జ్యోతిష్య శాస్త్రము/రాశి అంటే ఏమి? లగ్నము అంటే ఏమి?
31. రాశి అంటే ఏమి? లగ్నము అంటే ఏమి?
మార్చుజ్యోతిష్యులందరూ పన్నెండు స్థానములను రాశులనీ, అలాగే లగ్నములనీ పలుకుచుందురు. ఒకప్పుడు వృషభలగ్నమని పేరును జోడిరచి చెప్పిన దానినే మరొకప్పుడు వృషభరాశి అని చెప్పుచుందురు. ఒకమారు లగ్నమని మరొకమారు రాశియని ఒకే స్థానమును చెప్పుట వలన, రాశి అనినా లగ్నమనినా ఒకటేనని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి రాశి వేరనీ, లగ్నము వేరనీ తెలియవలెను. కాలచక్రములోని పన్నెండు స్థానములను లగ్నములని చెప్పవచ్చును. అలాగే కర్మచక్రములోని పన్నెండు స్థానములను పన్నెండు రాశులని చెప్పవచ్చును. కాలచక్రములోని భాగములను మాత్రమే లగ్నమనాలి. లగ్నము అనుమాటను కాలచక్రములో నున్న ఏ స్థానమునకైనా వాడవచ్చునుగానీ, ఎటువంటి సందర్భములో అయినా రాశి అను పేరును కాలచక్రములోని భాగములకు వాడకూడదు. ఇకపోతే కర్మచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు స్థానములుగా చెప్పుకొనుచున్నాము. కాలచక్రములోని ప్రతి భాగమునకు ఒక పేరు కలదు. కర్మచక్రములోని భాగములకు పేర్లులేవు. వాటికి సంఖ్యమాత్రము ఉండును. అందువలన మూడవ స్థానమనీ, నాల్గవ స్థానమనీ స్థానములకు సంఖ్యను చేర్చి చెప్పుచున్నాము. సంఖ్యల స్థానములుగా చెప్పబడు పేరులేని భాగములైన కర్మచక్రస్థానములను రాశులని పిలువడము జరుగుచున్నది. రాశి అంటే దేనినైనా కుప్పగా పోసినప్పుడు ఆ కుప్పను రాశి అనడము జరుగుచున్నది. కర్మచక్రములోని అన్ని భాగములలోనూ కర్మను రాశులుగా నింపియుండడము వలన, ప్రతి మానవుడు కర్మచక్రములోని రాశులలోనున్న కర్మనే అనుభవించడము జరుగుచున్నది. కర్మచక్రములోని పన్నెండు స్థానములలో కర్మ పేర్చబడియున్నది. కావున ప్రతి స్థానమును రాశి అంటున్నాము. కర్మచక్రములోని ఏ స్థానములో ఏ కర్మ రాశిగా పోయబడు చున్నదో, మనము ఇంతకు ముందే తెలుసుకొన్నాము.
లగ్నము అనగా అంటిపెట్టుకొనియున్నదనీ, తగులుకొనియున్నదనీ చెప్పవచ్చును. కాలచక్రములో గల పన్నెండు గ్రహములు ఏదో ఒక స్థానమును అంటిపెట్టుకొని ఉండుట వలన ఆ స్థానములను లగ్నములు అన్నాము. ప్రతి గ్రహము కొంతకాలము ఒక స్థానమును అంటిపెట్టుకొని యుండి తర్వాత మరియొక ప్రక్క స్థానములోనికి చేరుచున్నది. అందువలన కాలచక్రములోని స్థానములను లగ్నములను పేరుతో చెప్పుచున్నాము. ఒక గ్రహము కాలచక్రములోని ఒక స్థానమును ఆశ్రయించుకొని, అక్కడ నుండి తన కిరణములను క్రిందనున్న కర్మచక్రములోని కర్మరాశుల మీద ప్రసరింపజేయుచుండును. ఒక గ్రహము ఒక కాల లగ్నములోవుండి కర్మరాశి మీద తన కిరణములు పడినప్పుడు, ఆ కర్మరాశిలో ఏ కర్మ ఉండునో ఆ కర్మను స్వీకరించి, క్రింద గుణచక్రములోనున్న జీవుని మీదకు ప్రసరింపజేయును. అప్పుడు జీవుడు ఆ కర్మను అనుభవించడము జరుగు చున్నది. కాలచక్రములోని గ్రహములను కాంతిని ప్రసరించు ఫోకస్‌లైట్లుగా పోల్చుకొని, క్రింద కర్మచక్రములోని కర్మను రంగు పేపరుగా పోల్చుకుంటే, గ్రహము కాంతి, క్రింది చక్రములోని కర్మరంగును, ఇంకా క్రిందగల గుణ చక్రములోని జీవుని మీద ప్రసరించుట వలన, కర్మరంగును జీవుడు పొందుచున్నాడు. ఈ విషయము క్రింద 47వ చిత్రపటములో చూడండి.
లగ్నములలోని గ్రహములు రాశులలోని కర్మలను గుణములలోని జీవుని మీద వేయుట వలన, జీవుడు ఎటూ తప్పించుకోకుండా కర్మను అనుభవించవలసివస్తున్నది. ఒక మనిషి ఒక బాధను అనుభవిస్తున్నాడంటే వాని తలలోనున్న కాల, కర్మ, గుణచక్రములలో మనకు తెలియకుండానే ఒక క్రియ జరుగుచున్నదని తెలియుచున్నది. కనిపించక అజ్ఞానమను చీకటిమయములోనున్న ఈ క్రియను జ్ఞానము అను దీపముతో తెలియడమునే జ్యోతిష్యము అంటున్నాము. సంగీతములో రాగం, తాళం, పల్లవి ఉన్నట్లు జ్యోతిష్యములో లగ్నములలోని గ్రహములు, రాశులలోని కర్మ, గుణములలోని జీవుడు కలడు. రాగం, తాళం, పల్లవి తెలిస్తేనే సంగీతమును తెలిసినట్లు, గ్రహ లగ్నములు, కర్మ రాశులు, అనుభవించే జీవుడు తెలియనిదే జ్యోతిష్యము తెలియదు.
ఆధ్యాత్మిక విషయములో పరమాత్మను గురించి చెప్పునప్పుడు కొందరు కొన్ని సమయములలో దేవుడనీ, కొన్ని సమయములలో భగవంతుడనీ చెప్పుచుందురు. చాలామందికి దేవునికీ, భగవంతునికీ అర్థము తెలియదు. కావున దేవున్ని భగవంతున్ని తమకిష్టమొచ్చినట్లు చెప్పుచుందురు. అదే విధముగా జ్యోతిష్య విషయములో లగ్నము అంటే ఏమి, రాశి అంటే ఏమి అని అర్థము, వివరము తెలియనప్పుడు ఏ సందర్భములో లగ్నమును చెప్పాలనీ, ఏ సందర్భములో రాశిని చెప్పాలనీ, తెలియక లగ్నమును చెప్పవలసిన చోట రాశినీ, రాశిని చెప్పవలసిన చోట లగ్నమునూ చెప్పుచున్నారు. భగవంతున్ని చెప్పవలసిన చోట దేవున్ని, దేవున్ని చెప్పవలసిన చోట భగవంతున్ని చెప్పడము ఎంత తప్పో లగ్నము, రాశియొక్క వివరము తెలియకుండా చెప్పడము అంతే తప్పగును.