జ్యోతిష్య శాస్త్రము/కర్మ ఎన్ని రకములు?

8. కర్మ ఎన్ని రకములు?

కర్మ విధానమును బాగా ఆధ్యాయనము చేస్తే, మనిషి పుట్టినప్పటి నుండి ఒకటి సంపాదించే కర్మ, రెండు అనుభవించేకర్మ అని రెండు రకములు గలవు. ఇవి రెండూకాక సంపాదించేది ఎక్కువై, అనుభవించేది తక్కువైనపుడు శేషముగా (బ్యాలెన్సుగా) మిగిలే కర్మ కొంతవుంటుంది. అలా మిగిలిన శేషము యొక్క నిల్వను ‘సంచితకర్మ’ అని అంటున్నాము. ఒక జన్మలో సంపాదించిన కర్మను ‘ఆగామికర్మ’ అని అంటున్నాము. అట్లే ఒక జన్మలో అనుభవించే కర్మను ‘ప్రారబ్ధకర్మ’ అని అంటున్నాము. బ్రహ్మవిద్యా శాస్త్రము ఆగామికర్మ యొక్క వివరమును తెలియజేయును. జ్యోతిష్యశాస్త్రము ప్రారబ్ధకర్మ యొక్క వివరమును తెలియజేయును. ఆగామికర్మను సంపాదించుకోకుండా ఉండే వివరమును తెలుపునది ‘బ్రహ్మవిద్యాశాస్త్రము’. అలాగే ప్రారబ్ధకర్మలోని అనుభవములను వివరించి తెల్పునది ‘జ్యోతిష్య శాస్త్రము’. ఇపుడు మనము జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రారబ్ధమును గురించి తెలుసుకొందాము.

ప్రారబ్ధకర్మ ఎలా పుట్టుచున్నదో అని చూస్తే, పొగ పుట్టుటకు నిప్పుకారణమన్నట్లు, ప్రారబ్ధకర్మ పుట్టుటకు మనిషి తలలోని గుణములు కారణము. తల మధ్యలోగల నాల్గుచక్రముల సముదాయములో, క్రిందనున్న చక్రము పేరు గుణచక్రము. గుణచక్రము మూడు భాగములుగా విభజింపబడి వున్నది. గుణచక్ర చిత్రమును ఈ క్రిందగల 6వ పటమునందు చూడవచ్చును.

గుణ చక్రము - 6వ పటము

గుణచక్రములోని మూడు భాగములకు మూడు పేర్లు గలవు. మూడు పేర్లు బయటనుండి వరుసగా తామస,రాజస,సాత్త్వికము అని గలవు. మధ్యలోనున్న బ్రహ్మనాడి ఇరుసు భాగములో ఆత్మ ఉండును. అందువలన దానిని ‘ఆత్మభాగము’ అంటాము. మధ్యలోని ఆత్మ భాగము గుణచక్రమునకే కాక అన్ని చక్రములకూ ఉండును. ఇక్కడ మధ్యలోని ఆత్మభాగమును వదలివేస్తే, మిగిలిన గుణభాగములు మూడు మాత్రమే ఉండును. బ్రహ్మవిద్య ప్రకారము గుణచక్రమును ఆత్మ భాగముతో కలిపి నాల్గుభాగములని చెప్పవలెను. కానీ జ్యోతిష్యశాస్త్రము ప్రకారము మనకు అవసరమైనవి మూడు భాగములు మాత్రమే. అందువలన ఇక్కడ గుణచక్రమును, మూడు భాగములుగానే చెప్పుకోవలెను. మూడు భాగములలోనూ గుణములుండును. మనకు అర్థమగుటకు ముందు ఒక గుణభాగమును తీసుకొని చూచెదము. తామస గుణ భాగమును చూస్తే, అందులో రెండు గుంపులుగానున్న గుణములు ఉండును. ఆ రెండు గుంపులలో ఒక గుంపు గుణములు చెడు గుణములనీ, రెండవ గుంపులోని గుణములు మంచి గుణములనీ పేరుగాంచి ఉన్నవి. చెడు గుణములు మొత్తము ఆరు గలవు. అట్లే మంచిగుణములు మొత్తము ఆరు గలవు. చెడు గుణముల పేర్లు వరుసగా 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మత్సరము అని గలవు. వీటినే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అంటాము. మంచి గుణముల పేర్లు వరుసగా 1) దానము 2) దయ 3) ఔదార్యము 4) వైరాగ్యము 5) వినయము 6) ప్రేమ అని గలవు. వీటినే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు అంటాము. మొదటి ఆరు చెడు గుణములు ఒక గుంపుగా, రెండవ ఆరు మంచి గుణములు మరియొక గుంపుగా గలవు. అంతేకాక మొదటి గుంపులోని ఆరు చెడు గుణములకు వ్యతిరేఖగుణములుగా, రెండవ గుంపులోని ఆరు మంచి గుణములు గలవు. శరీరములోని జీవునికి ఆరు చెడు గుణములు శత్రువులనీ, ఆరు మంచి గుణములు మిత్రులని పేరుగాంచి ఉన్నవి.

జీవునికి చెడు ఆరు గుణములు శత్రువులుగా ఉండి, ఆ గుణము లలో దేనిద్వారా బయటిపని జరిగినా, దానిద్వారా జీవునకు పాపము వచ్చునట్లు చేయుచున్నవి. ఇక్కడ సూత్రమేమనగా! ఒక గుణ ప్రేరణ వలన జరిగే పనిలో ఒక కర్మ పుట్టుచున్నది. చెడు గుణము వలన జరిగిన పనిలో పాపమూ, మంచి గుణము వలన జరిగిన పనిలో పుణ్యమను పుట్టుక వచ్చుట సహజము. దీనినిబట్టి పాపపుణ్యముల పుట్టుక స్థానము గుణ చక్రమని తెలియుచున్నది. ఒక తామసగుణభాగములో మంచి, చెడు గుణములు మొత్తము పండ్రెండు ఉన్నట్లు, రాజసగుణభాగములోనూ పండ్రెండు గుణములు గలవు. అట్లే సాత్త్విక గుణభాగములోనూ పండ్రెండు గుణములు గలవు. మొదటి తామస గుణభాగములో మిత్ర, శత్రువులు అను రెండు గుంపుల గుణములున్నట్లే, మిగత రెండు గుణభాగములలోను గలవు. దీని ప్రకారము మూడు భాగములలో మొత్తము గుణముల సంఖ్య ‘36’ గా తెలియుచున్నది. ఒక భాగములోని 12 గుణములకు మరొక భాగములోని 12 గుణములకు పేర్లు ఒకే విధముగా ఉన్నవి. కానీ ఒక భాగములోని ‘ఆశ’ అను గుణమునకు, మరొక భాగములోని ‘ఆశ’ అను గుణమునకు కొంత తేడా ఉండును. ఇట్లు ఒక భాగములోని గుణమునకు మరొక భాగములోని గుణమునకు కొంత భేదము ఉన్నట్లు, మిగత అన్ని గుణములకు భేదము ఉండునని తెలియవలెను. అదే విధముగా ఒక భాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు, మరొక గుణభాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు కొంత తేడా ఉండును. ఒకే పేరు కల్గిన గుణములు, మూడు భాగములలో ఉండినప్పటికీ, అవి కొంత భేదము కల్గియున్నట్లు, వాటి వలన వచ్చు పాపపుణ్యములను కర్మ కూడా కొంత భేదము కల్గియుండునని గుర్తుంచుకోవలెను. ఈ విషయము అర్థమగుటకు క్రింది చిత్రము కొంత ఉపయోగపడును. కావున 7వ పటమును చూడుము.


గుణచక్రము - 7వ పటము

ఒక భాగములోని గుణములకు, మరొక భాగములోని గుణములకు పేర్లు ఒకే విధముగా ఉండినా, అవి ఒకే విధముగా లేవనీ, వాటి వలన వచ్చు కర్మకూడా ఒకే విధముగా లేదనీ తెలుసుకొన్నాము కదా! ఇపుడు ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమనగా! ఒక భాగములోని ఒకే పేరున్న గుణము, తాను ఒకటే కాక, తన జాతి గుణముల సముదాయముగా ఉన్నది. ఉదాహరణకు తామస గుణభాగములోని క్రోధము ఒక్కటేగాక, అది తొమ్మిది క్రోధముల గుంపుగా ఉన్నది. ఒక భాగములోని తొమ్మిది సంఖ్యలోనున్న ఒకేపేరుగల గుణములు సమానముగా లేకుండ, పరిమాణములో తేడా కల్గియున్నవి. ఎట్లనగా! ఒక పేరున్న క్రోధము లేక కోపము యొక్క గుణముల గుంపులో మొదటిది పెద్దగా ఉండగా, దాని తర్వాత రెండవది మొదటి దానికంటే పరిమాణములో కొంత చిన్నదిగా ఉండును. తర్వాత రెండవ దానికంటే మూడవది పరిమాణములో కొంత తక్కువగా ఉండును. ఆ విధముగా ఒకదానికొకటి చిన్నదిగా ఉంటూ, చివరి తొమ్మిదవది అన్నిటికంటే చిన్నదిగా ఉండును. తామసభాగములో కోపము తొమ్మిది రకములుగా ఉన్నట్లు, మిగత రెండు భాగములలో కూడా కోపము తొమ్మిది భాగములుగా ఉన్నది. దీనినే చిన్న కోపము, పెద్ద కోపము, కొంత కోపము అంటున్నాము. ఒక భాగములో ఒక గుణము తొమ్మిది గుంపుగా ఉండుట వలన, చెడు గుణములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు గుణముల గుంపు మొత్తము యాభై నాలుగుగా ఉన్నవి. 6×9=54 ఒక చెడు గుణముల గుంపు ఉండగా, మరొక మంచి గుణములు కూడ 6×9=54 గుంపుగా ఉన్నవి. ఈ విధముగా లెక్కించి చూచితే ఒక గుణ భాగములో పెద్ద గుణములు మొత్తము పండ్రెండు కాగా, వాటి గుంపులోని చిన్న గుణములను కూడ లెక్కించి చూచితే 12×9=108 మొత్తము నూటఎనిమిది గుణములుగా ఉన్నవి. ఒక తామస భాగములోనున్నవి 108 గుణములు కాగా, రాజస భాగములోనూ 108 గుణములు కలవు. అట్లే సాత్త్విక భాగములోనూ గుణముల సంఖ్య 108 గానే కలదు. మూడు భాగములలోనూ మొత్తము గుణముల సంఖ్య 108×3=324 గా ఉన్నది. గుణముల గుంపు చిత్రమును ఈ క్రిందగల 8వ పటములో చూడుము.

గుణచక్రము - 8వ పటము

తామస భాగములో గుణముల సంఖ్య 108 కదా! వాటివలన ఉత్పన్నమయ్యే కర్మకూడ 108 రకములుగా ఉండును. అందులో 54 గుణముల వలన వచ్చునది పాపము కాగా, మిగత 54 గుణముల వలన వచ్చునది పుణ్యమై ఉన్నది. ఈ విధముగా ఒక తామస భాగములోనే కర్మ 108 రకములుగా తయారుకాగా, మొత్తము మూడు భాగములలో 324 రకముల పాపపుణ్యములు తయారగుచున్నవని చెప్పవచ్చును. ఇపుడు, కర్మ ఎన్ని రకములు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక గుణ భాగములో అయితే 108 రకములనీ, మూడు గుణ భాగములలో మొత్తము 324 రకములు అని సులభముగా చెప్పవచ్చును. కర్మ విధానమూ, కర్మయొక్క విభాగముల విధానమూ, భూమిమీద ఒక ఇందూమతములోనే కలదు. మిగతా మతములలో కర్మ విధానముగానీ, దాని విభజనగానీ ఎక్కడా కనిపించదు. ఇది బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారమున్నది. కానీ ఇప్పటి కాలమున జ్యోతిష్య శాస్త్రములో కూడ కర్మ విధానమును ఎవరూ వ్రాసుకోవడము జరుగలేదు.