జయకృష్ణా ముకుందా మురారీ
పాండురంగ మహత్యం (1957) సినిమా కోసం సముద్రాల రామానుజాచార్య రచించిన పాట.
హే కృష్ణా ముకుందా మురారీ
జయకృష్ణా ముకుందా మురారీ
జయగోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
దేవకి పంట, వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంట ||| కృష్ణా ముకుందా |||
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట
ఉపునబోయి మాకుల గూలిచి
శాపాలు బాపితివంట ||| కృష్ణా ముకుందా |||
అమ్మా! తమ్ముడు మన్నుతినేను,
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద,
ఏదన్నా నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోట బాపురే
పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్ ||| జయకృష్ణా ముకుందా |||
కాళియ ఫణిఫణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోప కిశోరా
కంసాది దానవ గర్వాపహార
హింసావిదూరా పాప విదారా
కస్తూరీ తిలకం, లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం,
కరే కంకణం, సర్వాంగే హరి చంద నంచ కలయం,
కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీ || విజయతే ||
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ, పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలి, శిఖిపించ మౌళీ || కృష్ణా ముకుందా |||