తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 393
రేకు: 9019-01 శ్రీరాగం సం: 04-538 వేంకటగానం
పల్లవి:
కప్పురమునకుఁ గప్పురమై
చిప్పిలుఁదావి మించె నితఁడు
చ. 1:
బంగారమునకు బంగారమై
శృంగార మమరె శ్రీ హరికి
అంగమయిన మొల పీతాంబరంబున
కొంగు బంగారై కూడె నితఁడు
చ. 2:
తట్టు పుణుఁగునకుఁ దట్టు పుణుఁగయి
ఘట్టిమేన మించెఁగా యితఁడు
నెట్టన నొసల నిండిన కస్తురి
బొట్టు చెమటతోఁ బొలెనికతఁడు
చ. 3:
పన్నీట పాదాన పన్నీరే తానయి
యిన్నిట శ్రీ వేంకటేశుఁడిదే
ఉన్నతి జలధి నుదయమున
కన్నియ కౌఁగిట ఘనుఁడితఁడు
రేకు: 9౦2౦-౦1 లలిత (అవతారాలు ) సం: 04-539 దశావతారములు
పల్లవి:
అరుదైన భవదూరుఁడగు నీతఁడు
అరిది భవములందునతఁడు వో యితఁడు
చ. 1:
కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
కొడుకు కొరకుఁగా గోరపడి
కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు
చ. 2:
ఆలి తమ్ముని రాక కలరి మెచ్చెడిచోట
ఆలుఁ దానును నుండి యందులోన
ఆలిచంటికింద నడ్డమువడుకున్న
ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు
చ. 3:
సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
సవతులేనిపంటఁ జప్పరించివేసి
అవల యివల సేసి నతఁడు వో యితఁడు
చ. 4:
తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ
దొలఁగి తోలాడెడి దొడ్డవాని
తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
యడియాలమగు మేని యతఁడు వో యితఁడు
చ. 5:
పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
పదము వదము మౌవఁ బరగఁ జేసి
పదముననె దివ్యపదమిచ్చి మనుమని
నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు
చ. 6:
అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
యత్తయింటిలోన నధికుఁ జేసి
మత్తిల్లు తనతోడ మలసిన యాతని
నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు
చ. 7:
పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
పాముకుఁ బ్రాణమై పరగువాని
ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన
ఆమాటనిజముల అతఁడు వో యితఁడు
చ. 8:
ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
యెత్తుకలుగు మద మిగుర మోఁది
మత్తిల్లు చదువుల మౌనిఁ జం........
అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు
చ. 9:
బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు
చ. 10:
మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ...............
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టలాడించిన అతఁడు వోయితఁడు
చ. 11:
తలఁకకిన్నియుఁ జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు
రేకు: 9022-01 శ్రీరాగం సం: 04-540 విష్ణు కీర్తనం
పల్లవి:
చండ ప్రచండాది జయ విజయులన్
అండఁ బూజించి హరి కటుగదా పూజ
చ. 1:
కూర్మ భూమ్యాదులను గోరికఁ బ్రతిష్ఠించి
ధర్మముఖ్యంబుల నధర్మాదులన్
కర్మగతిఁ జామర గ్రాహిణులఁ బూజించి
మర్మంబుగా హరికి మరికదా పూజ
చ. 2:
గరుడ సేనేశులను ఘనుని శేషుని మరియు
వరమతులఁ బాదసంహినులను
కరమొప్ప శంఖచక్రగదాసి శార్జఞ ముల
అరసి పూజించి హరికిన పుడుగా పూజ
చ. 3:
నవకిరీటమును గుండలహార కౌస్తుభము
లవిరళపుఁ బీతాంబరాదులలర
వివిధగతిఁ బూజించి వేంకటేశ్వరు పూజ
యివదఁ దళిగలు పెట్టుఁడిదిగదా పూజ
రేకు: 9౦22-02 ధన్నాసి సం: 04-541 వైరాగ్య చింత
పల్లవి:
కాయముల కాణాచి కాఁపులము
చాయల మా సుఖము జయమేఁటిదయ్యా
చ. 1:
పంచ మహా పాతకాల బైరు విత్తి దేహాల
కంచపుఁ గొలుచులుగా గాదెలఁబోసి
చంచలాలు జవ్వనాలు చవులైన కూరలుగా
నించి భుజియించే మానిజమేఁటిదయ్యా
చ. 2;
ఉడివోని లంపటాన నూళ్ళుఁ బల్లెలు నెక్కి
యిడుమల మమతల నిండ్లు గట్టి
గొడవలానానసల కూరిమి సంపదల
పొడవైన మామతి పొందేఁటిదయ్యా
చ. 3:
పనిలేని మమతల్ల పాపములు బందాలు
గొనకొని ధనములు గూడపెట్టి
కని నేఁడు తిరు వేంకటపతి కృపతోడ
తనియని మాతోడి తగువేఁటిదయ్యా
రేకు: 9022-03 లలిత సం: 04-542 విష్ణు కీర్తనం
పల్లవి:
ఇటువలెనె పో యింకా మాకు
వటపత్రశాయి మమ్ము వదలీనా
చ. 1:
యన్నఁడు దెల్లవారెనో యాడఁ బొద్దు పొడచెనో
యన్నట్లనుండితి మహర్నిశము
యన్నిటాఁ గడమలేక యెక్కడ నెదురులేక
పన్నగ శయనుని కృపనేకాదా
చ. 2:
ఏడ వోవువ్యాధులెటు వచ్చి నిలిచెనో
కూడిన యాలరులెల్ల కొండలవలె
నీడలే నిలువులెల్ల నెలవులై యున్నచోట
యీడులేనివివి హరి యీవులేకావా
చ. 3:
ఎవ్వరిచేత దాఁచితిమెచ్చట నిధానములు
ఇవ్వలా మాతలచిన యిన్నియు నబ్బె
రవ్వగు వెంకటగిరిరాయఁడు మాతలఁపులో
పువ్వక కాచి పండిన భోగమేకాదా