తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 309

రేకు: 0309-01 ముఖారి సం: 04-049 శరణాగతి


పల్లవి :

ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుఁడే మాకు జీవరక్ష


చ. 1:

భూమిదేవిపతి యైన పురుషోత్తముఁడె మాకు
భూమిపై నేడ నుండినా భూమిరక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుఁడే మాకు
సామీప్యమందున్న జలరక్ష


చ. 2:

మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుఁడే
ఆయములు దాఁకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుఁడే మాకు
వాయువందుఁ గందకుండా వాయురక్ష


చ. 3:

పాదమాకసమునకుఁ బారఁజాఁచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుఁడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్షా

రేకు: 0309-02 దేశాక్షి సం: 04-050 శరణాగతి


పల్లవి :

ఎంచి సేయుపను లిఁక లేవు
కొంచక యాతనిఁ గొలుచుటే కలది


చ. 1:

తప్పదు కర్మము తా నెందున్నా
చెప్పఁగ దీనికిఁ జింతేలా
అప్పడు తొల్లే అనుమతించె నివి
తప్పక యాతనిఁ దలఁచుటే కలది


చ. 2:

ఆయము నన్నము నందొక లంకే
వేయుట దీనికి వెతలేలా
కాయములో హరి గలఁడంతరాత్మ
యీయెడఁ దను నుతియించుటే కలది


చ. 3:

వెలిని లోన శ్రీవేంకటేశుఁడే
తెలియని మతి నందియమేలా
యిలలో మనముల నేలె నాతఁడే
సలిగె మనకతని శరణమే కలది

రేకు: 0309-03 దేవగాంధారి సం: 04-051 దశావతారములు


పల్లవి :

అన్నివిధములుఁ దానై యాతుమలో మరి వీఁడే
పన్నిన యీ పరమాత్మభావనే మా బ్రదుకు


చ. 1:

గోపాలకృష్ణునిచూపే కోరిన పనులపాఁడి
గోపికావల్లభుకృపే కూర్మివనిత
శ్రీపతిదయే మాకుఁజేరే ధనధాన్యములు
చేపట్టిన బ్రహ్మతండ్రి చిత్తమే మాపుత్రులు


చ. 2:

జలధిశాయికరుణే సర్వరత్నములసొమ్ము
అల పీతాంబరువాత్సల్యమే వస్త్రములు
మలయు గరుడధ్వజుమన్ననే వాహనములు
యిల నచ్యుతనామమే యిదే మాకాయుష్యము


చ. 3:

అమృతమథను మహిమదె మా గాదెల కొల్చు
విమతదైత్యారి యావేశమే భయహరము
అమర శ్రీవేంకటేశు నడుగులే మాకు నిండ్లు
తమితో నాతనిదేవే తల్లియుఁ దండ్రియును

రేకు: 0309-04 సామంతం సం: 04-052 దశావతారములు


పల్లవి :

తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము


చ. 1:

నిండినట్టి మడుగుల నీరువంక పొలము
కొండలు మోఁచినపెద్ద గొబ్బరపుఁబొలము
అండనే పొలము రాజులుండేటి పొలము
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము


చ. 2:

అసపడి వరదానమడిగిన పొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కేమునులకు రచ్చైన పొలము
వేసరక నాఁగేట వేగిలైన పొలము


చ. 3:

మంచి గురుతైన రావిమానిచేని పొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము
యెంచఁగ శ్రీవేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటి పొలము

రేకు: 0309-05 గుండక్రియ సం: 04-053 వైరాగ్య చింత


పల్లవి :

నే నేమి సేయుదును నిన్నుఁ బో వివేకము
శ్రీనాథుమహిమలు చిమ్మి రేఁచఁగాను


చ. 1:

జీవుఁడేమి సేయును; చిత్తము వసముగాక
యీవల నావలఁ బరువెత్తఁ గాను
చేవల నా చిత్తమేమి సేయు; నందులోన నున్న-
శ్రీవల్లభునిమాయ చిమ్మిరేఁచఁగాను


చ. 2:

దేహ మేమిసేయును; దేహము లోపల నున్న-
దాహపుటాసలు వెళ్లి దవ్వఁగాను
యీహల నాయాసలును యేమిసేయు; నన్నిటికి
శ్రీహరి యానాజ్ఞ లిటు చిమ్మిరేఁచఁగాను


చ. 3:

పుట్టు గేమిసేయును; పురాకృతము వెంటఁ
గట్టిన బంధములై కలఁచఁగాను
గుట్టుతో శ్రీవేంకటేశుఁ గొలువఁగా నన్నతఁడు
మట్టుమీరఁ బదవిచ్చి మన్నించఁగాను

రేకు: 0309-06 లలిత సం: 04-054 దశావతారములు


పల్లవి :

సిరిమగఁడే మొగసిరి రక్ష
మరుగురుఁడే మా మర్మపు రక్ష


చ. 1:

పులుగు నెక్కినవాఁడే పులుగుదోషపు రక్ష
బలు బాలుఁడైనవాఁడే బాలగ్రహ రక్ష
మొలచి పిన్నై మిన్నుముట్టఁబెరిగినవాఁడే
తొలఁగఁ దోసేటి ముట్టుదోషపు రక్ష


చ. 2:

బూతకిఁ జంపినవాఁడే బూతకి వాకట్టు రక్ష
పాతాళానఁ గూర్మమైనపతి గుంతదోష రక్ష
ఘాతఁగరుణాకరుఁడై కరుణా దృష్టివాఁడే
మా తరతరము ద్రిష్టిమంత్రపు రక్ష


చ. 3:

పాముపైఁ బండేటివాఁడే పాములవాకట్టు రక్ష
సేమపు సర్వజీవాత్మ జీవ రక్ష
నేమపు శ్రీవేంకటాద్రి నిలయుఁడై యున్నవాఁడే
యేమిటాను మా పురుఁటియింటి రక్ష