జగత్తు - జీవము/ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము

శ్రీయుత వసంతరావు వేంకటరావుగారు ఎం. ఎస్సీ. పరీక్షలో నుత్తీర్ణులై శ్రీ విజయనగర మహారాజావారి ఆంగ్లకలాశాలయందు ప్రకృతి శాస్త్రోపన్యాసకులుగ నియమింపబడి చిరకాలమునుండియు నీ శాస్త్రమున పరిశోధన గావించుచు లోకమున కుపకారార్ధమై ప్రాచీనాధునిక విజ్ఞాన సమన్వయపూర్వకముగ గ్రంథ రచనము చేయుచున్నారు. ప్రస్తుతము దీని కుపోద్ఘాతము వ్రాయవలసినదిగా నన్ను కోరిరి. నేను ప్రకృతిశాస్త్రము నభ్యసించిన వాడనుకాను. అయినను వారితో నాకుగల స్నేహమును వేదాంతశాస్త్రమందలి యాదరణమును ఈ గ్రంథమునుగూర్చి వ్రాయుటకు ప్రోత్సహించినవి.

ఈ పుస్తకము స్థాలీపులాకన్యాయముగ చూడడమైనది. దీనిలో జగత్తు, జీవము, జీవితాంతము, కాలాకాశవై చిత్రి అను పేర్లతో నాలుగు విదములుగ విభజింపబడియున్నది. ఈ గ్రంధ పఠనమువలన ఆంగ్లభాషయందలి ప్రకృతి ఖగోళశాస్త్ర పరిశోధన యొక్కయు, సంస్కృతభాషయందలి వేదాంత ఖగోళశాస్త్రముల యొక్కయు పరిజ్ఞానము అల్పాయాసముచే సిద్దించును.

ఈ పుస్తకమందున్న విషయము మాత్రము చూడగ మన వేదములలోని విషయములనే గ్రహించి ఆధునికులు తగు పరికరములతో చేసిన పరిశోధనా ఫలితమాత్రమని తెలియకమానదు. కాబట్టి స్మృతి పురాణేతిహాసాదులవలె దీనికిని వేదమూలకత సిద్ధించు చున్నది. అందుచే నీ గ్రంధమునందు ప్రతిపాదితములైన విషయములుకూడ ప్రమాణముగ నంగీకరింపవచ్చును.

మరియు నీపుస్తకము మృదుమధురముగను, సరళముగను నుండుటచే ఆంధ్రులెల్లరును దీనిని పఠించి ప్రకృతిశాస్త్రమున తగు పరిజ్ఞానమును, విశ్వస్థితి, మండలములయొక్కయు, తదంతరాళముల యొక్కయు పరిమాణమును, విశేషించి సూర్యచంద్రాదుల గమనము యొక్కయు, పరిమాణముయొక్కయు సత్యమైనజ్ఞానమును, జీవుని స్వరూపము ఉత్పత్తిమరణములు, సంసారావస్థ, ఆనందావస్థ మొదలగు విషయములయొక్క యధార్థ జ్ఞానమును సులభముగ నీగ్రంధరత్నమువలన సంపాదించి యానందింతురని నాయాశయము.

ఈ విధమగు గ్రంథరచన బహు గ్రంధరచయితలగు వీరికి క్రొత్త సంగతికాదు. కాన వీరి యీ మహోద్యమఫలితములగు నిట్టి గ్రంధరాజములచే నాంధ్రభాషాయోషను భూషించుటకై వీరికి పరిపూర్ణాయుర్దాయము నొసగు గావుతయని పరమేశ్వరుని ప్రార్ధించు చున్నాడను.


మహామహోపాధ్యాయ, న్యాయభూషణ

పేరి లక్ష్మీనారాయణశాస్త్రీ,

శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కలాశాలా

రిటైర్డ్ హెడ్ పండిట్.