తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 369


రేకు: 0369-01 గుండక్రియ సం: 04-404 మాయ

పల్లవి:

ఎఱఁగఁడు పరసుఖ మీశ్వర నీమాయ
నెఱి విచారముల నెగడిన దాఁక

చ. 1:

అతిహేయములో నడరు వరాహము
అతిహేయము సుఖమని తలఁచు
మతి సంసారంబే మరగిన యాతుమ
పతిలేని దిదే పరమని తెలియు

చ. 2:

పొరి విషయములోనఁ బొడమిన కీటము
అరిది విషమ తీపని తినును
పరగ యోని సంభవమగు దేహాతుమ
పెరిగి యందుకే ప్రియపడును

చ. 3:

యింతేసి నిన్నియు నెరఁగిన యీయాతుమ
అంతరాత్మ నీవని తలఁచి
యింతట శ్రీ వేంకటేశ్వర నిన్నే
రంతుల శరణనె రక్షించవే


రేకు: 0369-02 భూపాళం సం: 04-405 నామ సంకీర్తన

పల్లవి:

ఇవియే పో ప్రద్యుమ్న యిహ పర సాధనము
భవ జలధుల తేప పరమయోగులకు

చ. 1:

వామన గోవింద విష్ణు వాసుదేవ హరి కృష్ణ
దామోదరాచ్యుత మాధవ శ్రీధరా
నీమహిమ గానలేము నిన్నెంచఁగలేము నీ -
నామజపమే చాలు నాలుక సులభము

చ. 2:

అనిరుద్ధ పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర
జనార్ధన కేశవ సంకర్షణా
నినుఁ దలఁచఁగ లేము నిన్నుఁ దెలియఁగ లేము
నునుపై నీనామమే నోటికి సులభము

చ. 3:

నారాయణ పద్మనాభ హృషీకేశ
నారసింహ మధుసూదన త్రివిక్రమ
నీరూపు భావించలేము నిక్కపు శ్రీ వేంకటేశ
ఆరయ నీనామజప మన్నిటా సులభము


రేకు: 0369-03 లలిత సం: 04-406 శరణాగతి

పల్లవి:

కన్ను లెదుటిదే ఘన వైకుంఠము
వెన్నుని గొలిచిన విజ్ఞానికిని

చ. 1:

తలఁచినదెల్లాఁ దత్వ రహస్యమే
తెలిసిన యోగికి దినదినము
పలికినవెల్లా పరమ మంత్రములె
ఫలియించిన హరి భక్తునికి

చ. 2:

పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే
పుట్టుగు గెలిచిన పుణ్యునికి
మెట్టినదెల్లా మిన్నేటినిధులే
ఱట్టడితెగువ మెఱయు వానికిని

చ. 3:

వినినవియల్లా వేదాంతములే
ఘనుఁడగు శరణాగతునికిని
యెనసిన శ్రీ వేంకటేశుఁడే యింతా
కొనకెక్కిన నిజ కోవిదునికిని


రేకు: 0369-04 సామంతం సం: 04-407 మాయ

పల్లవి:

బాపు బాపు దేవుఁడా పంతపు వోమనసా
వోపెఁగా యిందుకు జీవుఁ డోహో నామాయ

చ. 1:

నిన్నటిదినము నేఁడు నిజమో కల్లో
కన్నులఁ గన్నట్లాయఁ గానఁగరాదు
యెన్నఁగ రేపటిదిన మేమో యెట్లో
వున్నట్టు దెలియఁగరాదు వోహో నీమాయ

చ. 2:

బాలఁనాటి పుట్టుగిది భ్రమయో నిజమో
గాలినె కాలముఁ బోయ కతలాయను
యీలీల మీఁదిమరణ మేమో యెట్టో
వోలిఁ దెలియఁగరాదు వోహో నీమాయ

చ. 3:

నెక్కుఁ మింగినకడి నిజమో కల్లో
గక్కున రుచియుఁ దోచె కానఁగరాదు
యెక్కువ శ్రీ వేంకటేశ యిన్నియు వీదాసుఁడైతే
వొక్కటఁ గానఁగవచ్చు నోహో నీమాయ


రేకు: 0369-05 గుండక్రియ సం: 04-408 అంత్యప్రాస

పల్లవి:

వెరగుతో మరచితే వెనక లేదు
కరి వరదుఁడే తక్క గతి యొండు లేఁడు

చ. 1:

ఆస విడిచినఁగాని యధిక సుఖము లేదు
యీసు విడిచినఁగాని యిహము లేదు
వాసి విడిచినఁ గాని వైపగు విరతి లేదు
వాసు దేవ భక్తిఁగాని వరముక్తి లేదు

చ. 2:

చలము మానినఁగాని సాత్వికగుణము లేదు
పలుశంక వోకకాని ఫలము లేదు
సిలుగింద్రియాల గెలిచినఁగాని త్రోవ లేదు
జలజాక్షుచింతఁగాని సమబుద్ధిలేదు

చ. 3:

దైవము కరుణనెకాని తగువిజ్ఞానము లేదు
భావించి చూచినఁగాని బలిమి లేదు
యీవల శ్రీ వేంకటేశుఁ డితడె దైవ మితని
సేవించినంతఁగాని సిద్ధి మరి లేదు


రేకు: 0369-06 భైరవి సం: 04-409 మనసా

పల్లవి:

హరినామము కడు నానందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా

చ. 1:

నలినాక్షుని శ్రీ నామము
కలి దోష హరము కైవల్యము
ఫలసారము బహుబ౦ధ మోచనము
తలఁచవో తలఁచవో తలఁచవో మనసా

చ. 2:

నగధరు నామము నరక హరణము
జగదేక హితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా

చ. 3:

కడఁగి శ్రీ వేంకటపతి నామము
బడిబడినే సంవత్కరము
అడియాలంబిల నతి సుఖ మూలము
తడవవో తడవవో తడవవో మనసా