తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 301

రేకు : 0301-01 రామక్రియ సం:04-001 కృష్ణ

పల్లవి:
     ఎక్కడికంసుడు యిఁక నెక్కడిభూభారము
     చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు

చ. 1:
     అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు
     అదన శ్రీకృష్ణుఁడందె నవతారము
     గదయు శంఖచక్రాలు గల నాలుగుచేతుల
     నెదిరించి యున్నాఁడు ఇదివో బాలుఁడు

చ. 2:
     వసుదేవుడల్ల వాఁడే వరస దేవకి యదే
     కొసరే బ్రహ్మాదుల కొండాట మదే
     పొసఁగ బొత్తులవిూదఁ బురుటింటి లోపల
     శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు

చ. 3:
     పరంజ్యోతిరూప మిదె పాండవుల బ్రదికించె
     అరిది కౌరవులసంహరమూ నిదె
     హరికర్ఘ్యములీరో జయంతి పండుగ సేయరొ
     కెరలి శ్రీవెంకటాద్రి కృష్ణుఁడితఁడు

       రేకు: 0301-02 దేసాళ౦ సం:04-002 అధ్యాత్మ

పల్లవి
       నాకు నాకే సిగ్గయ్యీని నన్ను జూచుకొంటేను
       చేకొని నీవే మన్నించ జెయ్యెుగ్గేఁగాని

చ. 1:
       సేయరాని పాపములు సేసివచ్చి యేనోర
       నాయెడ నిన్ను వరములడిగేను
       కాయముతో నింద్రియకింకరుఁడనై యేమని
       చేయార నీబంటనని చెప్పుకొనేను

చ. 2:
       వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి
       యేగతిఁ గొసరి నీపై నేఁట వేసేము
       అగడపు బంగారుకాతుమనే నమ్ముకొని
       భోగపుమోక్షము నెట్టు వొందించు మనేము

చ. 3:
       కలుపుట్టుగుబదుకు కాంతలకు వెచ్చపెట్టి
       వలసి నేడెట్టు నీవార మయేము
       నెలవై శ్రీవేంకటేశ నీవ కరుణించితివి
       బలిమిసేసి నీకెట్టు భారము వేసేము


రేకు:0301-03 శంకరాభరణం సం: 04-003 శరణాగతి

పల్లవి:
      అచ్చుతు శరణమే అన్నిటికిని గురి
      హెచ్చుకుందు మరి యెంచఁగనేది

చ. 1:.
      యోనిజనకమగు యొడ లిది
      యేనెల వైనా నేఁటి కులము
      తానును మలమూత్రపుఁ జెలమ
      నానాచారము నడచీనా

చ. 2: పాపపుణ్యముల బదుకిది
      యేపొద్దు మోక్షం బెటువలె దొరకు
      దీపనబాధల దినములివి
      చూపట్టి వెదకఁగ సుఖ మిందేది

చ. 3:
      మరిగినతెరువల మనసుయిది
      సరవినెన్న విజ్ఞానంబేది
      యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే
      వేరవని కంటే వెలితిఁక నేది

         రేకు:0301-04 బౌళి సం: 04-004 అధ్యాత్మ

         పల్లవి:
               నిజమో కల్లో నిమిషములోననే
               భజించు వారల భాగ్యము కొలఁది
         
         చ. 1:
              వొకఁడు కనుదెరచి వున్నది జగమను
              వొకఁడు కన్నుమూశోగి లేదనును
              సకలము నిట్లనె సర్వేశ్వరుఁడును
              వెకలినరులు భావించినకొలది

         చ. 2:
              కడుపు నిండొకఁడు లోకము దనిసె ననును
              కడుపు వెలితైనఁ గడమను నొక్కఁడు
              తడవిన నిట్లనే దైవమిందరికి
              వెడగునరులు భావించిన కొలఁది
         
          చ. 3:
              ముదిసి యొకఁడనును మోక్షము చేర్వని
              తుదఁ బుట్టొకఁడది దూరమనును
              యెదుటనే శ్రీవేంకటేశ్వరుఁ డిట్లనే
              వేదకి నరులు భావించిన కొలది


రేకు: 0301-05 వసంతవరాళి సం: 04-005 అంత్యప్రాస

పల్లవి:
     ఏమందు మిందుకు నెఱిఁగినదే తొల్లి
     శ్రీమాధవుఁడ నీవు సేసినదే తొల్లి

చ. 1:
    వొక మానఁ జేఁదూ వొక మానఁ దీపూ
    కకిపికలై రెండూ గలవే తొల్లి
    వొకనికజ్ఞానము వొకనికి జ్ఞానము
    సకలానఁ గలుగుట సహజమే తొల్లి
            
చ. 2:
    పగలు వెలుఁగు పైపై రాత్రి చీఁకటి
    నిగిడి లోకములను నిజమే తొల్లి
    మొగి సురలకు మేలు ముంచి దైత్యులకుఁ గీడు
    తగిలి నోసలివ్రాఁత తప్పదిది తొల్లి

చ. 3:
    వెన్నెలలు చంద్రునందు వెడ యెండసూర్యునందు
    కన్నుల లోకమువారు గన్నదే తొల్లి
    యెన్నఁగ శ్రీవేంకటేశ యేలినవాఁడవు నీవు
    వున్నవారు నీకింద నున్నవారు తొల్లి

రేకు: 0301-06 లలిత సం: 04-006 కృస్ణ

పల్లవి:
     ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగలినాఁడు
     యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు

చ. 1:
    యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
    పూతకిచన్ను దాగి పొదలినాఁడు
    యీతఁడా వసుదేవుని యింటిలో నిధానము
    చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు


చ. 2:
    మేటియైన గొంతిదేవి మేనల్లుఁ డీతఁడా
    కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
    పాటించి పెంచే యశోదపాలి భాగ్య విూఁతఁడా
    వాటమై గొల్లెతలను వలపించినాఁడు

చ. 3:
    ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
    జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
    మిగుల శ్రీవేంకటాద్రిమీఁది దైవమితఁడా
    తగి రామకృష్ణావతార మందె నిప్పుడు