జాతీయపతాక వందనం

                                                                                      జాతీయ పతాక వందనం 

                     
శ్రీ మన్మహీ మండమలంబందు వెల్గొందు శ్రీ హిందూదేశంబు దాస్యంబు నన్ మ్రగ్గుచో సర్వ జాతీయ వీర ప్రజా సంతతిన్ కూర్మి సంధింపగా నైకమత్యంబు సత్యంబు శాంతంబు త్యాగం బహింసన్ ప్రబోధింపగా భూరి స్వాతంత్ర్యమున్ బేర్మి సాధింపగా నీవె యాదార భూతంబవైనావుగా, సత్పతాకంబా! నీ శాంతి సత్యాదులాదర్శమై యొప్ప నీ ఛాయనే గా చరిత్రన్ మహా కీర్తి స్వర్ణాక్షరాళిన్ వెలుం గొందు దీరా గ్రగణ్యుల్ మహా దేశ భక్తుల్ మహా త్యాగమూర్తుల్ మహా శాంతి యోధుల్ ఘనుల్ పూజ్య నౌరోజీ -వెడ్డర్ -బరన్ -హ్యూము -గోఖ్లే -తిలక్ -చిత్తరంజన్ -బెనర్జీ -తయాబ్ది ముఖుల్ -పూజ్య బాపూజీ -నేతాజీ -లాలాజీ-మాలవ్య -వాచా -పటేల్ -మోతీలాల్ -షౌకతాలి -భగత్ సింగ్ -బీసెంట్ -గోపాలకృష్ణయ్య -శ్రీ రాములున్ - పూజ్య నెహ్రూజీ -రాజాజీ -రాజేంద్ర పట్టాభి -దేభర్ -వినోబా -ఆజాద్ -పంతు -రాధాకృష్ణన్-స్వామి -కల్లూరి -యల్లూరి -గోపాల -సంజీవ -రంగా -ప్రకాశం -కళా ముఖ్యులున్ వీరు లింకెందరో దీరు లజ్ఞాత యోధుల్ కుల స్త్రీలు కస్తూరిబా -లక్ష్మి -మణ్బెన్ పటేల్ దుర్గాభా ముఖ్యు లౌ వీర హిందూ పురంద్రీ మణుల్ విశ్వదాతల్, కవుల్, గాయకుల్,డాక్టరుల్,లాయరుల్ ,పాత్రికేయుల్ ,మహా దేశ భక్తుల్ సదా ధర్మ యుద్ధంబునన్, శాంతి మార్గంబునన్ మాతృబంధంబులన్ ద్రెంచి ధీ ప్రాణ విత్తంబు లర్పించుచున్ మించి యాంగ్లేయులన్ గెల్వ యత్నంబునన్ జేయు సత్యాగ్రహంబాది సర్వాయుదాళిన్ మహా వ్యూహముల్ గూర్చి దీవించి గెల్పించి యున్నావు స్వాతంత్ర్యమున్ దెచ్చి సత్కీర్తి జే కూర్చి యున్నావుగా నేడు నీ జాతికిన్ కూటికిన్ గుడ్డకున్ కొంపకున్ లోటు లేకుండ సర్వార్ధ సంవృద్ది సేయంగ యత్నంబులన్ జేయు చున్నావు మాతల్లి!యాశక్తి యా యుక్తి నీ సత్క్రుపాదత్తముల్గావే ? సద్ధర్మ సంకేతమౌ కేతనంబా !మదంబా !మహాశక్తి సంధాయినీ!శాశ్వ తైశ్వర్య సంధాయినీ !శాంతి సౌభాగ్య సంపత్ప్ర ధాత్రి !మహానంద ధాత్రీ !లసద్విశ్వ సామ్రాజ్య స్వాతంత్ర్య సౌభాగ్యధాత్రి ! భవత్కీర్తి ఈ దేశ దేశంబు లన్ సర్వ ఖండంబులందెల్ల వెల్గొందే సర్వ ప్రపంచ ప్రజానీక మీనాడు నీ యందు రాజిల్లు నీ ధర్మ చక్రంబుదే శాంతి సౌఖ్యంబు లాసింప నీవే సదా దిక్కటంచున్ మనిష్యాలి కీర్తింప రాజిల్లు చున్నావు ;మువ్వన్నె జెండా! యహింసాత్మకంబై !త్రివర్ణాత్మకంబై !త్రి వర్గ ప్రదంబై !నీ శ్యామ వర్ణంబుచే వ్యాపకత్వంబు నా రాజసంబైన ఐశ్వర్యమున్ పోషకత్వంబు సూచింప నీ శ్వేతవర్ణంబుచే సాత్వికంబైన సత్యంబు సత్కీర్తి సృష్టి స్వభా వంబు రూపింప నీ తామ్రవర్ణంబుచే సృష్టి నైక్యంబు నా త్యాగ భావంబు శీలంబు సేవా పరత్వంబు బోధింప నీ యందు రాజిల్లు సద్ధర్మ చక్రంబు చే ధర్మ సంస్తాపకత్వంబు గావింపగా ఈశ్వర బ్రహ్మ విష్ణు స్వభావం బు లన్ బోల్చి ముమ్మూర్తులన్ వెల్గుచున్నావు తత్వత్రయీభావ మింపొందు నీ రూపు ధ్యానింప దర్శింప నీ కీర్తి వర్ణింప నీయర్ధ మాలింప ప్రాచీన హిందూ మహా సంస్కృతుల్ వైభవంబుల్ స్ఫురింపన్ మహోత్సాహ మేపారగా నైహికాముష్మికంబైన యానందమింపొందగా డెంద ముప్పొంగదే సర్వ శాస్త్రంబులన్ గల్గు ధర్మంబులన్ సర్వ ధర్మంబులన్ గల్గు మర్మంబులన్ పేర్మి నీయందు రూపింపవే రాజకీయంబు నాధ్యాత్మతత్త్వం బు నీకంబు గావించి నీ యందు మూర్తీభవింపన్ విరాజిల్లుదో తల్లీ ! సద్భక్త మందారవల్లీ! సదా నమ్ర రాజేంద్ర మౌళి !విరాజ త్కిరీటాగ్ర సద్రత్నరింఛోళి నీరాజితాంఘ్రిద్వయే ! అద్వయే లోక సంభావితే ! నిర్మలే ! కోమలే ! శ్యామలశ్వేత కాషాయ సౌభాగ్య రూపాభిసంయుక్త సౌందర్యసోభే ! శుభే ! శంకర బ్రహ్మ విష్ణు స్వరూపే !త్రయీమూర్తీ భవే!సదా భవ్యభూపాల సౌధాగ్ర విభ్రాజితే !యోగిభి: పూజితే !విశ్వ విశ్వంభరా వ్యాప్త శశ్యద్యసోవాసితే ! భారతీయైక హృత్పద్మ సంవాసితే !భాసితే !అచ్యుతారాధితే ! సర్వభద్రాత్మికే! సర్వశక్తాత్మికే ! పాహి సత్యస్వరూపే ! పతాకే  ! నమస్తే ! త్రయీమూర్తిరూపే !పతాకే నమస్తే ! అహింసా స్వరూపే ! పతాకే నమస్తే ! సదా విశ్వ శాంతిప్రియే ! సత్పతాకే ! నమస్తే !నమః ! త్యాగ రూపే !పతాకే నమస్తే !నమః ! పవిత్ర త్రివర్నాంచితే ! సత్పతాకే ! నమస్తే !నమస్తే ! నమస్తే ! నమః !!
        
సీ !! స్వాతంత్ర్య సమరోర్వి సత్యా గ్రహంబులు శాసన్నోల్లంఘనల్ జరిపి ఆరినాము
                  అమల జాతీయ గీతాలాపనంబుల బేర్చి యుత్సాహంబు గూర్చినాము
                  ఇంగ్లీషువారిపై యేవగింపును బెంచు వర పద్య గేయముల్ వ్రాసినాము
                  ఇల్లు పిల్లలు వీడి ఇంగ్లీషువారిచే చెరసాల నిడుములు జెందిన నాము
      
గీ !! గుండు దెబ్బల కేదురేగి గుండెలిచ్చి
                 రక్షక భటాలి లాఠీల రాటు దేలి
                 భరతమాత విముక్తికి పాటు పడిన
                 తొల్లిటి స్వతంత్ర వీరయోధులము మేము !!