తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 379


రేకు: 0౩79-01 శంకరాభరణం సం: 04-459 హనుమ

పల్లవి:

ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే
నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష

చ. 1:

మొదల నింద్రుఁడు నీ మోమునకెల్లా రక్ష
యిదె నీ శిరసునకు నినుఁడు రక్ష
కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష
చెదరని మేనికెల్ల శ్రీ రామరక్ష

చ. 2:

పిరుఁదు వాలమునకు బెడిదపు శక్తి రక్ష
గరుడఁడు నీకరయుగముల రక్ష
గరిమ నీకుక్షికి కరివరదుఁడు రక్ష
సిరుల నీ మహిమకు శ్రీ రామ రక్ష

చ. 3:

వడి నీ పాదములకు వాయుదేవుఁడు రక్ష
తొడలకు వరుణుఁడు తొడగు రక్ష
విడువని మతికిని వేద రాసులే రక్ష
చెడని నీ యాయువుకు శ్రీరామరక్ష

చ. 4:

నలువ నీగళ రక్ష నాలుక కుర్వర రక్ష
అలర నీసంధులకు హరుఁడు రక్ష
పలు నీరోమములకు బహుదేవతలు రక్ష
చెలఁగు నీచేఁతులకు శ్రీ రామరక్ష

చ. 5:

అంగవు నీతేజమున కగ్నిదేవుఁడు రక్ష
శృంగారమున కెల్లా శ్రీ సతి రక్ష
మంగాంబునిధి హనుమంత నీ కేకాలము
చెంగట శ్రీ వేంకటాద్రి శ్రీ రామరక్ష


రేకు: 0379-02 బౌళి సం: 04-460 వైరాగ్య చింత

పల్లవి:

ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు
కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను

చ. 1:

హేయములో సుఖము యెంగిలిలో సుఖము
కాయము నమ్మికదా కష్టపడెను
పాయములో చవులు పాపములో చవులు
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను

చ. 2:

కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు
కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను
యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు
కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను

చ. 3:

అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు
దొంగజీవుఁడు యిట్లానే తొట్రుపడెను
అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను


రేకు: 0379-03 లలిత సం: 04-461 భక్తి

పల్లవి:

ఏమిటివాఁడఁ గాను యిఁకనేను నా -
సామపుఁ గర్మము నీకే సమర్పయామి

చ. 1:

తలఁపులోపలనున్న తత్వము యిట్టె
వెలినుండే నాపాలి విష్ణుమూర్తీ
పలుకు లోపల నుండే పరమాత్ముఁడా నా
చలమరి మతి నీకే సమర్పయామి

చ. 2:

పుట్టుగులిచ్చినయట్టి పురుషోత్తమా తుద -
ముట్టించు మోక్షపుమురమర్దనా
గుట్టుతో నిహముచూపే గోవిందుఁడా నా
జట్టి చైతన్యము నీకే సమర్పయామి

చ. 3:

అరిదిభోగములిచ్చేయంతరాత్ముఁడా నాకు
శరణమైనయట్టి సర్వేశ్వరా !
వెరసి నన్నేలిన శ్రీ వేంకటేశుఁడా నా
సరవులన్నియు నీకే సమర్పయామి


రేకు: 0379-04 పాడి సం: 04-462 హనుమ

పల్లవి:

ఒక్కఁడే యేకాంగవీరుఁ డుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము

చ. 1:

ముందట నేలేపట్టమునకు బ్రహ్మయినాఁడు
అందరు దైత్యులఁ జంపి హరి పేరైనాఁడు
అంది రుద్రవీర్యము దానై హరుఁడైనాఁడు
యెందు నీ హనుమంతుని కెదురా లోకము

చ. 2:

చుక్కలు మోవఁ బెరిగి సూర్యుఁడు దానైనాఁడు
చిక్కుఁ బాతాళము దూరి శేషుఁడైనాఁడు
గక్కన వాయుజుఁడై జగత్ప్రాణుఁడై నాఁడు
యెక్కువ హనుమంతుని కెదురా లోకము

చ. 3:

జలధిఁ బుటమెగసి చంద్రుఁడు దానైనాఁడు
చెలఁగి మేరువుపొంత సింహమైనాఁడు
బలిమి శ్రీ వేంకటేశు బంటై మంగాంబుధి -
నిల యీ హనుమంతుని కెదురా లోకము


రేకు: 0379-05 దేశాక్షి సం: 04-463 నామ సంకీర్తన

పల్లవి:

ఏమరక తలఁచరో యిదే చాలు
కామించినవి యెల్లఁ గక్కుననే కలుగు

చ. 1:

దురితములెల్లఁ దీరు దుఃఖములెల్ల నణఁగు
హరియని వొకమాఁటు అన్నాఁజాలు
సురలు వూజింతురు సిరులెల్లఁ జేరును
మరుగురునామ మటు పరుకొన్నఁ జాలు

చ. 2:

భవములిన్నియుఁ బాయు పరము నిహముఁజేరు
అవల నారాయణయన్నాఁ జాలు
భువి యెల్లాఁ దానేలు పుణ్యములిన్నియుఁజేరు
తవిలి గోవిందు నాత్మఁదలఁచినఁ జాలు

చ. 3:

ఆనందము గలుగు నజ్ఞానమెల్లఁ బాయు
ఆనుక శ్రీ వేంకటేశ యన్నాఁ జాలు
యీ నెపాన నారదాదు లిందరు నిందుకు సాక్షి
దానవారి మంత్రజప తపమే చాలు