చిరస్మరణీయులు, మొదటి భాగం/ఉమర్‌ బీబి

87

35. ఉమర్‌ బీబి

(1864-1919)

మాతృభూమిని పరాయి శక్తుల నుండి విముక్తి చేసేందుకు అహింసాయుత పోరాటాలలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసుల హింసకు ప్రాణాలను అర్పించిన అమరజీవుల జాబితాలో ఉమర్‌ బీబి అరుదైన స్థానం సంపాదించుకున్నారు.

ఉమర్‌ బీబి పౌరుషానికి పోతుగడ్డ, ధైర్యసాహసాలకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచిన పంజాబ్‌ రాష్ట్రంలోని అమృతసర్‌ జిల్లా, దుల్లా (DULLA) లో 1864లో జన్మించారు. ఆమెకు ఇమానుద్దీన్‌తో వివాహం జరిగింది.

ఉమర్‌ బీబి మాతృభూమి పట్ల అపార గౌరవాభిమానాలు గల మహిళ. ఆమె జాతీయోద్యమ విశేషాలను తెలుసుకుంటూ, స్వదేశీయుల మీద విరుచుకుపడుతున్న బ్రిటిష్‌ పోలీసుల దాష్టీకాలను జ్వలిత నేత్రాలతో గమనిస్తూ ఆవేదన చెందారు. బానిస బంధానాలనుండి విముక్తమయ్యేందుకు భారతీయులు సాగిస్తున్న పోరాటాలను అణిచి వేసేందుకు బ్రిటిష్‌ పాలకులు అనుసరిస్తున్న క్రూరవిధానాల మూలంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొనియున్నతరుణంలో ఆమె జీవిత సహచరుడు కన్నుమూశారు. భర్తను కోల్పొయిన ఆమె సంసారం ఒడిదుడుకులకు గురయ్యింది.

ఆర్థిక కష్టనష్టాల కడలిలో పయనం సాగిస్తున్నాకూడాఉమర్‌ బీబి జాతీయోద్యమ

చిరస్మరణీయులు 88

కార్యక్రమాల పట్ల తనకున్న ప్రత్యేక ఆసక్తిని కోల్పోలేదు. ఆనాడు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ ఉద్యమకారుల ఉత్సాహానికి ఆనందిస్తూ, ఉద్యమకారులను తన బిడ్డలుగా భావిస్తూ ప్రోత్సహిస్తూ ఆశీర్వదించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుండి వ్యక్తమౌతున్న ఆందోళనల అణిచివేతకు ఆంగ్ల ప్రభుత్వం 1919 మార్చిలో భయంకర రౌలత్‌ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా అధికారులకు విశేషాధికారాలు కల్పించింది. ఆ కారణంగా రౌలత్‌ చట్టం గురించి నో అప్పీల్‌-నో వకీల్‌-నో దలాల్‌ (No appeal; no vakeel; no dalaal ) అని గాంధీజి వ్యాఖ్యానిస్తూ సత్యాగ్రహోద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపద్యంలో పంజాబ్‌లో జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలో సాగుతున్న పోలీసు రాజ్యాన్ని డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శలకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆనేతలను 1919 ఏప్రిల్‌ 10న అరెస్టుచేసి ప్రవాసానికి పంపింది. అందుకు నిరసనగా ఏప్రిల్‌ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్ లో నిరసన సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభా కార్యక్రమాలు నిషేధిస్తూ డయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ సభలో పాల్గొనేందుకు ఉమర్‌ బీబి కూడ అమృతసర్‌కు చేరుకున్నారు.

జనరల్‌ డయ్యర్‌ చర్యలకు ఏమాత్రం భయపడకుండా ప్రజలు భారీ సంఖ్యలో సభాస్థలికి విచ్చేశారు. ప్రజా స్పందనకు మండిపడ్డ డయ్యర్‌ జలియన్‌ వాలా బాగ్ లో జరుగుతున్న సభను విఘ్నం చేయడానికి, ఎవంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నేరుగా సభికుల మీద కాల్పులు జరిపించాడు. ఈ దమనకాండలో వందలాది ఉద్యమకారులు, ప్రజలు ప్రాణాలు విడిచారు. అంగవైకల్యం పొందారు.

ఆంగ్ల ప్రభుత్వలెక్కల ప్రకారంగా ఆ కిరాతకత్వానికి 378 మంది ఉద్యమకారులు ప్రాణాలు కొల్పోయారు. ఆ విధంగా ప్రాణాలర్పించిన వారిలో 55 మంది ముస్లిం యోధులు ఉన్నారు. ఆ 55 మంది ముస్లిం యోధులలో ఒకే ఒక మహిళగా 55 సంవత్సరాల ఉమర్‌ బీబి ప్రత్యేక స్థానం పొందారు.

ఈ మేరకు తన రుథిర ధారలతో జలియన్‌వాలా బాగ్ మట్టిని పునీతం చేయడం మాత్రమేకాకుండా తమ వీరోచిత పోరాటాలతో, ప్రాణ త్యాగాలతో పంజాబీలు నిర్మించిన అద్బుత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉమర్‌ బీబి ప్రత్యేక స్థానం పొందారు.

(Source : Contribution of Muslims to the Indian Freedom Movement, Khaliq Ahamed Nizami, Idarah-i-adabiyat-i- Delli,1999, Page. 36, Ect.,)

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌