జ్యోతిష్య శాస్త్రము/జ్యోతిష్యము అంటే ఏమిటి?
1.జ్యోతిష్యము అంటే ఏమిటి?
జ్యోతిష్యము అను పదమును విడదీసి చూచితే ‘జ్యోతి’ మరియు ‘ఇష్యము’ అను రెండు శబ్దములు కలవు. ఆ రెండు శబ్దములను కలిపితే జ్యోతి+ఇష్యము=జ్యోతిష్యము అను శబ్దము ఏర్పడుచున్నది. జ్యోతిష్యము లోని మొదటి శబ్దమును పరిశీలించి చూచితే ‘జ్యోతి’ అనగా వెలుగుచున్న దీపము అని అర్థము. వెలుగుచున్న దీపము కాంతి కల్గియుండునని అందరికీ తెలుసు. చీకటి గృహములో దీపము లేకపోతే ఇంటిలోని వస్తువు ఒక్కటి కూడా కనిపించదు. ఇంటిలోని వస్తువులు ఎన్ని ఉన్నవీ? ఏమి వస్తువులు ఉన్నవీ? ఆ వస్తువులు ఖరీదైనవా? కాదా? వస్తువులు నగలైతే ఏ లోహముతో చేసినవి? కట్టెలైతే ఏ జాతి చెట్టు కట్టెలు? పాత్రలైతే మట్టివా? ఇత్తడివా? గుడ్డలైతే నూలువా? పట్టువా? కాయలు అయితే ఏ జాతి చెట్టు కాయలు? మొదలగు విషయములను దీపకాంతితోనే తెలుసుకోగలము. ఆ విధముగ చీకటిలో ఉపయోగపడునది దీపము. వివిధ రకముల వస్తువుల వివరమును తెలుసుకోవడమును ‘ఇష్యము’ అంటున్నాము. దీపము వలన వస్తువుల వివరము తెలియబడడమును ‘జ్యోతిష్యము’ అంటాము. ఉదాహరణకు ఒకడు చీకటితో నిండిన తన ఇంటిలో ఏమున్నది తెలియకున్నపుడు, తనవద్ద దీపము లేకపోయినా, లేక తాను గ్రుడ్డివాడైనా, మరొకని సహాయమడిగి అతని వలన తెలుసుకోవడము జరుగుచున్నది. ఎదుటివాడు మన ఇంటిలో వస్తువుల వివరము మనకు తెలుపాలంటే, అతను కూడా తన దీపమును ఉపయోగించి చూడవలసిందే అట్లు చెప్పడమును ‘జ్యోతిష్యము’ అంటున్నాము.
ఇక్కడ కొందరు భాషా పండితులు ఒక ప్రశ్న అడుగవచ్చును. ‘జ్యోతి’ అనగా దీపము అని అర్థము కలదు. కానీ ‘ఇష్యము’ అనగా తెలుసుకోవడము అని అర్థము ఎక్కడా లేదే అని అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! బయట దేనిని తెలుసుకొనినా దానిని తెలుసుకోవడము, గ్రహించడము అనియే అనుచుందుము. కానీ ‘ఇష్యము’ అను పదము ఎక్కడా వాడడము లేదనుట నేను కూడా ఒప్పుకొందును. ఒక్క శరీరములోని కర్మను తెలుసుకొనునపుడు మాత్రము ‘ఇష్యము’ అను పదమును ఉపయోగించెడివారు. ‘ఇష్యము’ అను పదము లేక శబ్దమును ఒక పాప పుణ్యములను తెలుసుకొనునపుడు మాత్రము ఉపయోగించుట వలన, ఆ పదము ప్రత్యేకమైనది. అలాగే ‘జ్యోతి’ అను పదమునకు ఇక్కడ దీపము అని అర్థము చేసుకోకూడదు. ‘జ్యోతి’ అంటే జ్ఞానము అని భావించవలెను. ఇది ఒక్క ఆధ్యాత్మికములోనే ‘జ్యోతిని’ జ్ఞానము అని అంటున్నాము. ఆత్మ జ్ఞానముగల మనిషి తన జ్ఞానముతో ఎదుటి మనిషి శరీరములోని కర్మను తెలుసుకొని, వానికి తెలుపడమును ‘జ్యోతిష్యము’ అంటాము. ఇక్కడ జ్యోతిష్యము అంటే దీపముతో వస్తువును తెలుసుకొనేది కాదు, జ్ఞానముతో కర్మను తెలుసుకోవడమని అర్థము. ఇపుడు జ్యోతిష్యము అంటే దైవజ్ఞానము కల్గిన వ్యక్తి, ఒక మనిషి కర్మలోని పాపపుణ్యములను తెలుసుకొని పాప ఫలితమునూ, పుణ్యఫలితమునూ వివరించి చెప్పడము అని పూర్తిగ అర్థమగుచున్నది. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! శరీరాంతర్గత కర్మ ఫలితమును చెప్పు దానిని ‘జ్యోతిష్యము’ అనవచ్చును. కానీ బయటి ప్రపంచ వస్తువులను గురించి చెప్పునది జ్యోతిష్యము కాదు. ఉదాహరణకు జరుగబోవు ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనడముగానీ, లేక నేను దాచిపెట్టిన వస్తువేది అని అడగడముగానీ, మూసిన బోనులోని జంతువేది అని అడగడముగానీ, నా ప్యాకెట్లోని వస్తువు ఏదో చెప్పు అని అడగడముకానీ, జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నలు కాదు. దానికి సమాధానము చెప్పడము జ్యోతిష్యము కాదు. ఎందుకనగా! ఇటువంటి ప్రశ్నలన్నీ ఏవైనా కానీ శరీరాంతర్గత కర్మకు సంబంధించినవి కావు. వ్యక్తి కర్మను చూచి చెప్పునవి కావు, కావున అది జ్యోతిష్యము కాదు.
ఏది జ్యోతిష్యమో, ఏది జ్యోతిష్యము కాదో తెలియని పరిస్థితి నేడు కలదు. అదే విధముగా జ్యోతిష్యుడు అను పేరు పెట్టుకొన్న వారిలో చాలామంది ఏది జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నో, ఏది ప్రశ్న కాదో కూడ తెలియని స్థితిలో ఉన్నారు. అటువంటి గందరగోళములోనే కొందరు వాస్తును కూడ జ్యోతిష్యము అంటున్నారు. వాస్తుద్వారా మనిషికి భవిష్యత్తు చెప్పవచ్చు అంటున్నారు. వాస్తవానికి, వాస్తు జ్యోతిష్యము కాదనీ, వాస్తు శాస్త్రమేకాదనీ, జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధములేదనీ చాలామందికి తెలియదు. ఇటువంటి పరిస్థితిలో నెరవేరని వాస్తు ఫలితములను చూచి, అదే విధముగ ప్రశ్నగాని జ్యోతిష్యమును చూచి, వాస్తును నిరూపిస్తే ఐదు కోట్లూ, జ్యోతిష్యము ద్వారా మా ప్రశ్నకు జవాబు చెప్పితే, అది నిజమైతే, పదికోట్లు ఇస్తామని పందెమునకు దిగే నాస్తికులూ, హేతువాదులూ తయారైనారు. ఇదంతయు చూస్తే ఇటు వాస్తును శాస్త్రమని చెప్పే వారికీ, బయటి దానికి జవాబు చెప్పడమునే జ్యోతిష్యశాస్త్రమనే జ్యోతిష్యులకూ, అటు నాస్తికులకూ, హేతువాదులకూ జ్యోతి తెలియదు, జ్యోతిష్యమూ తెలియదు. జ్యోతిష్యము అంటే ఏమిటో తెలియనపుడు దాని పేరు పెట్టుకొని చెప్పే జ్యోతిష్యశాస్త్రులుగానీ, అదేమిటని ప్రశ్నించే నాస్తికవాదులుగానీ ఇద్దరూ ఒక కోవకు చెందినవారేనని చెప్పవచ్చును. జ్యోతిష్య శాస్త్రులు, నాస్తికవాదులూ ఇద్దరూ అసలైన జ్యోతిష్యమంటే ఏమిటో తెలియాలనికోరుచున్నాము.