తమి బిగిసిపోవు నొక్క సంధ్యావసాన
తమి బిగిసిపోవు నొక్క సంధ్యావసాన
సాంద్ర కాశ్మీర దృఢపరిష్వంగ మందు
నిమిడి, నిలు వెల్ల ఒదిగి శోషిలిన యామె
నేను తొలిసారి కాంచి కంపిలితి నాడు.
కార్మొయిలు పెదవుల ఖండఖండములుగ
చిదికిపోయిన కౌముదీ మృదులకళిక
కాంచి యొకరేయి దుస్సహ గాఢ దుఃఖ
మాపుకో లేక యేడ్చె నా యార్ద్ర మనము!
క్రొత్తరాక నొడలె యెరిగికొనని గాలి
తమకపుం గౌగిలింత తొందరల నలగి
యూపి రాడక మూర్ఛిలు నొక్క యలరు
గని వనట క్రుంగినా నొక్కదినము దినము.
వాడిపోయిన ప్రతి సౌరభమ్ము కొరకు
కనుమొరంగిన ప్రతి హిమకణము కొరకు
బ్రతుకు బ్రతు కెల్ల కరగు బాష్పములు కాగ,
ఎట్లు కననేర్తు నా నాటి దృశ్య మేను?
దారి తల లెత్తు నింత సౌందర్యలవము
వదలిపోలేరు చంపెడువరకు వీరు!
మృదుల కరుణా మధురము నా హృదయ, మెవ్వ
రెరుగజాలుదు రే మని యేడ్తు నెపుడు!