తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 377


రేకు: 0377-01 లలిత సం: 04-447 శరణాగతి

పల్లవి:

నిఖిలమింతయు మేలు నేనే తీలు
మఖరక్షకుఁడ నన్ను మన్నించవే

చ. 1:

నిండును జలనిధులైనా నెఱి నేటిమొత్తములచే
నిండదు నామనసైతే నిచ్చా యాసల
పండును లోకములోని బహువృక్షతతులైనాఁ
బండదు నామనసైతే బహువిషయముల

చ. 2:

తనియుఁ బసురమైన ధరణిఁ గసవు మేసి
తనియదు నామనసు ధనకాంక్షల
వొనరఁ గారుచిచ్చైనా నొకవేళ శాంతిఁబొందు
పొనిగి యే పొద్దు శాంతిఁబొందదు నామనసు

చ. 3:

లోకములోఁ గఠినపు లోహమైనాఁ గరఁగును
కై కొని నామతి గరఁగదు భ్రమసి
యీకడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను
నీకే శరణంటి నెమ్మదిఁ గావఁగదే


రేకు: 0377-02 గుండక్రియ సం: 04-448 ఉపమానములు

పల్లవి:

సిబ్బితి పడఁగనేల చింతలఁ బొరలనేల
గొబ్బున మొదలి నీరు కొనకెక్కదా

చ. 1:

నెలవై తత్వార్థము నే నెరఁగకుండినాను
తలఁపులోపలివాఁడు తా నెరుఁగుఁగా
అలసి దేహమున నే నశుచినై యుండినాను
యిల నాయంతరియామి యెప్పుడూ శుచేకా

చ. 2:

తిరమై నేను దివ్యదేశముల నుండకున్న
ధర నాలోఁ బరమాత్మ తానుండుఁగా
నిరతి గుణముల నే నీచుఁడనైనాను
అరయ నాపాలిహరి యధికుఁడేకా

చ. 3:

వొగి నేఁ బరత్రంత్రుఁడనై వుండినాను నాలోన
తగిన స్వతంత్రుఁడు తాఁ గలఁడు గా
వెగటై నే నుండినా శ్రీ వేంకటేశుఁ డెదుటనే
వగలెల్లఁ దీర్చి వైవశమాయగా


రేకు: 0377-03 భైరవి సం: 04-449 మాయ

పల్లవి:

ఒక్కటికొక ఱివి యోగములు
యిక్కడ మాబుద్దు లెక్కడఁ గొలుపు

చ. 1:

పాయపు మతిలో బలువగు నాసలు
కాయము భువిలోఁ గలదాఁకా
ఆయము సంసార మందుకు మూలము
యేయుపాములు యెక్కడఁ గొలుపు

చ. 2:

మానదు కోపము మతి చెంచెలమును
కాని కర్మ మిది గలదాఁకా
ఆనిన మనసే యందుకు మూలము
యే నేరుపు లిఁక నెక్కడఁ గొలుపు

చ. 3:

అందదు మోక్షం బవ్వల నివ్వలఁ
గందువ నిను మతి గనుదాఁకా
అందితి శ్రీ వేంకటాధిప నీ కృప
యెందలి మాయలు యెక్కడఁ గొలుపు


రేకు: 0377-04 గుజ్జరి సం: 04-450 శరణాగతి

పల్లవి:

హరిహరి నిను సకలాంతర్యామివి ఆత్మఁదలఁచుటేయోగంబు
శరణాగతరక్షామణి నిన్నే శరణని యెడిదే తుదిపదము

చ. 1:

నీయందే యీసచరాచరమును నీవే చరాచరమందు నిత్యమును
పాయక వుండుట గని తలపోయుట పరమార్థంబుల సారంబు
కాయము జీవుఁడు నీయధీనమై కలుగఁగఁ బ్రకృతియుఁ బురుషునిఁగానిటు
మాయల ముంతువు మాయకుఁ జొరవని మతిఁ దలపోయుట సుజ్ఞానంబు

చ. 2:

తనలోఁ బరతత్వపు నీవును తా నీపరతత్వములోపలఁగా
మనసునఁ దలఁచుట వేదాంతంబుల మంతనముల సన్మార్గంబు
ఘనమునకును మరి ఘనమై యందే కడుసూక్ష్మమునకుఁ గడు సూక్ష్మంబై
యెనసిన పూసలలోదార మవని యెన్నుటె పరమరహస్యంబు

చ. 3:

ఆతుమలోపల ఘనవైకుంఠము ఆతుము నీ వైకుంఠములోపల
యీతల నాతల సరిగాఁదెలియుట యిదియే బ్రహ్మానందంబు
శ్రీతరుణీశ శ్రీవేంకటపతి సేవారతి నిను నీ భజియించెద
దాతపు దైవమవై ననుఁగావుము తలఁచెద మిదియే తత్వంబు


రేకు: 0377-05 గౌళ సం: 04-451

పల్లవి:

వలసిన వారికి వై పులివి
చలమున మానుటే జయమర్మం

చ. 1:

తనలోనే పో దైవము
ఘనమే యణువై కనినది
కనవలె నీతనిఁ గనుటకు
మనసు లయమౌటే మర్మం

చ. 2:

భావములోనే పరమము
తావై తలఁపే తగిలినది
కైవశమై యిది గలుగుటకు
కేవల శాంతం కృతమర్మం

చ. 3:

హృదయములోనే యింతాను
తుదిపదమై మదిఁ దోఁచీని
యెదుటనే శ్రీవేంకటేశ్వరుని
కదిసి భుజించుటే ఘనమర్మం


రేకు: 0377-06 బౌళి సం: 04-452 రామ

పల్లవి:

రామ మిందీవరశ్యామం పరాత్పర -
ధామం సుర సార్వభౌమం భజే

చ. 1:

సీతా వనితా సమేతం
పీత వానర బల వ్రాతం
పూత కౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం

చ. 2:

వీరం రణరంగధీరం
సార ధర్మకులోద్దారం
క్రూరదానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం

చ. 3:

పావనం భక్త సేవనం
దైవిక విహగవధావనం
రావణానుజ సంజీవనం
శ్రీ వేంకట పరిచితభావనం