జీవశాస్త్ర సంగ్రహము/ఏడవ ప్రకరణము

ఏడవ ప్రకరణము

బూజు, కుక్కగొడుగు (Penicillium and Agaricus}

లైపిండి, తోళ్లు, లేతకొబ్బరిముక్కలు మొదలుగాగల జీవజ పదార్థముల నిలువయుంచినప్పుడు వానిపై నొకవిధమైన తెల్లని బూజు కట్టుట మనమందర మెరిగినదియే. ఇది వృక్షజాతులలో నొకటి. ఇదియును, మన మీవరకు జదివిన మధుశిలీంధ్రమును, కుక్కగొడుగులు మొదలగునవియు శిలీంధ్రములను (Fungi) నొకజాతిలోనివి. ఈ బూజు నొకవ్రేలుతో గీచి ఎత్తినయెడల మిక్కిలి మృదువైన కొంచె మాకుపచ్చని వర్ణముగల ధూళి యావ్రేలి నంటియుండును. ఈధూళియే బూజుమొక్కయొక్క బీజమని ముందు తెలిసికొనగలము. ఒక చీపురుపుల్లతో బూజు పట్టిన పదార్థముమీదనుండి కొంచెము బూజు నెత్తి పాస్ట్యూరు రసములో చల్లుము. తరువాత నా నీటిని చక్కగ కలుపుము. మనము విస్తారము బూజును తీసికొనక కొంచెముగా నుపయోగించినయెడల నది నీళ్లలో లీనమై వట్టికంటి కెంతమాత్రమును కానరాదు. దానిని కొద్దిరోజులు నిలువజేయు నెడల నా నీటి యుపరితలమున తెల్లని చుక్కలు కనిపించును. ఇవి క్రమముగా పెద్దవై భూత అద్దపుబిళ్లతో (Hand lens) పరీక్షించు నెడల స్పష్టముగా తెలియుచుండును. ఈచుక్కలు వలయాకారము గలవై మధ్య మిట్టగను చుట్టును క్రమముగా పలుచగను ఉండి నీటిమీద తేలుచుండును (12-వ పటములో A-చూడుము). ఇట్లు తేలుటచే వాని పైతట్లుపొడిగా నుండును. ఈ గుంపులలో నొక్కొక టొక బూజుతుట్టె. ఈ తుట్టెలు క్రమముగా పెరుగుచు వైశాల్యమున హెచ్చుచుండును. ఇట్లు పెరుగుచుండునప్పుడు ఈ తుట్టె చుట్టును ఏటవాలుగను, మధ్య మిట్టగను పెరుగును. పిమ్మట దీని మధ్యభాగము క్రమముగ బొంతు రేగినట్లుండి తుట్టె 10 నూళ్ల (నూలు అనగా అంగుళములో 12-వ వంతు) వెడల్పు గలదగునప్పటికి, చుట్టునుండు తెల్లనిభాగముకంటె మధ్యభాగము కొంచెము నీలవర్ణము గలదగును. 20 నూళ్ల వ్యాసమువరకు తుట్టె పెరుగునప్పటికి దాని మధ్యభాగము ఆకుపచ్చ నగును. ఇట్లు తుట్టెమధ్యను ఆకుపచ్చని చుక్కయు, చుట్టును నీలమైన పట్టెవంటిభాగమును, దాని వెలుపలితట్టున తెల్లని అంచును, మూడువరుసలుగ లోపలి నుండి వెలుపలికి ఆకుపచ్చన, నీలము, తెలుపు ఈ రంగులు వరుసగా కనిపించుచుండును. కొంతకాలమున కీ తుట్టె లన్నియు నొక దానితో నొకటి యలుముకొని యేకపొరగా నేర్పడును గాని చిన్న తుట్టెల సరిహద్దులు గుండ్రని తెల్లనిరేఖలవలె తెలియుచుండును.

A. రెండు బూజుతుట్టెలు. ఊ. తం - ఊర్ధ్వతంతువులు. అ. తం - అధ స్తంతువులు. అల్లిక - పోగులయొక్క అల్లిక కంబళి నేతవలె నున్నది చూడనగును.

B1 ఒక తుట్టెయందలి చిన్న ముక్కను సూదులతో చీల్చిసూక్ష్మదర్శనితో పరీక్షింపగా కనబడురూపము. పోగులన్ని యు బీజములనుండి పుట్టుచున్నవి. ఈ పోగులకు శాఖలు తరుచుగ గలుగుచుండును. B2. ఇం దొకపోగు మిక్కిలి పొడుగుగ చూపబడియున్నది. మ. పొ-పోగునందు మధ్యమధ్య నుండు అడ్డుపొరలలో నొకటి. అ-అవకాశము.

C. మొదలు C5. వరకు నుండు పటములు బీజోత్పత్తియందలి వివిధావస్థల సూచించును. C-మధుశిలీంధ్రకణముల బోలియుండు బీజములు. ఇందు కొన్ని పొడుగుగ సాగి పోగు లగుచున్నవి.

C1. పోగులయొక్క చివరభాగమున నుండు పలవలు పొట్టివిగ నున్నవి.

C2. ఇం దొక పలవయొక్క చివర నురివోసి తెంపబడినట్లుగా నుండెడి బీజమొకటి గలదు.

C3. C4. బీజములు క్రమముగా నధికమై యొకదానిక్రింద మరియొకటి చేరుచున్నవి. అం దన్నిటికంటె పైనున్న బీజము పెద్దది. ఇది ముదురుది. దాని క్రిందనున్న బీజములు క్రమముగా నొక దానికంటె మరియొకటి చిన్నది.

C5. ఇందు బీజములు ముదిరి రాలిపోవుచున్నవి. ఇవి యన్నియు బూజుపోగుల పై గప్పి వాని రూపము స్పష్టముగ కనబడకుండ జేయుచున్నవి.

ఇట్లు క్రమక్రమముగ తెలుపు నీలముగను, నీలము ఆకుపచ్చగను, మారి, తుదకు తుట్టె యావత్తును సరిసమానమైన ఆకుపచ్చరంగు గలదగును. ఇదియే బూజు.

సూక్ష్మనిర్మాణము.

పై జెప్పబడిన బూజుతుట్టెలు మిక్కిలి చిన్నవై నాలుగైదునూళ్ల వ్యాసము కలవిగా నుండునప్పుడే నలిగి పోకుండ సూదితో నెత్తి సూక్ష్మదర్శనిలో పరీక్షించవచ్చును. దీనిని తగ్గు దృక్ఛక్తి (Low Power) తో చూడ, ఈ తుట్టెయందు కంబళి నేతవలె నుండు అల్లిక యగపడును (A). దాని యుపరితలముననుండి మృదువైన నూలుదారములవంటి పోగులు పైతట్టున గాలిలోనికిని, క్రిందిభాగమున ఆరీతిగనే యుండు కొంచెము పొట్టిపోగులు నీటిలోనికిని వ్యాపించియుండును. వీనికి క్రమముగ ఊర్ధ్వతంతువులనియు (Aerial hyphae). అధస్తంతువులనియు (Submerged hyphae) పేరు.

బూజుపోగు అనేకకణములపంక్తి.

ఈతుట్టె తెల్లగాగాని, నీలముగాగాని యున్నంతవరకు దాని యుపరితలమున వ్రేలుతో గీచినయెడల ధూళి యేమియు చేతి నంటుకొనదు. ఇందుచే బీజములు పూర్ణముగా తయారు కాలేదని తెలిసికొనవలెను. స్థిరమైన ఆకుపచ్చరంగు కలుగగానే తాకినతోడనే ధూళియంతయు చేతి నంటుకొనును. కంబళి నేతవలె నుండు బూజు తుట్టెను కొంచె మెత్తి రెండు సూదులతో పోగులను విడదీసి సూక్ష్మదర్శనితో పరీక్షించిన, సున్నితమైన దారములు చిక్కగా నలుముకొనినట్లు తెలియగలదు (B1). ఇవియే బూజు పోగులు. ఈ దారములు పొడుగునను సమమైన వర్తులాకారము గలవై నూలులో ఇన్నూటవవంతు అడ్డకొలతగలవై యున్నవి. ఈ పోగులు సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు స్వచ్ఛమై చుట్టు కవచము గలవై వెదురుగొట్టములవలె నుండును. మధ్యమధ్య శాఖలు తరుచుగనుండును. ఈ గొట్టమును అనేక అరలుగా విభజించు అడ్డగోడలవలె నుండు పొరలు వెదురుగొట్టపు కనుపులవలె నీ పోగునందును అంతటంతట గలవు. ఇట్టి అడ్డుపొరలచే విభజింప బడిన అరలన్నియు ఏకరీతిని నిర్మింపబడినవై యొకదాని నొకటి సర్వవిషయముల బోలియుండును. కొనలయందుండు అరలు మాత్రము క్రమముగా సన్నగించి ఆదోకగా నుండును (B1. B2. చూడుము). ఈ అరలోని పదార్థమునం దక్కడక్కడ అణువులు చిమ్మబడియుండును. వీనిని నీలిమొదలగు రంగులలో కొంతకాలముంచి పరీక్షించుటచే దానియందలిపదార్థము మూలపదార్థమని తెలియగలదు.చుట్టునుండు గోడ సెల్లులూసుతో జేయబడినది. మూలపదార్థము మధ్య అంతటంతట అవకాశములును గలవు. తొగరుచెక్క (Logwood) రంగులలో కొంతకాలముంచి పరీక్షించినయెడల దానియందు పెక్కు జీవస్థానములు గలవని తెలియగలదు. ఈ పోగునందలి ఒక్కొక్క అరయును మధుశిలీంధ్ర కణమును బోలియుండును. దానివలె నిదియును మూలపదార్థముతో జేయబడి, జీవస్థానమును, అవకాశమును గలిగి సెల్లులూసు కణకవచముగలదై యున్నది. ఈ రెంటికిగల తారతమ్య మీక్రిందిపోలికవలన చక్కగ తెలియగలదు. ఒక గుండ్రనైన మెత్తనిముద్దను మధుశిలీంధ్రకణముగా నూహింపుము. దీనిని రెండువైపులను పట్టుకొని సాగదీసి పొడుగును వర్తులమునైన కణిక ఆకారముగా చేయుము. ఇది బూజుపోగును బోలును. పిమ్మట నీ కణికయం దొకచోట నొకమొటిమవలె కొంతమట్టిని జేర్చి యా మొటిమను ప్రక్కకు సాగదీసిన నది శాఖగా నేర్పడును. ఇట్లు సాగదీయగా నయినపోగు ఒక్కటే గొట్టముగా నుండక దానియందు కొంతకొంత పొడుగున కొక్కొక అడ్డగోడ ఏర్పడుచుండునని యూహించిన నీ పోగులోని యరలన్నియు నెట్లు ఒకదాని నొకటి బోలియున్నవో తెలిసికొనవచ్చును. బూజు పోగునందు ఈ అరలన్నియు నొక్కవరుసగా నుండుటచేత నొక్కటే గది వరుసను కట్టిన దుకాణపుకొట్లవలె నుండునని యూహించవచ్చును. ఈగదుల నొక్కొకదాని నొక్కొక కణమునకు పోల్చవచ్చును.

ఈవరకు జదివిన ప్రాణులన్నియు నొక్కొక టొక్కొకకణమే. అనగా వానిమూలపదార్థ మెడతెగక యుండును గాని, అడ్డగోడలచే గదులుగా విడదీయబడియుండదు. కాన వానికి ఏకకణ ప్రాణు లని పేరు.

కణ మనగా మూలపదార్థపు సముదాయము. కణమునకు కవచ మావశ్యకము గాదు. వికారిణివంటి జంతుజాతి ప్రాణియందు కణకవచ ముండదు. వృక్షజాతి జీవులయందు సెల్లులూసుతో జేయబడిన కణకవచము తప్పక యుండును. కణమునకు జీవస్థాన మావశ్యకము. అది లేనిచో కణము జీవింపనేరదు. ఈ విషయము లింతకుపూర్వమే వివరింపబడినను జ్ఞాపకార్థమై యిక్కడ మరల ప్రస్తావింపబడినవి.

బూజుపో గిదివరకు జదివినవానివలె ఏకకణప్రాణి గాక అనేక కణములకూర్పుచే నేర్పడినది. మధుశిలీంధ్రకణములను కొంచెము పొడుగుగా సాగదీసి ఒక దారమున వరుసగా నొక దానిప్రక్క నొకటి జేర్చి దండగా గ్రుచ్చినయెడల బూజుపోగురూప మేర్పడును. కాబట్టి యీబూజుపోగును కణపంక్తియని చెప్పవచ్చును.

బూజుపోగుయొక్క శాఖలు: కొనదిమ్మలు.

తెల్లని బూజునుండి ఉత్పత్తియగు అనగా లేతవియగు ఊర్ధ్వతంతువులకు శాఖ లనేకము లుండవుగాని కొంచెము ముదిరిన నీలవర్ణముగల భాగమునుండి C1. C2. C3. C4. C5. పటములలో చూపిన ప్రకారము చిత్రమైన ఆకారముగల యనేకములైన కొమ్మలు బయలుదేరును. ఇందు ఒక్కొక్క కొమ్మనుండి కొన్ని పలవలు పుట్టి ఆపలవలలో నొక్కొకదాని కనేక పలవలు గలిగి యీ పలవలసమూహమంతయు నొక రమ్యమైన కుచ్చును బోలియుండును. అందు చివరపలవలు పొట్టివిగ నుండి యొక దానిసరసను మరియొక్కటి చేరియుండును. ఈ పలవల చిట్టచివర కొనదిమ్మ లను పేరుగల పొట్టికణము లుండును.

కొంతకాలమైన తరువాత నీ కొనదిమ్మచివర దృడమైన దారముతో నురిపోసి క్రమముగా బిగించి తెంపినట్లు ఒక చిన్నముక్క త్రుంచబడును (C2. చూడుము). ఇది మధుశిలీంధ్రకణము యొక్క మొటిమ తెగినట్లే తెగునని చెప్పవచ్చును.

బూజు పై గప్పియుండు ధూళియే దానిబీజములు.

ఇదియే బూజునకు బీజము. ఈబీజము తెగినతోడనే, తిరిగి దీని క్రిందిభాగమున మరియొకబీజము కొనదిమ్మనుండి పై జెప్పబడిన ప్రకారము ఖండింపబడి మొదటిబీజముక్రింద జేరును. ఇట్లనేక బీజములు తెగి యొక దానిక్రింద నొకటి గొలుసువలె జేరి పొర యొకటి మూలపదార్థమునందు పోగున కడ్డముగా నేర్పడి దానిని రెండుభాగములుగా విభజించును (B1. చూడుము). ఇట్లు ఏకకణప్రాణి ద్వికణప్రాణి యగును. తరువాత నీ రెంటిలో చివరనుండుకణము పెరిగి యందుండి మొదట తెగిన కణమంత కణము తిరిగి ఖండింపబడును. ఈ కణము లీ ప్రకారము హెచ్చి కొంచె మించుమించుగా సమానమైన పెక్కు కణముల పంక్తి యగును. ఊర్ధ్వతంతువుల యొక్కయు, అధస్తంతువుల యొక్కయు చివరనుండుకణములు తక్కిన కణములకంటె భేదముగనున్నవి. ఈ కణములకు కొనయందుండు కణకవచము ఆదోకగనుండి తక్కినచోట్లకంటె మృదువును పలుచనిదియు నై యుండును.

అంత్యకణము.

ఇట్లు బూజుపోగుయొక్క కొన నుండు కణమునకు అంత్యకణము (Apical Cell) అని పేరు. ఈ కణముయొక్క మూలపదార్థమునందు ఆహారమునుండి జమయగుపదార్థము, ఖర్చగు మూలపదార్థముకంటె హెచ్చుగ నుండును. కాన నీకణము పెరుగవలసియున్నది. అంతట నిది యన్నిప్రక్కలకు పెరుగ ప్రయత్నింపవలెను గదా? ఈ కణముయొక్క ఆవరణపుపొర యన్నివైపులను సమానమైన దళముగలదిగా నున్నయెడల నది యన్నివైపులను సమముగా పెరుగును. కాని దీని కణకవచ మట్లుండక చివరవైపున పలుచనిదిగాను, బలహీన మైనదిగాను, ఉన్నందున, మూలపదార్థముయొక్క యొత్తుడువలన నచ్చోట నది ముందునకు పొడుచుకొని వచ్చియుండును. కాబట్టి యీ కణము నలుదిక్కులకు పెరుగక పొడుగునందు మాత్రము హెచ్చును. బలహీనస్థానము కొనయందుండుటచేత పెంపంతయు నక్కడనే గలుగును. ఇంతకుపూర్వ మేర్పడిన ముదురుకణముల కిక పెంపులేదు. వీనియమదు పెచ్చు అగుచుండు మూలపదార్థము పలుచని అడ్డుపొరలగుండ అంత్యకణములోనికి పోవును. అన్నిటికంటె ముదురుకణము బీజసమీపమున అనగా మొట్టమొదట నుండునది. అన్నిటిలో లేతకణ మంత్యకణము.

బూజుయొక్క ఆహారము.

బూజుపోగు ఎట్టి ఆహారము తినును? ఇది బొత్తిగా సత్తువ లేనట్టియు, ఇతరజీవుల కాహారము గాన నర్హమైనట్టియు పదార్థములు దొరికినను తృప్తిబొందును. ఇది మానవుల చెవిలో సహితము పెరుగగలదు. మురికిబట్టలకును చెప్పులకును అసహ్య పడదు. బుడ్డిలో నిగిరిపోయిన సిరామీదసహితము జీవింపగలదు. ఈషన్మాత్రము జీవజపదార్థముండిన చక్కెరనీళ్లుగాని, ఉప్పునీరుగాని దొరికిన దీనికి చాలును. రాగిచిలుము, పాషాణము మొదలయిన విషములు సహితము దాని కపాయకరములు గా నేరవు.

ఎట్టి ఆహారముతోనైనను తృప్తి పొందునట్టి గుణముగల దగుటచేత నీ ప్రాణి సర్వకాలములయందును, అన్ని చోట్లను వృద్ధిబొందును. మిక్కిలి చిన్నవి యగుటచేత గాలిలో నెల్లప్పుడు నీబీజములు కొట్టుకొని పోవుచుండును. అదిగాక దీని బీజమెంత కష్టకాలమునందయినను చావదు. ఎంత శీత ప్రదేశముల యందైనను, ఎంత ఉష్ణప్రదేశముల యందైనను జీవింపగలదు. 1°C భాగము మొదలు 43°C భాగములవరకు వృద్ధిబొందును. .కళపెళలాడెడు 100°C నీళ్లచే నైనను చావదు. రెండువత్సరములు నిలువయుంచినను తిరిగి మొలచును. మనము మిక్కిలి శ్రమపడి జాగ్రత్తగా నిలువయుంచిన వస్తువులకుగూడ సామాన్యముగా బూజు పట్టుచుండుటకు కారణము లిప్పుడు బోధపడగలవు.

కుక్క గొడుగులు.

మనము చదివిన బూజు తుట్టెలు రూప నిర్ణయములేక ఏపాత్రమునందు మొలిపించిన నాపాత్రముయొక్క ఆకారమునే చెందును. కాని కొన్నిజాతుల బూజులు ప్రత్యేక ఆకారముగలవి గానున్నవి. ఆయావిత్తనముల జల్లినయెడల ఆయారూపములే పుట్టును. ప్రక్క 13-వ పటమునందు జూపబడిన కుక్కగొడుగు మొదలగు కొన్ని ప్రాణులు ఈ జాతిలోనివియే. ఒక కుక్కగొడుగునుండి ఒక చిన్న తునకను సూదులతో చీల్చి పరీక్షించినచో బూజుపోగులవలె నుండు పోగుల యల్లిక స్పష్టపడగలదు. ఇట్టినిర్మాణములన్నియు బూజు పోగులవంటికణముల పంక్తులచేనేర్పడిన యల్లికలుగా గ్రహింపనగు. పటములోని పెద్దగొడుగుయొక్క అధస్తంతువుల యల్లిక జూడుము.

శోభి; తామర.

కొందరి శరీరములమీద వ్యాపించియుండు శోభి, తామర మొదలగు చర్మ వ్యాధులు బూజుపోగుల బోలియుండు యొకానొక విధమైన శిలీంధ్రములచే నేర్పడియున్నవి. క్రిందిపటము చూడుము.

ఇందు 1. శోభిని కలుగజేయు బూజుపోగుల అల్లికలు.. అందు గుండ్రముగనుండు బీజములు అక్కడక్కడ చిమ్మబడియున్నవి చూడుము.

2. తామరపోగుల అల్లికలు. అందు నొక్కొకపోగుమీద పేప చెత్తపు కట్లవలె అక్కడక్కడనుండు అడ్డుగీట్లు చూడుము. ఈ గీట్లు పోగులయందలి వేర్వేరుకణముల నిరూపించు సరిహద్దుగోడలు. ప్రతిపోగును అనేక కణముల కూర్పుచే నేర్పడిన సరముగా గ్రహింపనగు.

3. ఇందు తామరబీజములు తలవెంట్రుక లోపలను వెలపలను గూడ ఆక్రమించి యున్నవి.

4. తామరయొక్క పోగులును బీజములును తలవెంట్రుకలోపల నిమిడి యున్నవి.

ఈ తామరనుగూర్చి వివరముగ తెలిసికొన గోరువారు మాచే వ్రాయబడిన చర్మవ్యాధుల గూర్చిన వ్యాసముల జదువనగును.