జీవశాస్త్ర సంగ్రహము/రెండవ భాగము/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము.

శాఖ (Stem)

మనమందరము జూచు హెచ్చుజాతి, అనగా, పూవులుగల వృక్షములలో ఏకబీజదళము (Monocotyledon), ద్విబీజదళము (Dicotyledon) అని రెండుజాతులు గలవు. వాని నిర్మాణమందలి ముఖ్యమైనభేదములు ఈ ప్రకరణమునందు అక్కడక్కడ సూచింపబడును. కాన నా జాతు లిచ్చో పేర్కనబడినవి.

ద్విబీజదళవృక్షములు.

చింతగింజ, సెనగగింజ, ఆముదపుగింజ మొదలగుకొన్నిగింజలను పగులగొట్టి చూచిన అందు రెండు పప్పుబద్ద లుండును. ఈ గింజలనుండి మొక్కలు భూమిలోనుండి పుట్టునప్పుడు మీరందరు చూచియేయుందురు. ఆచిన్న మొక్కలు భూమిపైకి రాగానే దానికొమ్మయొక్క మొదటిభాగముననుబ్బి దళమైన పైనిజెప్పిన రెండు పప్పుబద్దలును రెండువైపుల నుండును. వీనికి బీజదళములని పేరు. ఇవియే కొమ్మయొక్క మొదటియాకులు. వీనియందు సామాన్యముగా హరితకములు లేకపోవుటచేత నివి తెల్లగ నుండును. కొన్నిటియం దీబీజదళములు కొంచెమాకుపచ్చగగూడ నుండవచ్చును. సామాన్యముగా నివి తక్కిన యాకులవలె సూర్యకాంతిసహాయముతో గాలినుండి ఆహారమును తయారుచేయునవి. గావు. ఆ చిన్న మొక్కకు ఆకుపచ్చని ఆకు లేర్పడి ఆహారమును సంపాదించిపెట్టువరకు కొన్ని దినములు పట్టును. ఆ కాలమునందు ఆ మొక్కకు కావలసిన ఆహారము శర్కరరూపమున ఈదళములలోనుండి యమర్చబడును. ఈ చక్కెర యీగింజలయందుండు పిండి (Starch) నుండి తయారుచేయబడినది. వీనియందలి పిండి బీజశర్కరికము (Diastase) అనునొక రసముయొక్కశక్తిచే నిట్లు చక్కెరగామారునని మూడవప్రకరణములో జెప్పియున్నాము. పైని జెప్పినట్లు రెండు బీజదళములుగలవృక్షములకు ద్విబీజదళములు (Dicotyledons) అనిపేరు.

ఏకబీజదళవృక్షము.

తాటిచెట్టు, అరటిచెట్టు, జొన్న, వరి మొదలగు కొన్నిధాన్యాదులు, గడ్డిమొక్కలు మొదలగునవియు ఏకబీజదళవృక్షములలో (Monocotyledons) జేరినవి. ఈజాతియందలి మొక్కలు గింజలనుండి అంకురించునప్పు డా పిల్ల మొక్కల కాహారమునిచ్చు బీజదళము ఒక్కటియే యుండును. తాటిమొక్క కాహారము నిచ్చుటకై ఏర్పడిన బీజదళములగు తేగలు తియ్యగనుండుట దానియందలి చక్కెరగుణమే. ఈ చక్కెరయే తాటిమొక్కకు బాల్యమునందు కొన్నిదినములవరకు ఆహారముగా నేర్పడుచున్నది. ఇట్లే వడ్లగింజలలోని బియ్యముగింజ వరిమొక్క యొక్క ఆహారమునిమిత్తము నిలువచేయబడిన యొక బీజదళము. ఇందుగల వరిపిండి, మొక్క యంకురించునప్పుడు చక్కెరగా మారును.

శాఖాప్రసారము.

శాఖాప్రసార మనగా శాఖలువ్యాపించురీతి. ఇది ఏకబీజదళ వృక్షములం దొకరీతిగను, ద్విబీజదళవృక్షములందు వేరొకరీతిగను ఉండును. ఎట్లనగా:-

ఏకబీజదళవృక్షము - కొబ్బెర, అరటి, ఈత, తాడి మొదలగు ఏకదళబీజవృక్షములందు ప్రకాండము అనగాబోదెగుండ్రముగను పొడుగుగను ఉండును (44-వ పటము చూడుము). దీనినుండి సామాన్యముగా నుపశాఖ లుండవు.కాని యక్కడక్కడ రెండుతలల త్రాళ్లు అని యుపశాఖలుగల త్రాళ్లు అరుదుగ నుండును. అయినను ఏకబీజదళవృక్షములలో నొక్క బోదెయే సామాన్యనిర్మాణము.

ద్విబీజదళవృక్షములు:- దీని ప్రకాండమున కనేక యుపకాండము లుండును. ఇవియన్నియు తల్లికొమ్మకును, దాని యాకునకును పైభాగమున నుండు ఆకుపంగ యనుభాగమునుడియే ప్రథమమున శాఖాంకురమను మొటిమగా నంకురించును 45-46-వ పటములలో రావితొగరుకొమ్మలను చూడుము). కొంత కాలమున కీ యాకు పండి రాలిపోయినను, ఇంచుక ముదిరిన కొమ్మలలోగూడ నా యాకు మొదటిమచ్చ స్పష్టముగ తెలియుచుండును.

ద్విబీజదళవృక్షములలో శాఖాప్రసారము రెండువిధములు:- 1. కిరణ (Whorl) ప్రసారము. 2. సర్ప (Spiral) ప్రసారము.

కిరణప్రసారము.

కిరణప్రసారము:- ఇది వారిపర్ణియొక్క ఆకులప్రసారము వంటిది. ఇం దొకశాఖ యనేకఖండములచే నేర్పడినది. ప్రతిఖండనమునందును స్కంధము స్కంధశిరము అను రెండుభాగములు గలవు. ఒకటిగాని అనేకములుగాని ఆకులు పుట్టుభాగమునకు స్కంధశిర మనిపేరు. రెండు స్కంధశిరములమధ్యనుండు భాగమునకు స్కంధ మనిపేరు. బాదము (Almond), బూరుగు (Silk cotton), తొగరు (Logwood), తులసి మొదలగుచెట్లయొక్క శాఖలప్రసారము చూడుము. ఈవిషయమును పరీక్షించు నిమిత్తము లేత తులసికొమ్మ నొకదానిని చేత బట్టుకొనుము. దీనికొమ్మలు ప్రకాండము (తల్లికొమ్మ) నుండి 45-వ పటములో జూపినప్రకారము కొంతకొంతదూరమున కొక్కొకచో పుట్టుచుండును. ఈకొమ్మలు వెడలుభాగమును కనుపులు అని వాడుదురు. ఇవియే స్కంధశిరములు. ఈకొమ్మల మొదళ్ళక్రిందిభాగములందు తల్లి

ద్విబీజదళవృక్షము-కిరణప్రసారము. ద్విబీజదళవృక్షము-సర్పప్రసారము.

కొమ్మమీద ఆకులుగాని ఊడిపోయిన ఆకులమచ్చలుగాని ఉండును. కాన నీకొమ్మలు స్కంధశిరముననుండు ఆకుపంగలనుండియే వెడలుచున్నవనిగ్రహించవలెను. ఈ కనుపులనుండి పొల్లకొమ్మలు కిరణములవలె ఇరుప్రక్కలకు వ్యాపించుచుండగా, తల్లికొమ్మ యథాప్రకారము నిలువున బోవుచుండును. ఇట్లు ఒక్క స్కంధశిరము నుండియే అనేక వైపులకు ప్రసరించుశాఖలయొక్కయు, ఆకులయొక్కయు వ్యాప్తికి కిరణప్రసార మని పేరు. ఒక్క మధ్యబింబమునుండి నలువైపులకు వ్యాపించు వెలుతురు కిరణములప్రసారమును బోలియుండుటచే నీ శాఖలవ్యాప్తి కిట్టినామము గలిగెను. కొన్ని కొమ్మలలో నలువైపులకు నాలుగుకొమ్మలు గానవచ్చును. బూరుగు చెట్టునందు ఒక్కొక స్కంధశిరమునుండి మూడుకొమ్మలుపుట్టి మూడువైపులకు వ్యాపించును. తులసి తొగరులందొక్కొక స్కంధశిరమున రెండేసికొమ్మలు పుట్టి యిరుప్రక్కలకు వ్యాపించును. ఒకానొకప్పుడు శాఖాంకురములలో కొన్ని పుట్టినతోడనే గొడ్డుపోయి (Become aborted) పెంపు మాసియుండుట చేత నీ శాఖలలో కొన్ని లోపించియుండును.

సర్పప్రసారము.

2. సర్పప్రసారము:- ద్విబీజదళవృక్షములలో ననేకము లీతరగతిలోనివే. రావి, మామిడి, చిక్కుడు మొదలగువాని లేతకొమ్మను చూడుము (46-వ పటము చూడుము). తల్లికొమ్మయందు ఒక్కొక కనుపునకు ఒక్కొక యాకును, ఆయాకుపంగయందు గాని, లేక దాని యెదుటిభాగమునగాని ఒక్కొక పిల్ల కొమ్మయొక్క అంకురమునుమాత్రము పుట్టుచుండును. ఈ ఆకులును శాఖాంకురములును ఒకసారి కుడిప్రక్కను, మరియొకసారి యెడమప్రక్కను క్రమముగా పుట్టుచుండును. ఈజాతికొమ్మ నొకదాని నెత్తి, వానియాకులను ద్రుంచివేసి ఆ యాకుల మచ్చల నన్నిటిని జేర్చునట్లుగా నొక గీటు గీసిన ఆ గీటు పాము మెలికలవలె కొమ్మచుట్టును చుట్టి చుట్టివచ్చును. కాన నిట్టి యాకుల ప్రసారమునకు సర్పప్రసారమని పేరు. ఈ ఆకుపంగలలో పుట్టిన శాఖలప్రసారమును ఇట్లే మెలికలుతిరిగినదిగా నుండును. దీనికిని సర్పప్రసారమనియే పేరు. ఈ శాఖలన్నియు పుట్టుకలో క్రమప్రకారము కుడియెడమలను ఒకటివిడిచి ఒకటి పుట్టినప్పటికిని అందు కొన్ని పెరుగకపోవుటచేతను, కొన్ని బాల్యమునందే పరులచే నాశముచేయబడుటచేతను, కొన్నికొమ్మలు అనేకవిధముల వంకరల నొందుటచేతను, చెట్టుయొక్క పెద్దకొమ్మలలో పై జెప్పిన నిర్ణయమైన సర్పప్రసారము కానరాదు. లేతకొమ్మలలో జూచిన నిది చక్కగ తెలియుచుండును.

గొడ్డు మొటిమలు.

ఈ శాఖాంకురములలో కొన్నిమాత్రము వృద్ధిబొంది, మరికొన్ని చిన్నచిన్న మొటిమలుగా నున్నప్పుడే గొడ్డువై అణగి యుండునని చెప్పియుంటిమి. లేతకొమ్మలందు కొన్ని ఆకుపంగలలో నీ గొడ్డు మొటిమలను చక్కగ జూడవచ్చును. ఇవియును గత్యంతరము లేనప్పుడు అనగా తప్పనితరి వచ్చినప్పుడు తిరిగి పెంపునొందును. ఎట్లన, ఒకకొమ్మయొక్క కొనమొగ్గను మనము త్రుంచివేసినయెడల నా కొమ్మకొనయందు పెంపు ఆగిపోవును. అంతట నీ పొట్టిమొటిమలన్నియు తమ యవసరము వచ్చినదని గ్రహించి పెరుగుటకు ప్రారంభించును. కావుననే మనము త్రుంచి వేసినట్టి ఒక్క తల్లికొమ్మకుబదులుగా అనేకములగు పిల్లకొమ్మలు గుబురుగా బయలువెడలును. తల్లికొమ్మ పెరుగుచున్నంతకాలము ఈ పై జెప్పిన మొటిమలలో ననేకములు పెంపునొందవు. ఈ కారణముచేతనే మిక్కిలి పొడుగుగ పెరిగిపోవు వరిచేలు మొదలగునవి పశువులచేత నొక్కతరి మేసినచో, అణగియున్న శాఖాంకురములన్నియు పెంపునొంది దుబ్బు కట్టుకొనివచ్చును. చెరుకుముక్కల కనుపులందలి యిట్టి గొడ్డుమొటిమలే భూమిలో నాటబడినప్పుడు మొక్కలుగా పుట్టుచున్నవి.

శాఖయొక్క, ఉపయోగములు.

జంతువులయొక్క ముక్కు నోరు మొదలగు వేర్వేరు అవయవములు వేర్వేరుపనులకు ఏర్పడియున్నట్టులే వృక్షములయొక్కయు ఆకు, కొమ్మ, వేరు మొదలగుభాగములు వేర్వేరుపనులకు నియమింపబడి యుండును. శాఖయొక్క ముఖ్యవ్యాపారము లీ క్రింద సంగ్రహముగ వ్రాయబడుచున్నవి.

1. ఆకులను భరించుట:- ఇవి వేలకొలది ఆకులను భరించును. ఈ యాకులు కొమ్మలకు గావలసిన యాహార పదార్థములను గాలిలోనుండి కైకొనును. మనవలె వృక్షములు నడచిపోయి యాహారమును సంపాదించుకొననేరవుగదా? ఇవి యున్న చోటనె యుండి తమ యాహారమును కొద్దికొద్దిగ జేర్చుకొనవలయును. ఇట్టి యాహారమును వృక్షము అనేక ముఖముల స్వీకరించినగాని దానికి వలసినంత యాహారము దొరకజాలదు. దీనిని సంపాదించుటకు వృక్ష మెంతవిరివిగ పత్రముల వ్యాపింపజేసిన నంతయనుకూలము. ఒకవృక్షమున కొక్కటే కొమ్మయుండి దానిఆకులు విస్తారము స్థలము నాక్రమింపవలెనన్న యెడల నాయాకులు మిక్కిలి పెద్దవిగ నుండవలయును. ఇది యసందర్భము. ఇట్టికొరతనుదీర్చి చెట్టును విరివిగ విస్తరింపజేయునిమిత్తమై ఉపశాఖలనిర్మాణమేర్పడినది. కాన శాఖయొక్క మొదటివ్యాపార మేదన:- ఆకులను భరించి ఆ యాకులు తమతమవ్యాపారముల జక్కజేయునిమిత్తమై వానిని విరివిగ వ్యాపింపజేయుటయే.

2. పుష్టికరములగు రసములను ఆకులనుండి వృక్షశరీరమున కంతటికిని, జీవనాధారములగు నీరు మొదలగువానిని వేళ్ళనుండి ఆకులకును ప్రసరింపజేయు వాహికలను భరించుట. ఈవిషయమై కొంతవరకు ఇంతకుముందే వ్రాయబడినది.

3. అంటులు (Grafts):- మల్లె, గులాబి మొదలగు మొక్కలయందువలె కొమ్మలు అంటులుగా నేర్పడి స్వజాతివృద్ధికి సహాయపడును.

4. కంతులు (Tubors):- బంగాళాదుంప (Potato) చూచుటకు గడ్డదినుసుగా నున్నను అదియును శాఖావిశేషమే. ఇది తక్కిన గడ్డదినుసులవలె వేళ్లనుండి పరిణమించునదిగాక, కొమ్మయొక్క కంతిగా పుట్టును (47-వ పటము చూడుము).

ఈ దుంపలను శ్రద్ధగా పరీక్షించిన అందు కండ్లవలె గుంటలుగ నుండు చిన్నచిన్న మచ్చ లుండును. ఈ దుంపలను పాతిపెట్టినప్పుడు ప్రతి మచ్చనుండియు నొక మొక్క పుట్టును. ఈమొక్కలు భూమినుండిబయలు వెడలి తమ యాహారమును తాము సంపాదిందుకొను వరకును దాని నీ దుంపయే ఇచ్చుచు స్వజాతివృద్ధికి సహాయపడును. పటములో జూచినయెడల దీనికంతులు ఆకుపైనుండు పంగలలో పుట్టుచున్నట్లు తెలియగలదు. కాన నీకంతులు శాఖలయొక్క రూపాంతరములనుటకు సందేహము లేదు.

5. గడ్డలు (Bulbs):- నీరుల్లిగడ్డయొక్క మధ్యభాగము కూడ కొమ్మయేకాని వేరు కాదు. దాని చుట్టునుండు దళమైనపొరలు దాని మొదటియాకులు. ఈ యాకులయందు ఆహార పదార్థము నిలువజేయబడియుండుట చేత నివి యుబ్బి యట్లు దళసరెక్కియుండును.

6. ముండ్లు (Thorns):- ఒక్కొకచో నీకొమ్మలు వృక్షమును శత్రువులనుండి సంరక్షించుటకు భటులుగ నేర్పడును. తుమ్మముళ్లు కొమ్మలయొక్క రూపభేదములే. ఇవియును ఆకు పంగనుండియే పుట్టుట కొంచెము పరీక్షించిన తెలియగలదు. వీని శాఖాంతములు పెరుగుట మాని మొనకూరియుండును. బ్రహ్మజెముడు చెట్టునందు అట్టలవలె నుండు ముండ్లుగల భాగములు (Cladodes) కొమ్మల రూపాంతరములే. దానియాకు లీ కొమ్మల క్రిందిభాగముగ చిన్న చిన్నవిగ నుండును. ఈ కొమ్మల నుండి పువ్వులును, కాయలును, పుట్టుచుండుట జూడవచ్చును. ఈకొమ్మ లిట్లే అనేకరూపభేదములు చెంది యనేకవిధముల వృక్షములకు సహాయ మొనర్చు చుండుట చదువరులకు విదితము కాగలదు.

7. నేలగొమ్మలు (Rhizomes):- భూమిలోపలనే ప్రాకునట్టి స్వభావముగల గరికె మొదలగువానిలో మనము సామాన్యముగా గరికెవేళ్లని చెప్పు తియ్యగనుండు కాడలవంటి భాగములను నేలగొమ్మలని చెప్పవలయును. ఇవి వేళ్లు కావు. ఈ కొమ్మల స్కంధశిరములనుండి సన్ననివేళ్లు అక్కడక్కడ గుంపులుగుంపులుగ వెడలుచుండుట జూడవచ్చును. ఈకనుపులనుండి పుట్టు నుపశాఖలు పైకి పెరిగి పచ్చగడ్డి యగును. 8. నులితీగెలు (Tendrils):- నిలువబడుటకు శక్తిలేని పొట్ల, కాకర మొదలగుతీగెలయందు పుట్టి, వాని వ్యాపకమునకు ఆధారభూతములుగ నుండు నులితీగెలుసహితము కొమ్మయొక్క రూపాంతరములే.

ఇవి తీగెను నేలబడిపోకుండ జేయుటకై తమకు దొరికిన వస్తువులనన్నిటిని ఆశ్రయించి వాని కా తీగెను చేర్చి కట్టును. వీని కొనలకు స్పర్శ జ్ఞానము గలదు.

ఇంతవరకు కొమ్మయొక్క ఆకారమును ఉపయోగమును గూర్చి చెప్పితిమి. దాని సూక్ష్మనిర్మాణమునుగూడ సంగ్రహముగ వివరింతుము.

శాఖయొక్క సూక్ష్మనిర్మాణము.

ప్రతి కొమ్మయొక్కయు చిట్టచివర శాఖాంతము లేక కొనమొగ్గ యను లేతయాకులచే కప్పబడియుండు మొగ్గవంటిభాగము వారిపర్ణి, నాచుమొక్కల యందువలెనే పెద్దవృక్షములయందు గూడ ఉండును. దీని నిర్మాణవిషయమై క్రింద వివరించెదము. ప్రస్తుతము దాని క్రిందిభాగముననుండు లేతకొమ్మనుండి కొన్ని సూక్ష్మములగు తునకలను ఖండించి వానిని సూక్ష్మదర్శనిలో పరీక్షించి కొమ్మయొక్క సూక్ష్మనిర్మాణమునుగూర్చి కొన్ని అంశముల తెలిసికొనవలయును.

ఏకబీజదళ వృక్షములకును ద్విబీజదళవృక్షములకును సూక్ష్మ నిర్మాణమునందు కొన్ని భేదములు గలవు. ఏకబీజదళ వృక్షములలో ఆకులమీద నుండు పిల్ల ఈనెలు ఒక దాని కొకటి సమాంతరములుగ (Parallel) ఉండును. ఉదా:- అరటాకు. ద్విబీజదళవృక్షములలో నవి వలయల్లికవలె నుండును. ఉదా:- ఆముదపాకు. ఈ వాహికాపుంజముల నిర్మాణమునందలి భేదములచేతనే కొమ్మ యందలి ముఖ్యభేదములును ఏర్పడుచున్నవి.

1. ద్విబీజదళశాఖ.

ప్రథమమున ద్విబీజదళవృక్షముయొక్క లేతకొమ్మనుండి సన్ననితునకల ఖండించి వానిని పరీక్షించిచూతము. 49-వ పటములో జూపబడిన శాఖయొక్క అడ్డపుచీరికల ఆకారమును శ్రద్ధగ గమనింపుము.

పై పటము చూచుతోడనే అందు కోడిగ్రుడ్లవలె నుండు వాహికాపుంజములు పటముయొక్క మధ్యభాగముచుట్టును తోరణమువలె నమర్పబడి స్ఫుటముగ తెలియుచుండును. వీనికి లోతట్టుననుండు భాగమునకు దవ్వ (Medulla) యని పేరు. వెలుపలనుండు భాగమునకు పట్ట (Cortex) యని పేరు. ఈ కోడిగ్రుడ్లవలెనుండు భాగములమధ్య నుండు సందులందు దవ్వ యందలికణములు వ్యాపించియుండును. ఈ సందులకు కిరణములు (Medullary rays) అని పేరు.

ఈపటమును ఇంకను శ్రద్ధగ పరీక్షించిన దాని నిర్మాణము చక్కగ తెలియగలదు. అందు వెలుపలివైపుననుండి వర్ణించు కొనిరాగా:-

1. మొదట కొంచెము బల్లపరుపుగనుండు కణములవరుస యొకటి గలదు. ఇవి ఇటికవలె నొక దానిప్రక్క నొకటి చేర్చబడి చెట్టునకు వెలుపలిగోడ యగును. దీనికి బహిశ్చర్మము (Epidermis) అని పేరు. ఈకణములలో కొన్నిటికి పొట్లతీగెలు మొదలగు వానియందు మనము చూచునట్టి నూగువంటిరోమములు (Hairs-రో) ఉండును.

2. పై పటములో బహిశ్చర్మకణములకు లోపలితట్టున పట్ట (Cortex) యను ఏడు లేక ఎనిమిది కణములవరుసలు గలవు. ఇందు బహుభుజములుగల కణములు పేర్చబడియుండును. ఇందు వెలుపలివైపున నుండు రెండు లేక మూడువరుసలకు దళమైన కణకవచములు గలవు. ఈ వెలుపలివరుసలనుండియే బెండు అనగా కార్కు (Cork) వంటిపదార్థమును, దానినుండి బెరడును ఏర్పడును.

3. ఈ పట్టయొక్క లోపలితట్టున నొక కణములవరుస గలదు. ఇందు పిండి (Starch) అణువులు పెక్కు లుండును. ఈ వరుసకు అంతశ్చర్మము (Endodermis) అని పేరు. 4. ఈ అంతశ్చర్మమునకు లోపలితట్టున అండాకారముగల వాహికాపుంజములు చుట్టును తోరణము గ్రుచ్చినట్లుగా నున్నవి. ఒక వాహికాపుంజములో మూడుభాగములు గలవు.

(1) వెలుపలిభాగమునకు త్వక్కు (Phloem or Bast) అనిపేరు. త్వక్కునందు త్వగ్వాహిక లుండును. ఈ వాహికలయం దక్కడక్కడ జల్లెడకండ్లవంటిరంధ్రములు గల అడ్డుపొర లుండుటచే దానికి జల్లెడకాలువలు (Sieve tubes) అనియు పేరు. ఈ వాహికల మధ్యనుండు సందులలో మృదుకణము లిమిడియున్నవి. ఒకానొకప్పుడు త్వగ్వాహికల వెలుపలితట్టున నారవలె జిగిగల పొడుగైన కణములవరుస లుండును. ఇందలికణముల మూలపదార్థము చాలవరకు హరించిపోయి యీకణములు నారపోగులవలె నుండును. ఈ కణములసంహతికి దృఢత్వక్కు (Hard bast) అని పేరు.

(2) లోపలిభాగమునకు దారువు (Wood or Xylum) అని పేరు. దీనియందు సామాన్యముగా మిక్కిలి పొడుగుగనుండు దృఢకణములు (Schlerenchyma) అధికముగ నుండుటచేత నిది ఎక్కువపీచుగ నుండు స్వభావముగలది. ఇందుండు కాలువలు అడ్డుగట్లు లేకుండ ధారాళముగ నుండును. వీనికి దారువాహికలు (Wood vessels) అని పేరు. వీని గోడలయొక్క లోపలితట్టున మిట్టపల్లము లుండి, వాని యానవాళ్లు కొన్నిటియందు కడియములవలెను (Annular) నిచ్చెనలవలెను (Scalariform) మరికొన్నిటియందు మరచుట్లువలెను (Spiral) కొన్నిటియందు గుంటలుగుంటలుగను (Pittrd) సూక్ష్మదర్శనిలో జూచునప్పుడు స్పష్టముగ తెలియుచుండును.

(3) దారువునకును త్వక్కునకును మధ్యనలుచదరపుకణములవరుస యొకటిగలదు. ఈకణములు నిరంతరము విభజనము నొంది వృద్ధిబొందు స్వభావముగల వగుటచేత నియ్యవి విభాజ్యకణములు (Meristem) అనబడును.

షరా:- ఈ విభాజ్యకణములవరుస వాహికాపుంజముల మధ్యనుండు కిరణములగుండకూడ నెడతెగక వ్యాపించుచు శాఖయొక్క మధ్యభాగము చుట్టు నొక కడియము వలె నుండును.

5. ఈ వాహికాపుంజముల తోరణమునకు లోపలితట్టున పలుచని కణకవచములుగల బహుభుజకణములు ఒక దానినొకటి జేర్చి పేర్పబడియుండును. ఈ భాగమునకు దవ్వయనిపేరు. ఇందలికణములు పొడుగునను వెడల్పునను సమానముగా నుండును. ఇవియే మృదుకణములు (Parenchyma). ఈ భాగమునందు దృఢకణములు బొత్తిగ నుండకపోవుటచేత నిందు పీచు ఉండదు.

ఇంతవరకు ద్విబీజదళవృక్షశాఖయొక్క సూక్ష్మనిర్మాణము చెప్పబడెను.

II. ఏకబీజదళశాఖ.

ఇక నేక బీజదళముయొక్క శాఖానిర్మాణమును పరీక్షించె దము. ఇందునిమిత్తమై యొక జొన్న మొక్క యొక్క లేత కొమ్మను సన్ననితునియలుగ ఖండించి వానిని8 సూక్ష్మదర్శనితో పరీక్షింపుము.

1. అందు పటములో జూపినప్రకారము వెలుపలితట్టున బహిశ్చర్మకణము (Epidermal cells) లొక వరుసగా నుండును.

2. దాని లోపలితట్టున పెక్కు వరుసల చదరపుకణముల పేర్పు లుండును. వీని కణకవచము కొంచెము దళసరిగ నుండును. ఇదియే పట్ట (Cortex).

3. వీని లోపలితట్టున అంతశ్చర్మకణముల (Endodermis) వరుస యొకటుండును. అయిన నీ వరుస ద్విబీజదళవృక్షములలోవలె చక్కగా తెలియదు.

4. ఈ అంతశ్చర్మముయొక్క లోపలితట్టును సామాన్యముగా నేకబీజదళ వృక్షములలో పొడుగైన దృడకణములచే నేర్పడిన మిక్కిలి బలమైన నవారుపట్టెవంటి పట్టె యొకటి కొమ్మచుట్టును బిగువుగ నుండు ఒడ్డాణము (Pericycle) వలె చుట్టియుండును. ఇందలికణములు దళసరెక్కి కాఠిన్యము నొందియుండును. కాన ఇందు పీచు అధికముగ నుండును. ఈయొడ్డాణముయొక్క యుపయోగము క్రింద వివరింపబడును.

5. ఏకబీజదళవృక్షమునందు వాహికాపుంజములు తోరణమువలె చుట్టునొకవరుసగా నమర్పబడియుండక పై జెప్పిన యొడ్డాణపు లోపలితట్టున కణములమధ్య చెల్లా చెదరుగా చిమ్మబడియుండును. గాన దీనియందు కిరణములు లేవు. వీనియందలి వాహికాపుంజములు పంగ నామములవలె (V shaped) లోపలివైపు సన్నముగను వెలుపలివైపు లావుగను ఉండును. ఇందును త్వక్కు (Phloem) దారువు (Wood) అని రెండుభాగములును గలవు. లోపలివైపున నుండు దారువునందు దృఢకణములును, దారువాహికలును ఉండును. వెలుపలివైపుననుండు త్వక్కునందు మృదుకణములును జల్లెడ రేకులుగల కాలువలు నుండును. దారువునకును త్వక్కునకును మధ్య విభాజ్యకణములు (Meristematic) లేవు.

కొబ్బెర మొదలగు ఏకబీజదళవృక్షములు సామాన్యముగ కొంత లావుగ పెరిగి అంతట నిలిచిపోవును. చింత, టేకు, మద్ది మొదలగు ద్విబీజదళవృక్షములు విరివిగ ఎదిగినకొలదిని లావునందును హెచ్చుచుండును. ఇట్టిభేదమునకు కారణము వాని నిర్మాణమును పరీక్షించిన బోధపడగలదు. ద్విబీజదళవృక్షములలో వాహికా పుంజములందలి దారువునకును, త్వక్కునకును మధ్య విభాజ్యకణములవరుస యొకటిగలదని చెప్పి యుంటిమి. ఈకణము లెల్లప్పు డును విభజన నొందుచుండుటచే వానినుండి క్రొత్తక్రొత్త పొరలేర్పడుచు నందు వెలుపలివైపుపొరలు క్రొత్తదారువుగను, లోపలివైపుపొరలు క్రొత్తత్వక్కుగను ఏర్పడి యవి చెట్టుయొక్క లావును క్రమముగ పెంచుచుండును. ఏకబీజదళ వృక్షములలో నట్టి పునర్వృద్ధి (Secondary growth) కి తగిననిర్మాణము లేదు. ఇంతేకాక చెట్టుయొక్క లావు అధికముకాకుండ బిగించికట్టినట్లుండెడు ఒడ్డాణము (Pericycle) యొక్క నిర్మాణముగూడ దాని లావును హెచ్చకుండునట్లు జేయుచుండును.

వాహికాపుంజముల వ్యాపకము.

వాహికాపుంజములు ఆకులనుండి కొమ్మలోనికి ప్రవేశించి, దానిగుండ నిలువున కొమ్మ పొడుగునను పోయి వేళ్లలోనికి చేరునని వ్రాసియుంటిమి. అట్టి వ్యాపకములో ఏకబీజదళవృక్షములకును, ద్విబీజదళవృక్షములకును భేదము కలదు.

ద్విబీజదళవృక్షములలో నీ వాహికాపుంజము లన్నియు కొమ్మయొక్క యుపరితలమునకు సమాంతరముగ బోవును. ప్రక్కపటములో వాని మార్గము నిలువున జూప బడెను. ఈకొమ్మయొక్క అడ్డపుచీలికలయందలి వాహికాపుంజములు సూక్ష్మదర్శనిలో జూచినప్పుడు చుట్టునొక తోరణమువలె క్రమమైనరీతిని యమర్పబడుట యీసమాంతరవ్యాపకము మూలముననే యని యెరుంగునది.

ఏక బీజదళవృక్షములో నీ వాహికాపుంజములు నిలువున కొమ్మలో నొక్కరీతిగ వ్యాపించవు. కొన్ని యుపరితలమునకు సమీపమునను కొన్ని దూరమునను చెల్లచెదరుగా నుండును. సామాన్యముగా ఏక బీజదళవృక్షముల ఆకులు వెడల్పయిన మొదలుగలవి. ఈఆకులనుండి వాహికాపుంజములు కొమ్మలో ప్రవేశించిన తోడనే తిన్నగా కొమ్మ పట్టనడిమికి బోవును. (52-వ పటములో చూడుము). తరువాత నవి క్రమముగా కొమ్మయొక్క యుపరితలమును సమీపించి ప్రాతఆకులనుండి వ్యాపించిన వాహికాపుంజములలోనికి పోయి చేరును.

అంత్యవిభాజ్యము.

నాచు మొక్కయొక్క కొనయందు అంత్యకణ మొకటిగలదనియు, దానివిభాగమువలన కొన్నిఖండము లేర్పడుచు, ఆఖండమునుండి స్కంధశిర, స్కంధకణము లేర్పడి వానినుండి కొమ్మలు, ఆకులు, వేళ్లు ఇవియన్నియు నేర్పడు చున్నవనియు చెప్పియుంటిమి. హెచ్చుజాతివృక్షములలోగూడ శాఖాంతమున కొనమొగ్గ గలదు. అనగా నదియును చిగురాకులచే గప్పబడి మొగ్గవలె నుండును. ఈచిగురాకుల నన్నిటిని సాధ్యమైనంతవరకు ద్రుంచి, వానిలోపల నున్న లింగాకారమగు భాగమును నిలువున మిక్కిలి పలుచనవగు తునకలుగాచీలి, యాచీలిక నొక దాని సూక్ష్మదర్శనిలో పరీక్షించిన,

ప్రక్క పటములోజూపిన యాకారము గన్పట్టును. హెచ్చుజాతి వృక్షములందు నాచుమొక్కయందువలె అంత్య కణము లేదు. దీనికి బదులుగా కొన్ని లేతకణముల సముదాయము గలదు. (53-వ పటము చూడుము). ఈకణములరాశికి అంత్యవిభాజ్య మని పేరు. విభాజ్యమనగా విభజింపబడునది. ఈవిభాజ్యమునందలి కణములు నిరంతరము ద్విఖండన విధానముచే చీలుచుండును. ఇట్లు చీలుటవలన నేర్పడినకణములు పైపటములో జూపినప్రకారము ప్రథమమున అన్నియు నొక్కరీతిని నలుచదరముగ నుండును. ఇవియన్నియు నొక్కరీతినే మూలపదార్థముతో పూరింపబడి మిక్కిలిపలుచని కణకవచములుగలిగి యుండును. అనగా నీభాగమునందలి కణములన్నియు నెల్లప్పుడు మృదుకణములే యనుట. ఏయేభాగములందు వృక్షము పెరుగుచుండునో ఆయాభాగములందు విభాజ్యకణము లుండును. వాహి కాపుంజములందలి దారుత్వక్కులమధ్య విభాజ్యముగలదని యిదివరలో చదివియున్నాము. కొన్నిచో పట్టయందు వెలుపలనుండు బెండు (Cork) పొరలోగూడ విభాజ్యకణము లుండును. వీనిలో అంత్యవిభాజ్యము చెట్టుయొక్క వృద్ధికి ముఖ్యమైనదిగా నున్నది. తక్కినరెండును చెట్టుయొక్క లావును హెచ్చించును. కొద్దికాలములోనే పై జెప్పిన అంత్యవిభాజ్యముయొక్క విభాగమువలన నైన కణములు మూడుసంహతులుగా నేర్పడును.

(1) అందు వెలుపలిది 54-వ పటములో (బ.) అనుచో జూపినప్రకార మొక్కకణము దళసరిని అమర్చబడిన చుట్టునుండు కణపం క్తి. దీనికి బాహ్యలింగము (Dermetogen) అనిపేరు. ఈ పం క్తి యందలి కణములు అడ్డముగ నేగాని నిలువున చీలవు. అనగా ఎల్లప్పుడును ఒక కణముదళసరినే యుండును. ఈకణ పం క్తియే బహిశ్చర్మ మగును.

(2) బాహ్య లింగమునకు లోపలితట్టున పరిలింగము (Pereblem) అను భాగము గలదు (54-వ పటములో ప). ఇది శిఖర సమీపమున ఒక కణము వరుసనే యుండును. కాని యాకణములు వివిధములుగ వరుసక్రమము లేక విభజింపబడుటచే క్రిందిభాగములయందు అనేక వరుసలుగ నేర్పడియుండును. ఈభాగము నుండి పట్టయందలి కణములన్నియు నేర్పడుచున్నవి. ఆకణములవరుస లన్నిటిలో లోపలివరుసయే అంతశ్చర్మ మగును.

(3) పరిలింగమునకు లోపలితట్టున నున్న భాగమునకు అంతర్లింగము (Plerome) అని పేరు (54-వ పటములో అం). ఇది విభాజ్యకణముల నట్టనడిమిభాగము. ఇది లింగాకారముగ నుండును. దీనినుండి వాహికాపుంజములు, దవ్వ, కిరణములు-ఇవియన్నియు నేర్పడుచున్నవి. మన మిప్పుడు చదువుచున్న పూవులను భరించు వృక్షముల కొమ్మలో నిట్టి అంతర్లింగ మొక్కటియే యుండును. ఫెరనులు (Ferns) అను పూవులు లేని వృక్షములలో నొక్కొక కొమ్మకు అనేక అంతర్లింగము లుండును.

శాఖలయుత్పత్తి.

శాఖలు మొట్ట మొదట పరిలింగ బహిర్లింగములయొక్క చిన్న చిన్న మొటిమలుగా పుట్టును. మొట్ట మొదట ఈ మొటిమలో అంతర్లింగము చేరియుండదు. క్రొత్తమొటిమయొక్క పరిలింగమునుండి కణములు చీలి దానినుండియొక అంతర్లింగ మేర్పడును. తరువాత నీ యంతర్లింగము తల్లికొమ్మయొక్క యంతర్లింగముతో కలిసిపోవును.

గాయములు.

చెట్టుయొక్క కొమ్మ కెక్కడనైనను హానికలిగి గాయము పడినప్పుడు ఆ గాయములో నన్నిటికంటె వెలుపలనున్న జీవించి యున్నకణములలో కొన్ని విభాజ్యకణములుగా పరిణమించి యవి చీలి బెండు (Cork-కార్కు) కణముల సంహతి యేర్పడును. ఈ బెండుకణములు గాయమునకు సంరక్షణపుపొరగా నేర్పడి లోపలనుండి వెలుపలికిగాని వెలుపలనుండి లోపలికిగాని నీరు గాలి మొదలగునవి వ్యాపించకుండ జేయును. ఇట్లు గాయముల మాన్పుకొనుశక్తి రెండుజాతులవృక్షములకును గలదు.