తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 348

రేకు: 0348-01 దేవక్రియసం: 04-279 రామ


పల్లవి :

ఏమి చెప్పేది ప్రతాప మెట్టి విలుకాఁ డితఁడు
రాముఁడు వీఁడే మ్రొక్కుఁడు రణరంగధీరుఁడు


చ. 1:

విడిసెఁ గపిబలము వెస సముద్రము దరి
నడచె లంకపైఁ బౌఁజు నానాగతుల
తొడిగె రాముఁడు వింట దొనలోని బ్రహ్మాస్త్రము
పడే రావణుతలలు పంక్తులై ధరణిని


చ. 1:

చొచ్చిరి లంకలోను సుగ్రీవాంగదాదులు
తెచ్చిరి రాకాసి చెర తెప్పలుగాను
యిచ్చిరి జయధ్వనులు యింద్రాదిదేవతలు
మెచ్చిరందరు సీతాసమేతుఁడాయ నితఁడు


చ. 1:

మగుడెఁ బుష్పకముపై మహిమ నీతనిదండు
తగఁ బట్టము తా నేలె తమ్ములతోను
అగపడి శ్రీవేంకటాద్రిపై నిల్చె నితఁడు
జగదేకమూర్తి కౌసల్యాసుతుఁ డిపుడు

రేకు: 0348-02 మేఘరంజి సం: 04-280 రామ


పల్లవి :

ఇందులోనే కానవచ్చె నిన్నిటా నీ మహిమలు
చెంది నీవే దిక్కు మాకు సీతాపతిరామా


చ. 1:

దేవ నీకు వలసితే తృణము బ్రహ్మాస్త్రమాయ
భావించితే రాతికిఁ బ్రాణము వచ్చె
కావలసి యేసితే నాకాశముకట్లు దెగె
దైవమవంటే నీవే దశరథరామా


చ. 2:

కూరుచుక యేలితేను కోఁతులు రాజ్యముసేసె
కోరితేనే నీటిపైఁ గొండలు దేలె
సారెఁ గదలివచ్చె నీ సన్నల సంజీవికొండ
యేరీతి నీసరి వేరీ యినకులరామా


చ. 3:

సూటి నీవు దలఁచితే సురలు పంపుసేసిరి
చాటితేనే నీపేరు జపమాయను
ఆటల నీకతలెల్లా నాచంద్రార్కమై నిలిచె
గాటపు సిరుల శ్రీవేంకటగిరిరామా

రేకు: 0348-03 దేసి సం: 04-281 రామ


పల్లవి :

ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము
రామ రామభద్ర సీతారమణ సర్వేశ


చ. 1:

వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే
అరయ విరిగె వీపు లసురలకు
వరుస వనవాసపువ్రతము పట్టినపుడే
పరులమతుల భీతి వట్టె రఘురామ


చ. 2:

వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే
చొచ్చిరి పాతాళ మసురలెల్లాను
ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే
కొచ్చి దైత్యు లాస దెగఁ గోసిరి శ్రీరామ


చ. 3:

అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే
విడిచిరి దానవులు వేడుకలెల్లాను
బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా
చిడిసి మల్లెపట్టిరి శ్రీవేంకటరామ

రేకు: 0348-04 ముఖారి సం: 04-282 ఇతర దేవతలు


పల్లవి :

కొలువరో మొక్కరో కోరి తలఁచరో
చెలఁగి మనల రక్షించీని వీఁడె


చ. 1:

పాయపువాఁడు నల్లఁబల్లిచెన్నుఁడు
వేయినామములవెన్నుఁడు
పాయకకొల్చిన భక్తప్రసన్నుఁడు
యీయెడనే వరములు యిచ్చీని వీఁడే


చ. 2:

పరిపూర్ణుఁడు మహానుభావుఁడు
తిరమగు దేవాధిదేవుఁడు
పరమానందస్వభావుఁడు
గరిమెఁ గరుణతోఁ గాచీని వీఁడె


చ. 3:

తెలియుఁ డీతఁడె దేవాగ్రగణ్యుఁడు
వలనుగ యోగీంద్రవరేణ్యుఁడు
అలరఁగ శ్రీవేంకటాచలేశపుణ్యుఁడు
నలిఁ బ్రసన్నుఁడై నవ్వీని వీఁడె

రేకు: 0348-05 సామంతం సం: 04-283 రామ


పల్లవి :

రామునికి శరణంటె రక్షించీ బ్రదుకరొ
యేమిటీకి విచారాలు యిఁక దైత్యులాల


చ. 1:

చలమునఁ దాటికిఁ జదిపిన బాణము
లలి మారీచసుబాహూలపై బాణము
మెలఁగి పరశురాము మేట్లేసిన బాణము
తళతళ మెరసీని తలరో యసురలు


చ. 2:

మాయామృగముమీఁద మరి వేసిన బాణము
చేయి చాఁచి వాటి నేసిన బాణము
తోయధిమీఁద నటు తొడిగిన బాణము
చాయలు దేరుచున్నది చనరో దైతేయులు


చ. 3:

తగఁ గుంభకర్ణునితల ద్రుంచిన బాణము
జిగి రావణుఁ బరిమార్చిన బాణము
మిగుల శ్రీవేంకటేశు మేఁటిపొదలో నున్నది
పగ సాధించీ నిఁకఁ బారరో రాకాసులు

రేకు: 0348-06 నాదరామక్రియ సం: 04-284 వైరాగ్య చింత


పల్లవి :

అప్పటి సుఖమేకాని యటమీఁదెంచు కొనఁడు
ఉప్పతిల్లు జీవుని వుద్యోగా లిట్టివి


చ. 1:

తనుభోగపురతులు దలపోయుచుండుఁగాని
తన నరకకూపాలు దలపోయఁడు
కనకభూషణములు గని వెరగందుఁగాని
ఘనకర్మబంధాలకుఁ గడు వెరగందఁడు


చ. 2:

యీకడాకడఁదాఁ జేసేటియెమ్మెలే యెంచుఁగాని
పైకొని కూడేటిపాపము లెంచఁడు
దీకొని జగములోని ద్రిష్టములే చూచుఁగాని
భీకరపు జన్మముల పిరివీకు చూడఁడు


చ. 3:

వింతవింత మాటలవేడుకలే వినుఁగాని
అంతటఁ దాఁ బడేపాట్లవి వినఁడు
ఇంతటా శ్రీవేంకటేశుఁడేలఁగా నెరిఁగెఁగాని
యెంతచెప్పినాను బుద్ధి యిన్నాళ్ళు నెరఁగఁడు