రేకు: 0316-01 గుజ్జరి సం: 04-090 భగవద్గీత కీర్తనలు
పల్లవి : |
సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతి యే వుపాయము
|
|
చ. 1: |
తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది
మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు
|
|
చ. 2: |
పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి
పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు
పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి
వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము
|
|
చ. 3: |
వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము
పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ
|
|
రేకు: 0316-02 లలిత సం: 04-091 అధ్యాత్మ
పల్లవి : |
తలఁపులోని వెలితే దైవము వెలితౌ
కలిగిన ఇదియే కారణము
|
|
చ. 1: |
యెదిటీ యాసలకు నెడిసి తొలఁగుటే
తుద నరకములకుఁ దొలఁగుట
వదలక ఇంద్రియవర్గము గెలుచుటే
పదపడి తనపాపముల గెలుచుట
|
|
చ. 2: |
మగటిమి సంసారమాయ దాఁటుటే
తగుభవవారిధి దాఁటుట
జగములోపలను శాంతిగలుగుటే
అగణిత మోక్షమునందుఁ బొందుట
|
|
చ. 3: |
మహి ఇంతా హరిమయముగఁ గనుటే
విహితపు జ్ఞానము వెసఁ గనుట
ఇహమున శ్రీవేంకటేశు శరణనుటే
సహజపు జన్మము సఫలం బనుట
|
|
రేకు: 0316-03 రామక్రియ సం: 04-092 వైరాగ్య చింత
పల్లవి : |
మరుగుచుఁ జేసీ మానదుద్యోగము
నరహరి నీ కృపే నాగతి గలదు
|
|
చ. 1: |
అనుపమ మైన భయంబున నరకము
వినియెదఁగాని వెరచి విడువను
మనియెడి జీవుల మరణ భవంబులు
కనియెదఁగాని కలంగదు మనసు
|
|
చ. 2: |
రాసుల మలమూత్రపు సోదనలిటు
సేసీఁగాని చీ యనదు తనువు
ఆసల నర్ధపుటార్జన యలపుల
వేసరదుఁగాని విరతి నిలుపను
|
|
చ. 3: |
నిరతముఁ దలపఁగ నిదురయుఁ దెలివియు
తొరలీఁగాని తారలనీదు గుణము
యిరవగు శ్రీవేంకటేశ్వర నీవే
పరమాత్మవు ననుఁ బాలించఁగదే
|
|
రేకు: 0316-04 సాళంగనాట సం: 04-093 భగవద్గీత కీర్తనలు
పల్లవి : |
వెలినుండు లోనుండు విశ్వమింతటనుండు
జలజాక్షు శరణమే సాధనము సుండీ
|
|
చ. 1: |
మిక్కిలిఁ జేసే పాపమే మీఁద నరకమై తోఁచు
నిక్కి తానే అద్దములో నీదైనట్లు
వొక్కట మొదలులేక వుంటేఁ గొనాలేదు
గుక్కకిహపరములు కోరినంతే సుండీ
|
|
చ. 2: |
మహిఁ దొల్లి చూచినూరే మతిలోన దోచీని
గహనపు కాఁపురమే కలయైనట్లు
సహజమై పుట్టులేక చావులేదెవ్వరికి
విహిత సుఖ దుఃఖములు వేఁడినంతే సుండీ
|
|
చ. 3: |
యెండగానే బయటనే యెక్కువ వెన్నెలగాసీ
దిండురేయిఁ బగలొక్క దినమైనట్లు
నిండు జీవుఁడు లేకుంటే నిక్కపు దేవుఁడు లేఁడు
అండ శ్రీవేంకటేశుఁడే అంతరాత్మ సుండీ
|
|
రేకు: 0316-05 పాడి సం: 04-094 భగవద్గీత కీర్తనలు
పల్లవి : |
పుట్టుభోగులము నేము భువి హరి దాసులము
నట్ట నడమి దొరలు నాకియ్యవలెనా
|
|
చ. 1: |
పల్లకీలు నందలాలు పడివాగెతేజీలు
వెల్లవిరి మహలక్ష్మివిలాసములు
తల్లి యాకె మనినే దైవమని కొలిచేము
వొల్లఁగే మాకేసిరులు వొరు లియ్యవలెనా
|
|
చ. 2: |
గ్రామములు రత్నములు గజముఖ్యవస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు
భామిని యాకెమగని ప్రాణధారి లెంకలము
వోమి మాకాతఁడే యిచ్చీ వొరులియ్యవలెనా
|
|
చ. 3: |
పసగల పదవులు బ్రహ్మనిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుఁడు
యెసఁగి యాతఁడే మమ్ము నేలి ఇన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా
|
|
రేకు: 0316-06 రామక్రియ సం: 04-095 వైరాగ్య చింత
పల్లవి : |
దైవము నీవే దయదలఁచుట గా
కావలఁ బ్రాణికి యాసే దయ్యా
|
|
చ. 1: |
ఆస వొకటి యెంతయినాఁ దనియదు
వాసి యొకటి తనవంతులు మానదు
యీసొకటీ శాంతమెరఁగని దిదె
మోసపుదేహికి ముక్తి యే దయ్యా
|
|
చ. 2: |
పాపమొకటి భవబంధముఁ బాపదు
దీపమొక్కటి ధీరత యొల్లదు
చూపొక టింద్రియసుఖముల గెలువదు
యేపునఁ బ్రాణికి యెఱకే దయ్యా
|
|
చ. 3: |
పాయమొకటి చాపలములు మానదు
కాయమొకటి తనకర్మము విడువదు
యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ
సేయని యాత్మకు సెలవే దయ్యా
|
|