తత్త్వముల వివరము/4వ తత్త్వము

--------------4. తత్త్వము-------------


ఊదేతిత్తుల పైగానుండే ఉన్నతి తెలియర ఓరన్నా- తిత్తుల నడుమను చక్షుల విూదను చీకటి కొట్టుర ఓరన్నా


1) చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - చిఱ్ఱున తీసుక లేపిన కాకకు పాము లేచుర ఓంరన్నా ||ఉ||


2) శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్నా ||ఉ||


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా ||ఉ||


వివరము :- శరీరములో కుడి ఎడమగ రెండు ఊపిరితిత్తులున్నాయని అందరికి తెలుసు. రెండు తిత్తులనుండి వచ్చే ఊపిరి ముక్కు ద్వారా బయటికి వస్తున్న విషయము కూడ అందరికి తెలుసు. ఊపిరితిత్తులు కదలుతుంటేనే శ్వాస ఆడుచున్నదని కూడ అందరికి తెలియును. ఊపిరి తిత్తులు ఎలా కదులుచున్నవి, వాటిని ఎవరు కదలించుచున్నారన్న విషయము ఎవరికి తెలియదు. ఊపిరితిత్తులను కదలించుశక్తి ఏదని తెలుసుకోవడమునే పై తత్త్వములో ఊదేతిత్తుల ఉన్నతి తెలియర ఓరన్నా అన్నారు. మన శరీరములో రెండు ఊదేతిత్తుల (ఊపిరితిత్తుల) మద్యలోను మరియు పైన రెండు కన్నుల మద్యలోను క్రింద గుదస్థానము మొదలుకొని పై శిరస్సు వరకు వెన్నుపూసల మద్యలో వెన్నుపాము అనబడు నరముగలదు. పై తత్త్వములో పాము అన్నట్లు వెన్నుపాము పేరుకు పామువలె పొడవుగ ఆకారమున్నప్పటికి అది మెదడు నుంచి క్రింది వరకు వ్యాపించిన ఒక పెద్దనరము. శరీరములో అతిపెద్ద నరము వెన్నుపాము ఒక్కటే. ఈ నరములోనే మనిషిలోని చైతన్యశక్తి ఇమిడియున్నది. దానిని కుండలీశక్తియని కొందరనుచున్నారు. వాస్తవానికి అది మన శరీరములోని ఆత్మశక్తియే. ఆత్మ అంటే ఏమిటి? దాని శక్తి అంటే ఏమిటి? అని కళ్లుమూసుకొని కళ్లమద్య స్థానములోనికి చూచితే అంత చీకటిమయముగ కనిపించును. ఆ విషయమునే పై తత్త్వములో తిత్తుల నడుమను చక్షుల విూదను చీకటికొట్టుర ఓరన్నా అని అన్నారు.


1) చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - తీసుక లేపిన కాకకు పాము చిఱ్ఱున లేచుర ఓరన్నా ||ఉ||

చీకటిమయముగ ఉన్న ఆత్మను పాముగ కూడ ఒక తత్త్వములో చెప్పుకొన్నాము మన ధ్యాసనంతటిని కన్నుల మద్యలో భ్రూమద్యమున కేంద్రీకరించిన అది యోగమగును. యోగము యొక్క తీవ్రతకు ఆత్మ తెలియుటకు మొదలిడును. ధ్యాసనంతటిని భ్రూమద్యన కేంద్రీ కరించడమును తోక నాలుక తీసుక అన్నారు. తోక చివరిది నాలుక అనగ మొదటిది చిన్న ఆలోచనను, పెద్ద ఆలోచను అన్నిటిని లేకుండ చేసకోవడమును, లేక చివరి ఆలోచనను మొదటి ఆలోచనను లేకుండ చేసుకోవడమును తోక నాలుక అనడమైనది. అన్ని ఆలోచనలను లేకుండ చేసుకుంటే ఆత్మ తొందరగ తెలియును. పాము భూమి విూద పడుకొనియున్నపుడు కనిపించకుండ ఉండును. పైకిలేచి పడగెత్తితే అంతకు కనిపించని పాము కనిపించును. ఆలోచనలు అనచినపుడు యోగమునకు ఆత్మ పైకిలేచిన పాము తెలిసినట్లు తెలియగలదని మొదటిచరణములో చెప్పారు.


2) శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్నా ||ఉ||

శరీరములో వెన్నుపాము అను నరమునకు కుడి ఎడమగ రెండు నరములు గలవు. వెన్నుపామును బ్రహ్మనాడి అని అనుచు కుడి ఎడమగవున్న రెండు నాడులను సూర్యచంద్రనాడులు అంటున్నారు. సూర్యచంద్రనాడుల నడుమయున్న వెన్నుపామును ఆదిశేషుడని పై తత్త్వములో అన్నారు. సూర్యచంద్రనాడులను శంకుచక్రములని కూడ అన్నారు. వెన్నుపాములోని ఆత్మశక్తి ఊపిరితిత్తులను కదలించుట వలన శ్వాస నడుచుచున్నది. శ్వాస నడుపునపుడు ఓంకార శబ్దము ఏర్పడు చున్నది. ఈ విషయమునే రెండవచరణములో తెలుపుచు శంకు చక్రముల నడుమను ఆదిశేషుని లేపర ఓరన్నా - ఓంకారించుకయున్నది పాము అని అన్నారు.


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా ||ఉ||

వెన్నుపాములో మొత్తము ఏడు నాడీకేంద్రములున్నవి. పైన ఏడవ నాడీకేంద్రములో ఆత్మ కేంద్రముగ ఉండి క్రింది ఆరు కేంద్రముల వరకు వ్యాపించియున్నది. క్రింద ఆరు కేంద్రములనుండి శరీరమంత నరముల ద్వార ప్రాకి శరీరమును చైతన్యవంతముచేసి కదలించుచున్నది. బ్రహ్మనాడిలోని ఆత్మ ఆరు కేంద్రములనుండి శరీరమంత వ్యాపించి ఉన్నది. ఈ విషయమును తెలియజేస్తు ఆరుచక్రముల ఆవల ఈవల లోపల వెలుపల అన్నారు. పైన ఏడవకేంద్రము నుండి క్రింది కేంద్రములకు వ్యాపించి యున్నది కావున ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా అని మూడవచరణములో అన్నారు. ఈ తత్త్వములో ఆత్మ వెన్నుపాములో పై నుండి క్రిందికి వ్యాపించి ఆరు కేంద్రముల ద్వార శరీరమంతటిని కదలించుచున్నదని, శరీరములోని ఊపరితిత్తుల ద్వార శ్వాసను ఏర్పరచినదని తెలియుచున్నది. శరీరములో తెలియక కనబడకయున్న ఆత్మను మనోధ్యాస ద్వార తెలుసుకోవచ్చునని కూడ పై తత్త్వములో తెలిపారు. కొలిమితిత్తులవలె శరీరములోని ఊపిరితిత్తులు గలవు కావున వాటిని ఊదేతిత్తులు అన్నారు. ఊదేతిత్తుల ద్వార శ్వాసను ఎల్లపుడు ఊదువాడు వెన్నుపాములోని ఆత్మని తెలియబడినది.

-***-