తత్త్వముల వివరము/10వ పద్య తత్త్వము

-------------10. పద్య తత్త్వము-------------


ఆదిద్యయంబు వృక్షంబు
విూదట రెండక్షరములు మేధినిచరితా
ఆదియు అంత్యము కూడిన
వేదాంతం దీని తెలియు వేద వేద్యుల్‌

వివరము :- మన శరీరములో ప్రతి ఒక్కరికి శ్వాస ఆడుచున్నది. శ్వాసను బట్టి ప్రాణమున్నదని లేదని చెప్పవచ్చును. కావున శ్వాసను ప్రాణము అన్నారు. అనగ గాలి అని అర్థము మన శరీరములో ఐదు రకముల గాలులు గలవు. అవి వరుసగ వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులంటాము. వాటినే పంచప్రాణములని కూడ అనుచున్నాము. వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన, లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది. రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు పుట్టిన వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున విూదటి రెండక్షరములని అని అన్నారు. లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి. లోపలికి పోవు "సో" శబ్దమును బయటికి వచ్చు "హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే '"ఓం" అను శబ్దము పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది. అలాగే రెండవదైన హం శబ్దములో "మ్‌" శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన అని మూడవ చరణములో అన్నారు. ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో "ఓమ్‌" అను శబ్దము ఇమిడి ఉన్నది. ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.

-***-