తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 331

రేకు: 0331-01 ఆందోళి సం: 04-178 తేరు


పల్లవి :

కన్నులపండుగలాయఁ గన్నవారి కిందరికి
వెన్నుఁడేఁగీ నిల్లిదివో వీధుల వీధులను


చ. 1:

అదె యెక్కెఁ దిరుతేరు అసురలు బెదరఁగ
త్రిదశులు చెలఁగఁగ దేవదేవుఁడు
కదలే బండికండ్లు ఘనమైన మ్రోఁతతోడ
వెదచల్లుఁ గాంతులతో వీధుల వీధులను


చ. 2:

తోలి యాడీఁ దిరుతేరు దుష్టులెల్ల నణఁగఁగ
చాలుకొని శిష్టులెల్ల జయవెట్టఁగ
గాలికిఁ బడగలెల్లాఁ గడు నల్లాడఁగఁ జొచ్చె
వేలేటి పువుదండలతో వీధుల వీధులను


చ. 3:

తావు చేరెఁ దిరుతేరు ధర్మములు నిలువఁగ
యీవల నలమేల్మంగ ఇచ్చగించఁగా
శ్రీవేంకటేశ్వరుఁడు శింగారాలు మెరసెను
వేవేలు విధముల వీధుల వీధులను

రేకు: 0331-02 భల్లాటి సం: 04-179 కృష్ణ


పల్లవి :

జగతిలో మనకెల్ల జయంతి నేఁడు
పగటున నందరికి పండుగ నేఁడు


చ. 1:

అదివో శ్రావణ బహుళాష్టమి నేఁడు
పొదిగొన్న రోహిణి సంపూర్ణము నేఁడు
కదిసి యద్దమరేత్రికాడ నేఁడు
ఉదయించెఁ గృష్ణుఁడు చంద్రోదయాన నేఁడు


చ. 2:

వసుదేవదేవకుల వరము నేఁడు
పసగా ఫలియించె రేపల్లెలో నేఁడు
కొసరి యశోదనందగోపుఁడు నేఁడు - యీ
సిసువును సుతుఁడంటాఁ జెలఁగిరి నేఁడు


చ. 3:

హరిమాయ కంసుమద మడఁచె నేఁడు
పొరుగిరుగులవా రుప్పొంగిరి నేఁడు
సిరి నలమేల్మంగతో శ్రీవేంకటేశుఁడై నిల్చె
అరుదుగా గొల్లెతలు ఆడుకొనేరు నేఁడు

రేకు: 0331-03 ఆహిరి సం: 04-180 కృష్ణ


పల్లవి :

కొలిచితే రక్షించే గోవిందుఁడితఁడు
యిలకు లక్ష్మికి మగఁడీ గోవిందుఁడితఁడు


చ. 1:

గోవర్ధనమెత్తినట్టి గోవిందుఁడితఁడు
వేవేలుగొల్లెతల గోవిందుఁడితఁడు
కోవిదుఁడై ఆలఁగాచే గోవిందుఁడితఁడు
ఆవలఁగంసుఁజంపిన ఆగోవిందుఁడితఁడు


చ. 2:

క్రూరకాళింగమర్దన గోవిందుఁడితఁడు
వీరచక్రాయుధపు గోవిందుఁ డితఁడు
కోరి సముద్రాలు దాఁటే గోవిందుఁడితఁడు
ఆరీతి బాలురఁ దెచ్చేయా గోవిందుఁడితఁడు


చ. 3:

కుందనపుకాశతోడి గోవిందుఁడితఁడు
విందుల రేపల్లె గోవిందుఁడితఁడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసఁగఁ దిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుఁడితఁడు

రేకు: 0331-04 కౌశి సం: 04-181 వేంకటగానం


పల్లవి :

కొండంతపొడవుతోడ కోనేటిరాయఁడు వీఁడె
నిండుకొని రథమెక్కి నిలుచున్నవాఁడు


చ. 1:

పాతాళవాసులైన బలురక్కసుల మీఁద
యేతులఁ బరపెఁ దేరు యిదె దేవుఁడు
ఆతల జలధిచొచ్చినట్టి దానవులమీఁద
ఘాతతోడఁ దోలె నదె కడు రభసమున


చ. 2:

ఆకాశము దూరినట్టి యదటు దైత్యులమీఁద
దాకతో నడపించెఁ బంతాన దేవుఁడు
దీకొని యష్టదిక్కులఁ దిరిగి యసురలపై
భీకరముగా మోగించె బిరుదులు మెరసి


చ. 3:

ధరమీఁదఁ గలిగిన దనుజకోట్ల నెల్ల
సొరిది శ్రీవేంకటేశుఁడు పారఁదోలెను
గరిమ నలమేల్మంగ నురమునఁ బెట్టుకొని
తిరముకొలిపెఁ దేరు దిక్కులెల్ల గెలిచి

రేకు: 0331-05 వరాళి సం: 04-182 నృసింహ


పల్లవి :

నవమూర్తులైనట్టి నరసింహము వీఁడె
నవమైన శ్రీకదిరి నరసింహము


చ. 1:

నగరిలో గద్దెమీఁది నరసింహము వీఁడె
నగుచున్న జ్వాలానరసింహము
నగముపై యోగానందనరసింహము వీఁడె
మిగుల వేదాద్రి లక్ష్మీనారసింహము


చ. 2:

నాఁటుకొన్న భార్గవూటునరసింహము వీఁడె
నాఁటకపు మట్టెమళ్లనరసింహము
నాఁటి యీ కానుగమానినరసింహము వీఁడె
మేఁటి వరాహపు లక్ష్మీనారసింహము


చ. 3:

పొలసి యహోబలాన బొమ్మిరెడ్డిచెర్లలోన
నలిరేఁగిన ప్రహ్లాదనరసింహము
చెలఁగి కదిరిలోన శ్రీవేంకటాద్రిమీఁద
మెలఁగేటి చక్కని లక్ష్మీనారసింహము

రేకు: 0331-06. శంకరాభరణం సం: 04-183 వేంకటగానం


పల్లవి :

కొలువుఁడు వలసితేఁ గొలువక మానుఁడు
తెలియ నీతఁడే సుండీ దేవదేవోత్తముఁడు


చ. 1:

పుడిమికాధారము పురుషోత్తముఁడె
కుడిచి కట్టెడివారు కోటానఁగోటి
విడువుఁ డేటికి బారవేసినగుంటికినెల్ల
వొడయ డీతఁడే సుండీ వున్నతోన్నతుఁడు


చ. 2:

అమృతమిచ్చినవాఁడు ఆదినారాయణుఁడే
సములై జీవించువారు సతానసంఖ్య
భ్రమయకుఁ డెండమావిబయళ్లు చెరువులంటా
అమర నీతఁడే సుండీ హరి వాసుదేవుఁడు


చ. 3:

చెలువుఁ డీతఁడె సుండీ శ్రీవేంకటేశుఁడె
పలుకుఁ బంతాలవారు పదివేగురు
తలఁచకుఁ డీదోమ దంతితోను సరిగా
జలజనాభుఁడే నుండీ సకలలోకేశుఁడు