జ్యోతిష్య శాస్త్రము/అంగీ, అర్థాంగి
25. అంగీ, అర్థాంగి
మార్చుజ్ఞానమునుబట్టి ఏ కర్మ ఎక్కడ చేరుచున్నదో తెలియకున్నా, అది అంతయు జ్యోతిష్యశాస్త్రమునుబట్టి తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రమును బట్టి ఏ కర్మ ఎంత తీవ్రమైనదో, దానివలన బాధ ఎంత తీక్షణముగా ఉండునో, దానిని అనుభవించకుండా తప్పించుకొనుటకు దారి ఏదో తెలియును. బ్రహ్మవిద్యా శాస్త్రముతో అనుసంధానమైనది జ్యోతిష్య శాస్త్రము. అందువలన బ్రహ్మవిద్యా శాస్త్ర సంబంధముతోనే మనిషి కర్మచక్రములో (కర్మపత్రములో) ఏ కర్మ ఎక్కడ లిఖితమైనదో తెలుసుకొందాము. మనిషి జననముతో అతని జీవితము ప్రారంభమగుచున్నది. తర్వాత ఎంతో కొంత కాలమునకు మనిషికి సంభవించు మరణముతోనే అతని జీవితము అంత్య మగుచున్నది. జీవితములో ఇటు మొదలు అటు అంత్యమునకు పుట్టుక చావులు రెండూ అందరికీ తెలిసిన సంఘటనలే. వాటి వివరము కర్మ రూపములో ఉండకపోయినా ఎక్కడినుండి కార్యములు మొదలగునో, ఎక్కడ అంత్యమగునో దానికి సంబంధించిన కర్మలు కర్మచక్రములో లిఖితమైనవి. కర్మచక్రములో పన్నెండు స్థానములుండగా, అందులో జీవిత ప్రారంభకర్మ మొదటిదైన ఒకటవ స్థానములోనూ, అలాగే జీవిత అంత్యము లోని కర్మ చివరిదైన పన్నెండవ స్థానములోనూ వ్రాయబడియుండును.
అలాగే పైనగల 36వ చిత్రములో 12 భాగములను రెండు భాగములుగా విభజించి, అందులో మొదటి భాగమున ఒకటవ స్థానము తన శరీరమునకు సంబంధించినదనియూ, రెండవ భాగమున ఏడవ స్థానము తన భార్యకు సంబంధించినదనియూ గుర్తించాము. మొదటి భాగమున ఆరు స్థానములు దాటిన తర్వాత రెండవ అర్థ భాగము ఏడవ స్థానమునుండి ప్రారంభమగుట వలన, భార్యను అర్థాంగి అని చెప్పుచూ, కర్మచక్రములో (కర్మపత్రములో) ఏడవ స్థానములోనే భార్యకు సంబంధించిన కర్మను లిఖించడము జరిగినది. ఇంతవరకు 1,12 స్థానములు జనన మరియు మరణములనూ, 1,7 స్థానములలో 1వది తన శరీరమునకు సంబంధించిన కర్మను సూచించగా, 7వది తన భార్యకు సంబంధించిన కర్మను సూచించుచున్నది. ఇప్పటికి 1,7,12 స్థానములలో కర్మ ఏమి ఉండునో తెలిసిపోయినది. ఇక మిగత స్థానములలో ఎటువంటి కర్మలుండునో చూద్దాము.