జ్యోతిష్య శాస్త్రము/గ్రహములంటే ఏమిటి? అవి ఎన్ని గలవు?
10 . గ్రహములంటే ఏమిటి? అవి ఎన్ని గలవు?
ఇపుడు కొదువగా మిగిలియున్న కాలచక్రములోని గ్రహములను గురించి, వాటి పనిని గురించి, వాటి సంఖ్యను గురించి తెలుసుకొందాము. గ్రహము అనగా గ్రహించునదని అర్థము. నీరు ఉప్పును గ్రహించునట్లు, గాలి వాసనను గ్రహించునట్లు గ్రహము కర్మను గ్రహించును. గుణచక్రము లోని గుణము వలన జరిగిన కార్యములో, క్రొత్త కర్మ పుట్టుచున్నదని తెలుసుకొన్నాము. అలా పుట్టిన కర్మను కాలచక్రములోని గ్రహములు గ్రహించుకొని, కర్మచక్రమునందు నిలుచునట్లు చేయును. నిత్య జీవితములో కర్మను ఏ గ్రహము గ్రహించి కర్మచక్రములో నిలువయుంచుచున్నదో, అదే గ్రహము, అదే ప్రారబ్ధకర్మను సమయమొచ్చినపుడు జీవుని మీద ప్రసరింపజేయును. సృష్ఠికర్త అయిన దేవుని చేత తయారు చేయబడిన గ్రహములు, కాలచక్రములో ప్రతిష్ఠింపబడి అక్కడనుండి గుణచక్రములో తయారగు కర్మను గ్రహించి, కర్మచక్రములో నిలువ చేయుచున్నవి. అలా గుణములనుండి గ్రహములు గ్రహించు క్రొత్తకర్మను ‘ఆగామికర్మ’ అంటున్నాము. కర్మచక్రములో నుండి గ్రహించి జీవుని మీద వదలబడు కర్మను ‘ప్రారబ్ధకర్మ’ అంటున్నాము. జ్యోతిష్యమునకు ప్రారబ్ధకర్మ యొక్క విధి విధానము గలదు. గుణచక్రములో తయారగు క్రొత్తకర్మ 108 రకములు కాగా, గుణములు ముఖ్యమైనవి పండ్రెండు గలవు. కాలచక్రములోని 12 గ్రహములు, గుణచక్రములోని 12 గుణముల గుంపు నుండి గ్రహించిన కర్మను, కర్మచక్రములోనున్న 12 భాగములలో నిలువయుంచుచున్నవి. గుణచక్రములోని 12 గుణములు తయారు చేయు కర్మను, కర్మచక్రములో 12 భాగములలో నిలువ చేయు 12 గ్రహములు కాలచక్రములోని 12 భాగములలో గలవు. ఇక్కడ విచిత్రమేమంటే! ఇంతవరకు ఎవరికీ తెలియని గ్రహముల సంఖ్య మనకు తెలిసినది. కాలచక్రములోని 12 గ్రహములు అదే చక్రములోని 12 భాగములను తమ స్వంతస్థానములుగా ఏర్పరచుకొన్నవి.
గుణచక్రములోని రెండు వర్గముల గుణములనుబట్టి, పాపపుణ్య అను రెండు వర్గముల కర్మ తయారగుచున్నది. ఆ కర్మను కర్మచక్రములో రెండు వర్గములుగానే స్థాపించుటకు గ్రహములు కూడా రెండు వర్గములైనాయి. అలా ఏర్పడిన ఒక్కొక్క వర్గములో ఆరు గ్రహములుండగ, రెండు వర్గములలో 12 గ్రహములు గలవు. కష్టానికి వ్యతిరేఖమైనది సుఖము. అలాగే పాపమునకు వ్యతిరేఖమైనది పుణ్యము. వీటిని గ్రహించు గ్రహములు కూడ రెండువర్గములై, ఒకదానికి ఒకటి వ్యతిరేఖముగా ఉన్నవి. కర్మనుబట్టి రెండు వర్గములైన గ్రహములలో, ఒక్కొక్క వర్గమునకు ఒక్కొక్క గ్రహము ఆధిపత్యము (నాయకత్వము) వహించుచున్నవి. అలా ఏర్పడిన రెండు వర్గముల యొక్క అధిపతులు ఒకరు గురువు, మరొకరు శని. వీరిని బట్టి మిగత గ్రహములను గురువర్గము (గురుపార్టీ) గ్రహములనీ, శనివర్గము (శని పార్టీ) గ్రహములనీ అనుచున్నాము. ఒక వర్గమునకు శని నాయకుడు కాగ, అతని ఆధీనములో మిగత ఐదు గ్రహములుండును. అలాగే మరొక వర్గమునకు గురువు నాయకుడు కాగా, అతని ఆధీనములో మిగత ఐదు గ్రహములుండును.