేంకటేశుఁడ నీవే
కపటము వాయఁగఁ గరుణించితివి


రేకు: 0209-03 ముఖారి సం: 03-051 శరణాగతి

పల్లవి:

నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు
దైవమా సిగ్గువడక తగిలేనేఁ గాకా

చ. 1:

చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయఁగాను
యిందు మా సేవలు నీకు నేడకువచ్చు
పొంది వసిష్ఠాదు లట్టే పూజలు సేయఁగాను
సందడి మాపూజలు సరకా నీకు

చ. 2:

సనకాదియోగులు సారె నిన్నుఁ దలఁచఁగా
యెనసి మాతలఁపు నీ కేడకెక్కును
నునుపుగా శేషాదులు నుతులు నిన్నుఁ జేయఁగా
పనివడి మా నుతులు బాఁతేయనా నీకు

చ. 3:

కిట్టి నారదాదులు నీకింకరులై వుండఁగాను
యిట్టె నీదాసుఁడ ననుటెంత కెంత
వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు
పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనిఁకను


రేకు: 0209-04 లలిత సం: 03-052 అద్వైతము

పల్లవి:

అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
యియ్యెడ నెట్టుగలిగె నీ యసురమతము

చ. 1:

నీ ముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు
కామించి నీ మీఁది భక్తి కడు నొల్లరు
నామమంత్రము నొల్ల రనామయుండ వనెందురు
తాము వైష్ణవుల మంటాఁ దర్కింతురు

చ. 2:

పైతృకవేళ నీపస్రాదమూ నొల్లరు
ఘాతల నూర్ద్వపుండ్రము గాదందురు
జాతర దైవాల నిన్ను సరిగాఁ బూజింతురు
ఆతల వైష్ణవులు దామనుకొందురు

చ. 3:

శ్రీవైష్ణవులఁ గంటేఁ జేతులెత్తి మొక్కరు
భావింతురు పగవారిఁబలెఁ గన్నట్టు
ఆవల వైకుంఠమూ ననిత్యమందురు
కావించి వైష్ణవులము కామా నేమందురు

చ. 4:

వరుస రావణాదుల వలె నెజ్ఞాలు సేతురు
సరుస నట్టే వేదమూఁ జదువుదురు
నిరతి శ్రీవేంకటేశ నీ మహిమ లెరఁగక
అరిది వైష్ణవులమే యని యాడుకొందురు


రేకు: 0209-05 గుండక్రియ సం: 03-053 అద్వైతము

పల్లవి:

నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు
యీ యహంకారపు ముక్తి యీడేరీనా తమకు

చ. 1:

నీ సేవలే సేసి నీ కృప రక్షించఁగాను
ఆసలఁ బొందే ముక్తి అది చాలక
నీ సరివారలై నీవే తామనుకొని
యీసులఁ బొందే ముక్తి యీడేరీనా తమకు

చ. 2:

పొంచిన రాక్షసులెల్ల పూర్వదేవతలమంటా
యెంచుక పట్టిన మదమీ గర్వము
అంచెలఁ గర్మమే సేసే రాయాదేవతలఁ గూర్చి
ఇంచుకంతలోనే ముక్తి యీడేరీనా తమకు

చ. 3:

హరిలాంఛనపు భక్తి కందుకు నొడఁబడరు
సరిరోగికిఁ బథ్యము చవిగానట్టు
గరిమ శ్రీవేంకటేశుఁ గని మననివారికి
యెరవులనే ముక్తి యీడేరీనా తమకు


రేకు: 0209-06 బౌళి సం: 03-054 ఉపమానములు

పల్లవి:

వట్టిమోపు మోయనేల వడిఁ ములుగఁగనేల
పట్టిన నేమముతోడ బ్రదుకఁగ వలదా

చ. 1:

తల్లిదండ్రి గలవారు తమ లేములెఱఁగక
చెల్లపిళ్లలై యాటలఁ జెందినయట్టు
వుల్లములో హరి నమ్మి వుండిన ప్రపన్నులెల్ల
పల్లదాన నిర్భరులై బ్రతుకఁగ వలదా

చ. 2:

మగఁడు గల సతులు మంచి ముత్తైదువలై
యెగువ నితరమార్గా లెరఁగనట్టు
నగుతా లక్ష్మీపతి నమ్మిన ప్రపన్నులెల్ల
పగటుఁ గర్మము మాని బ్రదుకఁగ వలదా

చ. 3:

యేలికె నమ్మినబం టేరికిఁ బ్రియము చెప్ప-
కోలిఁ బతివాకిలి గాచుండినయట్టు
తాలిమి శ్రీవేంకటేశు దాసులైన ప్రపన్నులు
పాలించినాతని నమ్మి బ్రతుకఁగ వలదా