చిరస్మరణీయులు, మొదటి భాగం/ముహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌

51

17. ముహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌

(- 1859)

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఢిల్లీకి తరలివచ్చిన స్వదేశీ యోదులకు, ప్రజలకు నాయకత్వం వహించి, బ్రిటిష్‌ సైనిక బలగాలను ఏకోన్ముఖంగా ఎదుర్కొనగల సమర్ధుడి అవసరాన్నితీర్చిన మహాయోధులు ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ వీరుల సర్వసేనానిగా మహమ్మద్‌ భక్త్‌ఖాన్‌ చరిత్ర సృష్టించారు.

ఉత్తర ప్రదశ్‌ రాష్ట్రం అయోధ్య లోని సుల్తానపూర్‌లో మహమ్మద్‌ భక్త్ ఖాన్‌ జన్మించారు. తండ్రి పేరు అహమ్మదుల్లా ఖాన్‌. బ్రిటిష్‌ సైన్యంలో చేరి 40 సంవత్సరాల సుదీర్గ… అనుభవాన్ని సొంతం చేసుకున్నఆయన 1857లో రోహిల్‌ ఖండ్‌లో ఖాన్‌ బహుదూర్‌ ఖాన్‌ నేతృత్వంలో ఆంగ్లేయాధికారుల భరతం పట్టి స్వతంత్ర ప్రభుత్వ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆ తరువాత బరెల్లీలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఖజానానుస్వాధీనం చేసుకుని, సైనిక బలగాలను సమకూర్చుకున్న భక్త్‌ ఖాన్‌ మొగల్‌ పాదుషా బహదూర్‌ షా జఫర్ కు బాసటగా నిలవడనికి, తన బలగాలు, అపార ఖజానాతో ఢల్లీ చేరుకున్నారు. ఆయన ఢల్లీ చేరు కునేసరికి స్థానికంగా ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితు ల మూలంగా సమర్థుడైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న చక్రవర్తి జఫర్‌ ఆయనను స్వదేశీ సేనలకు సర్వసేనానిగా నియమించారు. ఢిల్లీ నగర సంరక్షణ బాధ్యతలను ఆయనకు

చిరస్మ రణీయులు 52

అప్పగిస్తూ ఆయన ఏది మంచిదనుకుంటే అది చేసేందుకు అనుమతిచ్చారు. సర్వ సైన్యాధిపతిగా బాధ్య తలను స్వీకరించగానే సైనికబలగాల పరిస్థితులను చక్క దిద్ది సైనికుల అభిమానాన్నిపొందారు. ఆ మీదట ప్రజలపై ఎటువంటి దాష్టీకాలకూ పాల్పడరాదని, దొంగతనాలకు, దోపిడలకూ పాల్పడితే చేతులు నరికి వేస్తామని, నేరస్తుల పట్ల కరినంగా వ్యవహరిస్తామని ప్రకటించి ఢిల్లీలోని అస్తవ్యస్థ పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

డిల్లీ నగరంలోని వ్యవహారాలను చక్క దిద్దాక పరిపాలన వైపు దృష్టి సారించిన ఆయన ప్రజాస్వామిక పద్దతు లకు శ్రీకారం చుట్టి మహాపరిపాలనా మండలి ఏర్పరిచారు. అందుకు అవసరమైన రాజ్యాంగ విధానాన్నిరూపొందించారు. స్వతంత్య్ర పాలనకు, వ్యకుల మధ్య న బేధాభిప్రాయాలు, స్వార్థం అంటరాదన్న ముందుచూపుతో చక్కని రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఢిల్లీలో బ్రిటిషర్ల మీద సాధించిన విజయంతో స్వదేశీ సైనికులు సరిపెట్టుకుని స్థిమిత పడితే లాభం లేదని భావించి ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని సంస్థానాలలో కూడా బ్రిటిషర్ల పెత్తనాన్ని పూర్తిగా అంతం చేయాలన్నారు.

ఆ దిశగా భక్త్‌ఖాన్‌ ప్రయత్నాలు చేస్తుండగా రాకుమారులు, రాజకుటుంబీకులు, వాణిజ్య ప్రముఖులు ఆయన మీద చక్రవర్తికి పితూరీలు చెప్పటం ఆరంభించటంతో అవాంఛనీయ పరిస్థితులను అర్థం చేసుకున్న భక్త్‌ ఖాన్‌ స్వచ్ఛందంగా సర్వసైన్యాధిపతి స్థానం నుండి తప్పుకుని స్వంత సైనికబలగాల అధినేతగా పోరాటాలలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల వ్యూహాలు తెలిసిన భక్త్‌ ఖాన్‌ శతృవు దాడులను తిప్పికొట్టడంలో ఎంతో నేర్పు ప్రదర్శించారు. కదనరంగంలో అద్వితీయ శౌర్యప్రతాపాలను చూపారు.

ఢిల్లీ పరాజయం తప్పదని తేలిపోగా చక్రవర్తిని కలిసి, తనతోపాటుగా అయోధ్యకు రావాల్సిదిగా కోరారు. చెప్పుడు మాటల వలన చక్రవర్తికి భక్త్‌ఖాన్‌ సలహా రుచించలేదు. భక్త్‌ఖాన్‌ తన సహచరులతో అయోధ్యకు వెళ్ళి బేగం హజరత్‌ మహల్‌ సైన్యంతో కలసి ఆంగ్లేయుల మీద సాగుతున్నపోరాటంలో పాల్గొన్నారు. చివరకు లక్నో పరాజయం వలన బేగం హజరత్‌ మహల్‌తో కలసి నేపాల్‌ పర్వత ప్రాంతాలలోకి తప్పంచుకున్నారు. అక్కడ నుండి కూడా ఆంగ్లేయుల మీద పోరుకు మళ్ళీ సన్నాహాలు చేస్తుండగా నేపాల్‌ అధినేత జంగ్ బహుదూర్‌ సహాయనిరాకరణ వలన అవి సఫలం కాలేదు.

ప్రథమ స్వాతంత్య్ర సమరంలో అద్వితీయ కార్యదక్షత, రాజనీతిజ్ఞత, దార్శినికత ప్రజాస్వామిక దృష్టి, ధైర్యసాహసాలను ప్రదర్శించి, శత్రువు చేత కూడా శభాష్‌ అన్పించుకున్న మహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌ ఊపిరి ఉన్నంత వరకు ఆంగ్లేయులతో పోరాడుతూ 1859 మే 13న కదనరంగంలో నేలకొరిగారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌