తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 305

రేకు: 0305-01 రామక్రియ సం: 04-025 అంత్యప్రాస

పల్లవి:

భావించరో వేదములు పలికేటి వునికి
జీవులు బ్రహ్మానందముఁ జెందేటి వునికి

చ. 1:

నిచ్చలు నిద్దురలకు నెలవైన వునికి
యిచ్చలఁ గలలు గన నిరవైన వునికి
కుచ్చిన నిట్టూర్పులకొన దాఁకే వునికి
తచ్చిన మాటలధ్వని దాఁకేటి వునికి

చ. 2:

మునుకొన్న చూపులకు మొదలైన వునికి
అనిశము కతలెల్ల నాలకించే వునికి
వెనుకొన్న చవులెల్లా వెలవెట్టే వునికి
గునిసి మేల్‌కనుటకు గురియైన వునికి

చ. 3:

వావిరి నింద్రియపరవశమందే వునికి
కైవశమై పదియారుకళలుండే వునికి
చావకుండా నమృతము జాలువారే వునికి
శ్రీవేంకటేశుపాదాలు చింతించే వునికి

రేకు: 0305-02 దేవగాంధారి సం: 04-026 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

అమరాంగన లదె యాడేరు
ప్రమదంబున నదె పాడేరు

చ. 1:

గరుడవాహనుఁడు కనకరథముపై
యిరువుగ వీధుల నేఁగీని
సురలును మునులును సొంపుగ మోఁకులు
తెరలిచి తెరలిచి తీసేరు

చ. 2:

యిలధరుఁడదివో యింద్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలఁగి సేవలటు సేసేరు

చ. 3:

అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుఁ డరదమున నెగడీని
నలుగడ ముక్తులు నారాదాదులును
పొలుపు మిగులఁ గడుఁ బొగడేరు

రేకు: 0305-03 దేపాళం సం: 04-027 కృస్ణ

పల్లవి:

అడుకులు చక్కిలాలు ఆనవాలు నురుగులు
వడపప్పు మొదలుగా వాముల కొలఁదులు

చ. 1:

దేవకి కొడుకుఁగన్న దినమిది శ్రీజయంతి
భావించ మన కన్నులపండుగులాయ
దేవునిఁ బూజించితిమి తేరో నైవేద్యాలు
కైవసమై కృష్ణునికి గంపల కొలఁదులు

చ. 2:

వసుదేవుఁ డెత్తెను శ్రావణబహుళాష్టమిని
పసగాఁ దొట్లే నూఁచి పాడఁగలిగె
సిసువితనికి మొక్కి చేసేము జాగరాలు
కొసరరో వరములు కోట్ల కొలఁదులు

చ. 3:

బలభద్రుతమ్ముఁ డాయ పతి యలమేల్మంగకు
నెలమితో మనకెల్ల నేలికాయ
తలఁచి శ్రీవేంకటాద్రిఁ దానే యవతారమందె
అల సంతోషమందరో అబ్బినకొలఁదులు

రేకు: 0305-04 ముఖారి సం: 04-028 గురు వందన, నృసింహ

పల్లవి:

ఏ బలిమి నమ్మి వెరపెరఁగరు దేహులాల
గాబువలెఁ బెరిగేరు కాలము విూచుట్టమా

చ. 1:

చెలరేఁగి దానములు సేసినట్టి బలిమో
అలరి కర్మము సేసినట్టి బలమో
చలపట్టి తపము లాచరించిన బలిమో
కొలఁదిలేక సురలఁ గొలిచిన బలిమో

చ. 2:

ధీరత సుజ్ఞానము దెలిసిన బలిమో
కోరక విరక్తి గైకొన్నబలిమో
శూరత లోకానకెల్లఁ జుట్టమైన బలివమో
వూరకే బ్రహ్మకల్పము లుండేటట్టి బలిమో

చ. 3:

పరగ శ్రీపతినామపఠనము బలిమో
హరిదాసుల శరణన్నట్టి బలిమో
సిరుల శ్రీవేంకటేశు సేవచేసిన బలిమో
గురుభక్తితోడ నెక్కువయైన బలిమో

రేకు: 0305-05 నారాయణి సం: 04-029 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

అనాది జగమున కౌభళము
అనేకాద్భుతం బౌభళము

చ. 1:

హరినివాస మీ యౌభళము
అరిది పరమపద మౌభళము
అరిదైత్యాంతక మౌభళము
హరముఖసేవిత మౌభళము

చ. 2:

అమలరమాకర మౌభళము
అమితమునీంద్రం బౌభళము
అమరవందితం బౌభళము
అమరెఁ బుణ్యముల నౌభళము

చ. 3:

అగరాజంబీ యౌభళము
అగణితతీర్థం బౌభళము
తగు శ్రీవేంకటధామవిహారం-
బగు శుభాంచితం బౌభళము

రేకు: 0305-06 మాళవిగౌళ సం: 04-030 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

విచారించుకొనేవారి వివేకాల కొలఁదులు
పచారించి వున్నవెల్ల భావనమాత్రములు

చ. 1:

జగములన్ని నీశరీరమేకనక
తగు వైకుంఠాలే వుండేతావు లెల్లాను
పొగరు స్వర్గ నరకభూములనే లోకాలెల్ల
పగటున తమలోని భావనమాత్రములు

చ. 2:

అన్ని పదార్థాలు నీయందే పుట్టివచ్చేఁగాన
తిన్నని నీప్రసాదాలే దినభోగాలు
వన్నెల నిష్టానిష్ట వస్తుభేదము లెల్లాను
పన్నుకొన్న యటువంటి భావనమాత్రములు

చ. 3:

అంతరాత్మవు శ్రీవేంకటాధిప నీవేకాన
చెంతల నీ కైంకర్యాలే చేఁతలెల్లాను
వింతలైన సంసార విహారములెల్లాను
బంతినే నానావిధ భావనమాత్రములు