తాతా చరిత్రము/తాతా బాల్యదశ
2. తాతా బాల్యదశ.
పార్సీల ప్రాచీనగ్రామము లన్నిటిలో ముఖ్యమైనది 'నవసారి' ఇదిబరోడారాజ్యమున 'తపతీ' తీరమందు (సూరతుకు 18 మైళ్ళదూరమున) ఉన్నది. అందలి పార్సీ గురువులగు 'దస్తుర్లు' 19 వ శతాబ్దాంతమువరకు మన స్వాములవర్లవలె పూర్వాచారపరులై, సంస్కరణముల ప్రతిఘటించుచుండిరి. కాని 'కూపకూర్మ' తత్వము పార్సీయులకు రుచింపలేదు. వారు బాల్యమున దస్తుర్లయొద్ద మతవిద్యబడసి, సూరతు, బొంబాయి, అహమ్మదాబాదు పురములజేరి, అందు వ్యాపారముజేసి ధనికులై, ఉదారభావముతో దాన మొనర్చుచుండిరి.
నవసారియే తాతావంశీయులకును స్వగ్రామము, జంషెడ్జి పూర్వీకుడగు 'బెహరము' ను 'దస్తురే' ; అతడు ధీమంతుడయ్యు, కొంత శీఘ్రకోపి, అందుచే, తరుచు, ఇతరులపై చీకాకు పడుచుండెను. ఆయన దారిని బోవునపుడు కొంద రల్లరిపిల్ల లాయన తీవ్ర స్వభావు డని సూచించుటకు 'తాతా' అనుచుండిరి.†[1] ఈ 'తాతా' అను మాట తన చెవినిబడగ నే బెహరం మరింత కోపించుచుండెనట. ఆయన యుడికినకొలదిని బాలు రాపేరునే మరింత వాడజొచ్చిరి. ఇట్లాయనకు కొంతకాలముకు 'తాతా'యే వాడుకపేరై, తుదకా వంశ మంతకు నది వంశనామము లేక 'ఇంటిపేరు' అయిపోయెను. బెహరమునుండి 12 వ తరపువాడు 'నస్సర్వంజి' ; ఆయన 1822 లో జనించి, బాల్యమున నవసారిలో మతవిద్య నేర్చుకొని, అంతట బొంబాయిపురము జేరి, అందు వర్తకము నేర్చుకొనెను. అతడు విద్వాంసుడు కాకున్నను, ప్రాజ్ఞుడు, సమయస్ఫూర్తిగలవాడు; మితవ్యయపరుడై కొంతసొమ్ము మిగుల్చుకొని, అందుతో నస్సర్వంజి వ్యాపారము చేసి, ద్రవ్య మార్జించెను. పూర్వాచారప్రకారము బాల్యమందే యతనికి వివాహమై, 1834లో నవసారిగ్రామమున, అతని యేకపుత్రుడగు మన 'జంషెడ్జి' జనించెను.
శైశవమునుండియు 'జంషెడ్జి' మంచి విద్యాసక్తి యుండెను.**[2] అప్పటికి నవసారిలోనున్న వీధిబడిలోనే జంషెడ్జి గుజరాతి, చరిత్ర, గణితము, మతవిద్య, నేర్చుకొనెను ; మనో గణితమం దాతని కభిలాషమెండు. నస్సర్వంజి తన కొడుకును నవసారిలో శుష్క వాదపరుడగు పురోహితునిగ నుంచక, 1852లో, ఉన్నత విద్యకై బొంబాయి కంపెను. బొంబాయి యప్పటికే వ్యాపారరంగమై, జనసంకులమై యుండెను. ఈనగరము జంషెడ్జికి నూతనలోకముగ దోచెను ; అందు జనులంద రేదోయొక పని జేయుచుండిరి. జ్ఞానార్జన కందు చాల సౌకర్యము లుండెను. ప్రభుత్వకళాశాలయందు శాస్త్రవేత్తలు విద్యను విజ్ఞానమును బోధించుచుండిరి. జంషెడ్జి అం దారేండ్లు చదివి, పరీక్షలో కృతార్థుడై, 1858 లో విద్యను ముగించెను.
అతడు 17 వ యేట నే 'హీరాబాయి' అను పార్సీ బాలికను వివాహమాడెను ; 1860లో వారి జ్యేష్ఠపుత్రుడగు దోరాబ్జితాతా కలిగెను.
అప్పటికి వకీళ్లు అరుదు; న్యాయవాదివృత్తి చాల ఆకర్షముగ నుండెను. తండ్రి జంషెడ్జిని న్యాయవాదిగనే చేయ దలచి, ఆతని నొక సొలిసిటరు కార్యాలయమున జేర్చెను.*[3] అతడందే యుండినచో సామాన్యజీవితమే గడపియుండును. అట్లు జరుగక, 1859లోనే దానిని వదలి, జంషెడ్జి తనతండ్రి కొట్టులో జేరి, అందు వ్యారసూత్రముల నేర్చుకొనెను. అదృష్టవశమున నట్లు వృత్తి మారి, జంషెడ్జి వ్యాపారనాయకు డగుట సంభవించెను. అప్పటికి మనదేశమున కొత్తపరిస్థితు లారంభించెను. సుప్రసిద్ధమగు సిపాయియుద్ధపు కల్లోల మప్పుడే యణగెను.'కంపెనీ' అధికారముపోయి బ్రిటిషు ప్రభుత్వమువారు స్వయముగా మన దేశపాలన నారంభించిరి. రాష్ట్రములందు హైకోర్టులు, 'యూనివర్సిటీ'లు కొత్తచట్టములు, ఏర్పడెను. నవనాగరికత ప్రభావము ప్రసరింపదొడగెను.
- __________
- ↑ † సంస్కృతమున 'తప్త' అనగా 'వేడియైన, తీవ్రమైన, తపించిన' అని అర్ధము. ప్రాకృతమున 'తప్త'యే 'తాతా' అయినది. ప్రాకృతపు ఘూర్జర శాఖనుండి వచ్చిన గుజరాతిలోను నిదేరూపము.
- ↑ * ఈక్రిందివృత్తాంత మాతనివిద్యాసక్తిని సూచించును. నవసారిలో తాతాయింటికొక మిద్దెయుండెను. ఆమిద్దెకు పైకప్పు తలకు తగులునట్లుండెను. జంషెడ్జి యందుకూర్చొని చదువుచుండగా, ఒకరోజున పెద్ద గాలివాన వచ్చి హోరున వర్షించెను ; గాలి విసురుకు భయపడి, అందరు నాయిల్లు విడచిరి. కాని బాలుడగు జంషెడ్జి మాత్రము దానిని సరకుచేయక తదేకదీక్షతో నా మిద్దపైననే చదువుకొనుచుండెను. ఈసంగతి తెలిసి, తండ్రి లోనికి పరువెత్తిపోయి, జంషెడ్జిని కష్టముతో నీవలకు తెచ్చెను. వా రీవలకు వచ్చిన కొద్దిక్షణములకే, ఆమిద్దెయిల్లు ఒక్క సారిగా నేలగూలెను.
- ↑ * కోర్టులో వాదముచేయక, నోటీసుల బంపుట, దస్తావేజులను ప్లయింటులు నోటీసులు మున్నగువాని వ్రాయుట, సలహాల నిచ్చుట మున్నగు తక్కిన న్యాయవాది కార్యము లన్నిటిని జేయువారు 'సొలిసిటరు' లనబడుదురు.