తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 311

రేకు: 0311-01 శుద్ధవసంతం సం: 04-061 శరణాగతి


పల్లవి :

ఱాలు దింటా మలిగండ్లాఱడి రాసిగా నేరేము
తేలుచు శ్రీహరి నీవే దిక్కౌటగాక


చ. 1:

ఆసలేల మానుఁ దన ఆఁకలి లో నుండఁగాను
బేసబెల్లి దేహముతోఁ బెరుగుఁగాక
గాసి బంధమేలఁమానుఁ గాముఁడు లో నుండఁగాను
వేసట సంసారమై వెన్నడించుఁగాక


చ. 2:

ధావతులేఁటికి మానుఁ దనుభోగాలుండఁగాను
మోవరాని చింతలతో ములుగుఁగాక
కావరములేల మాను కంతల మేనుండఁగాను
తోవ చేసుకొని వెళ్లఁదోయుచుండుఁగాక


చ. 3:

వొక్కచిత్తమేలయౌను వూర్పుగాలి విసరఁగా
చిక్కి గుణత్రయముచేఁ జెదరుఁగాక
నిక్కి శ్రీవేంకటపతి నీకు నేనే శరణంటి
గక్కన నీజీవమును గరుణింతుగాక

రేకు: 0311-02 మాళవిగౌళ సం: 04-062 విష్ణు కీర్తనం


పల్లవి :

పొందగు "నాత్మాపుత్రనామ “మను-
చందపువేదమె సరి నిలిపితివి


చ. 1:

పుత్రుఁడు మరుఁడట పుత్రుఁడు బ్రహ్మట నీ-
పుత్రపౌత్రులే భువినెల్లా
పుత్రకామేష్టిని బొడమితి దశరథ-
పుత్రుఁడవై యిది పొగడఁగ నరులు


చ. 2:

మనుమఁడు రుద్రుఁడు మనుమఁడు వశిష్టు
మనుమని మనుమలే మహి యెల్లా
మనుమఁడవై యదితిమాన్య గర్భమున
జననమందితివి జగమున కరుదు


చ. 3:

యిదె నీగోత్రం బీచరాచరం-
బెదుట మెరసె నిదె యిహమెల్లా
కదిసిటు శ్రీవేంకట గోత్రంబున
నుదయించి మెరసితో హరి నీవు

రేకు: 0311-03 శుద్ధవసంతం సం: 04-063 అధ్యాత్మ


పల్లవి :

ఏమి సేయువాఁ డ నివి విరసమొకటొకటి
తామసంబొకవంక తత్వమొకవంక


చ. 1:

యితరోపాయరాహిత్యుండు గాఁడేని
అతిశయంబగు మోక్ష మది యబ్బదు
సతతోద్యోగానుచరితుండు గాఁడేని
వితతసంసారసుఖవిధి నడవదు


చ. 2:

వివిధేంద్రియ విషయ విముఖుఁడు గాఁడేని
యివల వైష్ణవధర్మమిది యబ్బదు
అవిరళంబగు దేహానుపరణములేక
భవమాత్రమున సుకృతఫల మబ్బదు


చ. 3:

పరమానంద సంపన్నుండు గాఁడేని
చరమవిజ్ఞాన నిశ్చలుఁడు గాఁడు
యిరవయిన శ్రీవేంకటేశ యిటువలె నీవు
కరుణించకున్న దుర్గతులచే భ్రమసీ

రేకు: 0311-04 ముఖారి సం: 04-064 వైరాగ్య చింత


పల్లవి :

ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే


చ. 1:

వలెననే దొకమాఁట వలదనే దొకమాఁట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి
వలెనంటే బంధము వలదంటే మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువది యొకటే


చ. 2:

పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై యీ రెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే


చ. 3:

పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే
సిరులు నీ రెంటికిని జీవుఁడే గురి
యిరవై శ్రీవేంకటేశుఁ డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతమితఁ డొకఁడే

రేకు: 0311-05 దేసాళం సం: 04-065 శరణాగతి


పల్లవి :

తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా
చక్కఁగ శ్రీహరి నీశరణే చాలు


చ. 1:

మోపులు మోవఁగనొల్ల ములుగఁగ నేనొల్ల
తీపు నంజనొల్ల చేఁదు దినఁగనొల్ల
పాపపుణ్యాలవి యొల్ల భవమునఁ బుట్టనొల్ల
శ్రీపతినే నిరతము చింతించుటే చాలు


చ. 2:

వడిగాఁ బరువులొల్ల వగిరింపనేనొల్ల
వెడఁగుఁజీఁకటి యొల్ల వెలుఁగూనొల్ల
యిడుమల వేఁడనొల్ల యెక్కువ భోగములొల్ల
తడయక హరి నీదాస్యమే చాలు


చ. 3:

అట్టె పథ్యములోల్ల అవుషధము గొననొల్ల
మట్టులేని మణుఁగొల్ల మైల గానొల్ల
యిట్టె శ్రీవేంకటేశుఁ నిరవుగ సేవించి
చుట్టుకొన్న యానందసుఖమే చాలు

రేకు: 0311-06 రామక్రియ సం: 04-066 వైరాగ్య చింత


పల్లవి :

ముందే తొలగఁవలె మోసపోక సంగమెల్ల
కందువఁ బోయిననీళ్లు కట్ట గట్టవచ్చునా


చ. 1:

అనలముఁబొడగంటే నండనున్నమిడుతలు
పనిలేకున్నా నందుఁ బడకుండీనా
పొనిఁగి చెలులఁగంటే పురుషుల చూపులెల్లా -
ననిశము నందుమీఁద నంటఁబారకుండునా


చ. 2:

గాలపుటెఱ్ఱలఁగంటే కమ్మి నీటిలో మీలు
జాలి నాపసలఁ జిక్కి చావకుండీనా
అలరిబంగారుగంటే నందరిమనసులూను
పోలిమి నాపసఁ జిక్కి పుంగుడు గాకుండునా


చ. 3:

చేరి ముత్యపు ఁజిప్పల చినుకులునినిచితే
మేరతేటముత్యములై మించకుండీనా
ధారుణి శ్రీవేంకటేశుదాసులసంగతి నుంటే
పోరచి నే జీవులైనఁ బుణ్యులుగాకుందురా