జ్యోతిష్య శాస్త్రము/జాతకము అంటే ఏమిటి?
5. జాతకము అంటే ఏమిటి?
జ్యోతిష్యశాస్త్రములో వ్రాసుకొన్న సిద్ధాంతముల ప్రకారము, ఒక మనిషి యొక్క భవిష్యత్తును జ్యోతిష్యముగా చూడాలంటే, వాని జాతకము తప్పక ఉండాలి. జాతకముతోనే ప్రారంభమౌతుంది జ్యోతిష్యము, కావున జాతకమునకు, జ్యోతిష్యమునకు అవినాభావ సంబంధమున్నది. ఇంతకీ జాతకమంటే ఏమిటో, ఈ కాలపు మనుష్యులకు చాలామందికి తెలియ దనుకుంటాను. ఈ కాలములో కూడ జాతకమును గురించి కొంతమంది తెలిసినవారుండినా, వారికి కూడ జాతకములోని యదార్థము తెలియదు. దీనినిబట్టి జాతకము అను శబ్దము అర్థహీనమైనదని తెలియుచున్నది. జాతకము యొక్క నిజమైన శబ్దము ఆదికాలమందు ఎలాగుండెడిదో, అది నేడు పలుకుచున్న జాతకముగా ఎట్లు మారినదో కొంత వివరించి చూచుకొందాము.
‘జా’ అనగా పుట్టడమని అర్థము. పుట్టిన జీవుడు ఏ సమయములో పుట్టాడో, ఆ సమయములో ఖగోళమున గ్రహములు భూమికి ఏయే దిశలలో ఉన్నాయో, వాటి స్థానములను గుర్తించుకోవడమును జాతకము అంటుంటారు. కానీ మేము చెప్పునదేమనగా! ఒక జీవుడు పుట్టకముందే అతను పుట్టిన తర్వాత చనిపోవువరకు ఏవిధముగ నడుచుకోవాలి? ఏయే కష్టసుఖములు అనుభవించాలి? ఏమి తినాలి? ఏమి మాట్లాడాలి? ఎప్పుడు పడుకోవాలి? అను మొదలగు అన్ని పనులను ఒక్కక్షణము కూడ వదలకుండ అన్ని కాలములలో ఒక ఫతకము ప్రకారము నిర్ణయించి పెట్టడమును ‘జాఫతకము’ అంటాము. పుట్టినపుడే నిర్ణయించబడియున్న ఫతకము కావున, ఆ ఫతకమును ‘జాఫతకము’ అంటున్నాము. ఇంగ్లీషుభాషలో ‘బర్త్‌ప్లాన్’ అంటున్నాము. ఒక జన్మకు కావలసిన పనుల ఫతకమును పూర్వము జాఫతకము అని అనెడివారని తెలిసినది. కాలము గడుస్తూరాగా, కొంతకాలమునకు జాఫతకము అను పదములోనున్న ఐదక్షరములలో ‘జా’ ప్రక్కనగల ‘ఫ’ అను రెండవ అక్షరము ఎగిరిపోయినది. మనుషులు ‘ఫ’ అక్షరమును పలకడములేదు. చివరకు నాలుగు అక్షరముల పదము ‘జాతకము’గ మిగిలిపోయినది. ఐదక్షరముల జాఫతకములోని అర్థము జాతకము అను పదములో లేకుండ పోయింది. చివరకు జాతకము అర్థము లేనిదైపోయి ఉన్నది. ఈనాటి జ్యోతిష్యులు ఎందరుండినా పూర్వమున్న ‘జాఫతకము’ను తెలియక, అందరూ దానిని జాతకము అని అంటున్నారు.
ఒక జీవుడు శరీరము ధరించి పుట్టిన సమయమును జననము అంటున్నాము. పుట్టడమును ‘జ’ అని, మరణించడమును ‘గతి’ అని కూడ అంటున్నాము. పుట్టినప్పటినుండి మరణించువరకు గల కాలమును ‘జీవితము’ అంటున్నాము. పుట్టడమును, చావడమును కలిపి ‘జగతి’ అంటున్నాము. ‘జ’ నుండి ‘గతి’ వరకు మధ్యకాలములో గల జీవితమును నిర్ణయించి ఆడిరచు కర్మను ప్రారబ్ధకర్మ అంటున్నాము. ఒక జీవితమునకు ముందుగానే సంచితకర్మ అను కర్మ కూడలినుండి, కొంతకర్మను కేటాయించడమును ‘జాఫతకము’ అంటున్నాము. కేటాయించిన కర్మ పేరు ప్రారబ్ధము అయితే, కేటాయించిన పద్ధతిని జాఫతకము అంటున్నాము. ఒకని జీవితమునకు పుట్టుకలోని జాఫతకమును చూస్తే, ఆ జన్మకు సంబంధించిన ప్రారబ్ధము ఫలానా అని తెలియును. ప్రారబ్ధము తెలిస్తే వాని జీవితములోని కష్టసుఖములు తెలియును. ఈ పద్ధతి ప్రకారము జాతకము ద్వార ప్రారబ్ధమును తెలియడమునే ‘జ్యోతిష్యము’ అంటున్నాము.