తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 353


రేకు: 0353-01 భల్లాటి సం: 04-309 నృసింహ

పల్లవి:

పెదయౌబళపుఁగొండఁ బెరిగీనిదే
వదలకకొలిచితే వరములిచ్చీని

చ. 1:

పదివేలశిరసుల బలునరసింహము
గుదిగొన్నచేతుల గురుతైనది
ఎదుటఁ బాదాలుఁ గన్నులెన్నైనఁ గలిగినది
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది

చ. 2:

ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది
మొనసి రాకాసిమెకములఁ గొట్టేది
కనకపుదైత్యుని కడుపుచించినది
తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది

చ. 3:

శ్రీవనితఁ దొడమీఁదఁ జేకొని నిలిపినది
దేవతలు గొలువ గద్దెపై నున్నది
శ్రీవేంకటాద్రియందుఁ జెలఁగి భోగించేది
భావించి చూచితేను పరబ్రహ్మమైనది


రేకు: 0353-02 ముఖారి సం: 04-310 నృసింహ

పల్లవి:

నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభములొసఁగెను

చ. 1:

సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనక కశిపుని

చ. 2:

నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచిరక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను

చ. 3:

కాంచనపు గద్దె మీఁద గక్కనఁ గొలువై యుండి
మించుగ నిందిరఁ దొడమీఁద బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో


రేకు: 0353-03 సామంతం సం: 04-311 వేంకటగానం

పల్లవి:

దైవమొక్కఁడే సంతత భజనీయుఁడు
భావము సమబుద్దిఁ బాయఁగఁదగదు

చ. 1:

హరియే నకలాంతరాత్మకుఁ డటుగాన
తిరమై యొకరి నిందింపఁదగదు
అరయఁగ లోకములనిత్య మటుగాన
మరిగి కొందరిమీఁది మమతయు వలదు

చ. 2:

బహుకల్పితములెల్లఁ బ్రకృతిమూలమే కాన
గహనపుఁదన వుద్యోగము వలదు
సహజవిహారుఁడు సర్వేశ్వరుఁడుగాన
వహిఁ దానేవచ్చినవి వలదనఁదగదు

చ. 3:

తపములు జపములు దాస్యమూలమె కాన
వుపమల సందేహమొగి వలదు
యెపుడును శ్రీవేంకటేశ్వరు సేవించి
చపలచిత్తమువారి సంగమిఁక వలదు


రేకు: 0353-04 లలిత సం: 04-312 శరణాగతి

పల్లవి:

ఏగతి నుద్ధరించేవో యింతటిమీదట మమ్ము
భోగపుఁగోరికలచేఁ బొలిసెఁ బో పతులు

చ. 1:

పరగి నాలుకసొంపు పరసిపోయ
పరులనే నుతియించి పలుమారును
విరసపుఁబాపములవినికిచే వీనులెల్లాఁ
గొరమాలె మాకు నేఁటి కులాచారము

చ. 2:

మొక్కలాన పరధనమునకుఁ జాఁచిచాఁచి
ఎక్కువఁజేతులమహి మెందో పోయ
తక్కక పరస్త్రీలఁ దలఁచి మనసు బుద్ధి
ముక్కపోయ మాకు నేఁటి ముందటిపుణ్యాలు

చ. 3:

యెప్పుడు నీచులయిండ్లకెడతాఁకి పాదములు
తప్పనితపములెల్లఁ దలఁగిపోయె
యిప్పుడె శ్రీవేంకటేశ యిటునిన్నుఁ గొలువఁగా
నెప్పున నేఁజేసినట్టి నేరమెల్లా నణఁగె


రేకు: 0353-05 సాళంగనాట సం: 04-313 సంస్కృత కీర్తనలు

పల్లవి:

అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

చ. 1:

అయమేవ ఖలు పురా అవనీధరస్తు సో
ప్యయమేవ వట దళాగ్రాధి శయనః
అయమేవ దశవిధైరవతారరూపైశ్చ
నయమార్గ భువి రక్షణం కరోతి

చ. 2:

అయమేవ సతతం శ్రియః పతిర్దేవేషు
అయమేవ దుష్ట దైత్యాంతకస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియ భక్త పోషణం ప్రీత్యా తోతి

చ. 3:

అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో
వ్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు


రేకు: 0353-06 సామంతం సం: 04-314 నామ సంకీర్తన

పల్లవి:

ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నునినామమే వేదంబాయ

చ. 1:

నలినదళాక్షునినామకీర్తనము
కలిగి లోకమునఁ గలదొకటే
యిల నిదియే భజియింపఁగఁ బుణ్యులు
చెలఁగి తలఁప సంజీవని యాయ

చ. 2:

కోరిక నచ్యుత గోవిందాయని
ధీరులు దలఁపఁగఁ దెరువొకటే
ఘోరదురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మఁగఁగలిగె

చ. 3:

తిరువేంకటగిరి దేవుని నామము
ధరఁదలపగ నాధారమిదే
గరుడధ్వజుని సుఖప్రదనామము
నరులకెల్లఁ బ్రాణము దానాయ