తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 328

రేకు: 0328-01 రామక్రియ సం: 04-160 కృష్ణ


పల్లవి :

అడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు
నడురేయి జనియించినాఁడు చూడఁగదరే


చ. 1:

గొంతిదేవిమేనల్లుఁడు గోపసతులమగఁడు
పంతపుపాండవులకు బావమరఁది
వంతుతో వసుదేవదేవకులకుమారుఁడు
ఇంతటికృష్ణుఁడు జనియించినాఁడుగదరే


చ. 2:

బలరామునితమ్ముఁడు పంచసాయకునితండ్రి
మలసి మేటైనయభిమన్యునిమామ
లలి సాత్యకిసుభద్రలకుఁ దోఁబుట్టినయన్న
ఇలపైఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే


చ. 3:

సూరసేనుమనుమఁ డచ్చుగ ననిరుద్ధు తాత
పౌరవయాదవలోకబాంధవుఁడు
ఆరయ శ్రీవేంకటేశుఁ డలమేల్మంగకుఁ బతి
యీరీతిఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే

రేకు: 0328-02 లలిత సం:04-161 కృష్ణ


పల్లవి :

చూడవమ్మ కృష్ణుఁడు నీ సుతుఁడోయమ్మ
ఆడీ వీధుల వెంట యశోదమ్మా


చ. 1:

కోలలు చాఁచీ వుట్లు గొట్టఁగా బాలుఁ బెరుగు
కాలువలు గట్టి పారేఁ గదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మా


చ. 2:

చక్కిలాల కుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోఁటికోలలఁ దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరునఁ గారె యశోదమ్మా


చ. 3:

అల్లంత నుండి తన కందరాని తెంకాయలు
వల్లె తాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుఁడలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
అల్లిబిల్లై యున్నాఁడమ్మ యశోదమ్మా

0328-03 గౌళ సం: 04-1502నృసింహ


పల్లవి :

ఎంచి చూచితే నితని కెవ్వ రెదురు
కొంచ డేమిటికి వీఁడె ఘోర నారసింహుండు
గక్కన నహోబలాన కంబములోన వెడలి


చ. 1:

వుక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్లం జించి చెండాడినయట్టి-
వెక్కసీండు వీడివో వీర నారసింహుడు


చ. 2:

భవనాసి యేటిదండః బాదుకొని కూచుండి
జవళి దైత్యుపేగులు జందేలు వేసి
భువియుదివియు నొక్కపొడవుతో నిండుకొని
తివురుచున్నాఁడు వీఁడె దివ్య నారసింహుడు


చ. 3:

కదిసి శ్రీసతి గూడి గద్దెమీందయం గూచుండి
యెదుటఁ బ్రహ్లాదుండు చేయేత్తి మొక్కఁగా
అదన శ్రీవేంకటాద్రి నందరికి వరాలిచ్చి
సదరమైనాఁడు వీఁడె శాంత నారసింహుఁడు

రేకు: 0328-04 ధన్నాసి సం: 04-163 నృసింహ


పల్లవి :

కొలువైతా నల్లవాఁడె కూచున్నాఁడు గద్దెమీఁద
బలవంతుఁ డితఁడు ప్రహ్లాదవరదుఁడు


చ. 1:

చిడుముడిగోళ్లతోడ సింహపుమోముతోడ
తొడమీఁదఁగూచున్న తొయ్యలితోడ
కడలేనినవ్వుతోడ కడురాజసముతోడ
అడరించీఁ బంతము ప్రహ్లాదవరదుఁడు


చ. 2:

సంకుఁజక్రములతోడ చాయలమేనితోడ
సంకెదేర్చేయభయహస్తముతోడ
బింకపుమీసాలతోడ పెనువదనముతోడ
అంకె వరములిచ్చీఁ బ్రహ్లాదవరదుఁడు


చ. 3:

వనితకౌఁగిటతోడ వామకరముతోడ
ననుపైన తమలోనానందముతోడ
యెనయుచు శ్రీవేంకటేశుఁడై యీడా నాడా
అనిశము వెలసెఁ బ్రహ్లాదవరదుఁడు

రేకు: 0328-05 లలిత సం: 04-164నృసింహ


పల్లవి :

జూటుఁదనాలవాఁడవు సుగ్రీవనారసింహ
పాటించి నిన్ను నేము పంగించేవారమా


చ. 1:

మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు
జగిఁ దొడమీఁదట శ్రీమహాలక్ష్మి
తగు నీకు నిటువంటి తగవులెల్లాఁ జెల్లు
యెగ సక్కేలాడ మాకు నేలయ్య నిన్నును


చ. 2:

కట్టినది పైఁడికాశ కంబములోన వునికి
నెట్టుకొన్ననవ్వులు నీలోనివే
యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేతలు
అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి


చ. 3:

అమరుల కేలికవు అసురలకు వైరవి
రమణఁ బ్రహ్లదునకు రక్షకుఁడవు
కొమరై శ్రీవేంకటాద్రిఁ గొత్తలు నీగుణములు
సముకానఁ బలుమారు సంతోసించే మిఁకను

రేకు: 0328-06 లలిత సం: 04-165 వేంకటగానం


పల్లవి :

మతంగపర్వతము మాల్యవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాఁడు


చ. 1:

కొలిచినవారికెల్లా కోరినవరములిచ్చి
తలచిఁనవారినెల్లా ధన్యులఁజేసి
పొలుపుమిగుల మంచిపువ్వుల తోఁటలనీడ
విలసిల్లినదివో శ్రీవేంకటేశ్వరుఁడు


చ. 2:

శరణన్నవారికి చనవిచ్చి రక్షించి
గరిమఁ బూజించువారిఁ గరుణఁ జూచి
పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు
విరివిగొన్నాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు


చ. 3:

తను నమ్మినవారికి తగినసంపదలిచ్చి
కని నుతించేవారికిఁ గామధేనువై
కనకమయములైన ఘనమైనమేడలలో
వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుఁడు