చిన్నయసూరి జీవితము/చిన్నయసూరి నిఘంటువు

10. చిన్నయసూరి నిఘంటువు

బాలవ్యాకరణమును, నీతిచంద్రికనేకాక చిన్నయసూరి భాషకంతటికి నాధారమగు నొక నిఘంటువును రచించెను. అది యముద్రితమగుటచే లోకమునకు వెల్లడికాలేదు. కాని చిన్నయసూరి శిష్యులును, శబ్దరత్నాకర నిఘంటుకర్తలు నగు బహుజనపల్లి సీతారామాచార్యులవారు తమ నిఘంటు పీఠిక యందు నిఘంటువుయొక్క యావశ్యకతనుగూర్చి, సూరిగారి గ్రంథమునుగూర్చి యిట్లు ప్రశంసించియున్నారు:

"జనులు తమ తమ భాషయందు సంపూర్ణజ్ఞానమును సంపాదించుకొనుట యత్యావశ్యకము. ఆ జ్ఞాన మాయాభాషాగ్రంథములను దలస్పర్శముగఁ జదివినఁగాని కలుగ నేరదు. అట్లు చదివి పదార్థజ్ఞానమును బడయుటకు ముఖ్యసాధనంబులు నిఘంటువులు. ఆ నిఘంటువులు నీ దేశభాషలయం దింగ్లీషునందువలె వచనరూపములుగాక సంస్కృతము నందుంబలెఁ బద్యరూపములుగా నున్నయవి. అట్లుండుటచే విద్యార్థుల కవి సుబోధకంబులు గావు. ఆ హేతువుఁబట్టి ముందు సంస్కృతమునందుఁ బద్యరూపములుగా నుండిన నిఘంటువులన్నియు నిప్పుడు అకా రాదిక్రమమున వచనరూపములుగా నేర్పఱుపఁబడియున్నవి. ఇంకను కొన్ని యేర్పఱుపఁబడుచున్నవి. అట్లే యాంధ్ర ద్రవిడాది భాషలయందును కొన్ని యేర్పఱుపఁబడియున్నవి. అందు ద్రవిడాది భాషల కేర్పఱుపఁబడినవేమో విద్యార్థుల యుపయోగమునకుఁ జాలునంతటివిగాను, లక్ష్యావిరుద్ధములుగాను నున్నవి. ఈ ఆంధ్రమున కేర్పఱుపఁబడియుండు నొకటి రెండు నిఘంటువులన్ననో యట్లు కావు.

కావున నీలోపంబు బాపం గొంతకాలంబునకుముందు సంస్కృతాంధ్రములయందు విశేషపాండిత్యంబు గలిగి యాసేతుహిమాచలము చాలఁ బ్రసిద్ధి వహించియుండిన పరవస్తు చిన్నయసూరిగారు జీవితులై యుండినకాలమున దీర్ఘ సూత్రతతో ననేక గ్రంథ పరిశోధనంబు గావించి మిగుల విరివిగఁ, బ్రయోగ సహితంబుగ అకారాది తెనుఁగునిఘంటునొకటి వ్రాయ ప్రారంభించి నడపుచుండిరి. ఆ మహాప్రారంభము చూచి యది పరిపూర్తియగుటకు బహుకాలము చెల్లు ననియుఁ, బరిపూర్తియైనను నందు తెనుఁగుపదములుమాత్రమే చేర్పఁబడియుండుటంజేసి యది విద్యార్థుల కంతగా ప్రయోజనకారి కాఁజాల దనియు, నిదిగాక బడులయందుఁ జదివెడు విద్యార్థు లంత పెద్ద పుస్తకము కొని యుంచుకొనుట కష్టముగా నుండుననియు నూహించి ...........అకారాదినిఘంటు వొకటి వ్రాసి శీఘ్రకాలముననే పూర్తిచేసెదఁగాక యని మిక్కిలి పూనికతో దీని వ్రాయ నుద్యమించితిని."

పై నుదాహరించిన యంశమునుబట్టి చిన్నయసూరికి ముందు నిఘంటువులయందు కొన్ని లోపము లున్నవనియు, నా లోప నివారణార్థము చిన్నయసూరి ఈ నిఘంటురచనమును ప్రారంభించెననియు స్పష్టమగుచున్నది. పూర్వనిఘంటువుల స్వరూపమెట్టిదో, వాని గుణాగుణము లెట్టివో మనము తెలిసికొనినఁగాని చిన్నయసూరి రచనమునందలి విశిష్టతను మనము గ్రహింపఁజాలము. సంస్కృతమునకు బహుప్రాచీనకాలము నుండియు నిఘంటువు లున్నను తెనుఁగుభాషలో క్రీ. శ. 17 - వ శతాబ్దినుండియే బయలుదేఱినవి. తత్సమపదములను విడిచి యచ్చతెనుఁగుభాషలో కావ్యములు వెలయుటయే యీ నిఘంటు రచనమునకు దారి తీసినది. ఈ తెనుఁగు నిఘంటువు లన్నియును పద్యాత్మకములును, పర్యాయపదములు తెలుపునవియు నై యున్నవి.

పూర్వనిఘంటువులు - పద్యకృతులు

వీనిలో మొదటిది పైడిపాటి లక్ష్మణకవి కృతమగు 'ఆంధ్రనామసంగ్రహము'. దీనిలో లేని విశేషములను అడిదము సూరకవి 'ఆంధ్రనామ శేషము'న రచించెను. ఇవి కళింగ దేశములోనివి. రాయలసీమలో *[1] కవిచౌడప్ప సీసము లనుపేర నొక నిఘంటువు నిర్మించెను. దక్షిణాంధ్రదేశమున గణపవరపు వేంకట కవి 'వేంకటేశాంధ్రము'ను, కస్తూరి రంగకవి 'సాంబనిఘంటువును' వెలసినవి. కాని, వీని యన్నింటికన్న పుదుక్కోటలో వెలసిన 'ఆంధ్రభాషార్ణవము' అను నాంధ్రామరము చాల ప్రసిద్ధి వడసినది; సర్వాంధ్రదేశమున ప్రచారమున నున్నది. దీని వెనుక విశేషాంధ్రము, సర్వాంధ్రసార సంగ్రహము. దేశ్య నామాంత కోశము, ఆంధ్ర పదాకరము మున్నగు తెనుఁగు నిఘంటువులు బయలు వెడలినవి. కాని, వీనియందు నేవిధమైన ప్రత్యేకతయు లేదు. ఇవియన్నియు పద్యమయములే. కావున నవీనులకు సుగ్రాహ్యములై యుపయోగకరములు కావు. ఇంతేకాక యివి కావ్యములలో ప్రయుక్తములైన పదములను మాత్రమే విపులముగా నర్థీకరించునుగాని యెక్కుడు పదజాలము ప్రదర్శింపఁజాలవు.

నవీన నిఘంటువులు

నవీనయుగము ప్రారంభమైన వెనుక ప్రాచీన నిఘంటువులు నవీన విద్యాప్రణాళికకు సరిపోలేదు. అందుచే నూతనరీతిని నిఘంటువు లేర్పడవలసిన యావశ్యకత కలిగినది. పద్యరూపమునకాక వచనరూపమున నిఘంటువులు రచితములు కావలసి వచ్చెను. అం దకారాదిగా పదములు సరికూర్చి యర్థము నెదురుగ వ్రాసినఁగాని జనబాహుళ్యమునకు, విద్యార్థిలోకమున కుపయుక్తములు కావు. అట్టివానిలో మొట్టమొదట వెలువడినది మామిడి వెంకయ్య యను ప్రసిద్ధ వైశ్యపండితుఁడు రచించిన 'ఆంధ్ర దీపిక' యనునది. ఇది. క్రీ. శ. 1816 లో రచితమై 1849 లో ముద్రితమైనది. ఈకాలముననే ఆంగ్లేయులుకూడ తెనుఁగు నభ్యసించి, తెనుఁగునకు నింగ్లీషుభాషలో నిఘంటు రచనమును వ్రాయుట ప్రారంభించిరి. అట్టివారిలో కాంబెల్ అను నాతఁడు ముఖ్యుఁడు. ఈతఁడు 1821 లో కాంబెల్ నిఘంటు వనుపేర తనగ్రంథమును ప్రకటించెను.

దీని వెనుక ఆంధ్రభాషోద్ధారకుఁడై మహాప్రసిద్ధిచెందిన బ్రౌను మహాశయుఁ డొక పెద్దనిఘంటువు నిర్మించెను. ఇదియే బ్రౌను నిఘంటు*[2] వనుపేరఁ బరఁగుచున్నది. ఇది 1852 - వ సంవత్సరమున నచ్చొత్తింపఁబడినది. అంతకుముందు నిఘంటువులకన్న నీ నిఘంటువునందు రెండు మూఁడు విశేషములు కలవు. 1. తెనుఁగుపదములకు తెనుఁగర్థములే కాక ఇంగ్లీషు భాషలో నర్థము లియ్యఁబడినవి.

2. పదములకు ఆ యా గ్రంథములనుండి ప్రయోగములు సేకరింపఁబడి యుదాహృతములైనవి.

3. ఆశ్వాస సంఖ్యయు, పద్యసంఖ్యయుకూడ నీయఁబడి యున్నవి.

4. ఈ నిఘంటువుతోకూడ అన్యభాషాపదము లగు హిందుస్థానీ ఫారసీ యింగ్లీషు తమిళము మహారాష్ట్రములకు సంబంధించినపదములుకూడ "మిశ్ర నిఘంటువు" అనుపేర రచితమైనది.

5. ఈ గ్రంథమున కొక యమూల్యమగు పీఠికకూడ చేర్పఁబడియున్నది. అందు కొంతమంది కవులనుగూర్చి, కావ్యములనుగూర్చి విశేషములు తెలుపఁబడినవి. ఇ ట్లున్నను ఈ నిఘంటువునందు గ్రాంథిక పద్ధతికి ననుకూలమగు రచన లేదు. ఇందు శకటరేఫములుగాని, అర్ధానుస్వారములుగాని పాటింపఁబడలేదు. దంత్యతాలవ్యములు - అనఁగా "చ చ", "జ జ" లు వేఱు వేఱుగా చూపఁబడక ఆ యా వర్గములయందే చూపఁబడినవి. దీనివలన ప్రాచీన కావ్య సంస్కరణమునకు వలయు పదములయొక్క సరియగు రూపములను తెలిసికొనుటకు, పాఠభేదములు గ్రహించుటకు మాత్రమే వీలగుచున్నది కాని వ్యాకరణ సంప్రదాయములను, ప్రయోగ విశిష్టతను గ్రహిం చుట కుపయుక్తమగుటలేదు. కాఁబట్టి యీనిఘంటు వున్నత సాహిత్య విద్యాప్రణాళికకు తోడ్పడలేదు.

చిన్నయసూరి నిఘంటువు

పై నిఘంటువులలోని లోపములన్నియు గమనించి ఆంధ్రవ్యాకరణ లక్షణమునకు లక్ష్యముగ నుండునట్లుగను, రూపనిష్పత్తులనుగూర్చి స్పష్టమైన పరిజ్ఞానము కలుగుటకును, ఒకే పదమునకు సందర్భము ననుసరించి యేర్పడుచుండు నర్థచ్ఛాయలు విదితమగునట్లుగను నొక నిఘంటువును చిన్నయసూరి వ్రాయ నుద్యమించెను. దానికొఱ కాతఁడు వాఙ్మయమున ప్రామాణికులగు మహాకవుల కావ్యములను పఠించి తానే స్వయముగా నందలి పదములను తీసి వ్రాసుకొనెడి వాఁడు. ఆ కాలమునం దిప్పటివలె నచ్చుపుస్తకములు విశేషముగ లేవు. కేవలము తాళపత్ర ప్రతులను పరిశీలించి చిన్నయసూరి పరిశ్రమ చేయవలసివచ్చెను. ఈ సందర్భమున నాతఁడు చేసిన పరిశ్రమ యనితర దుర్గ్రాహ్యమని చెప్పనొప్పును. తాను చూచిన ప్రతి పదమును బాగుగా విమర్శించి చూచుకొను బాధ్యత చిన్నయసూరియం దుండుటచే నాతని నిఘంటువు కొంతవఱకు సాగినను అతని జీవితకాలములో సంపూర్తి కాలేక నిల్చినది. పైని వివరించినట్లుగా నిందు తెనుఁగు - పదములకే ప్రాధాన్య మియ్యఁబడియున్నది. కొలఁదిగా సంస్కృత పదములుకూడ కలవు. ఈ నిఘంటువు నేడు సంపుటములలో సూరి స్వయముగా వ్రాసియున్నాఁడు. ఇది చిత్తుప్రతి యని చెప్పనొప్పును. పేరునకు చిత్తుప్రతియేగాని సూరి ఎక్కడను నొక్క తుడుపైనను లేకుండ వ్రాసి యున్నాఁడు. కాని వ్రాయవలసిన విషయములు వ్యత్యస్తముగా నుండుటచే క్రొత్తవానిని చేర్చి తిరిగి దానిని సాఫీగా వ్రాయవలసివచ్చినది. మరల నట్టి నిఘంటువు ప్రథమ సంపుటము సూరియే స్వయముగా వ్రాసియున్నాఁడు. *[3] ఇందులోని పదములు సూర్యరాయాంధ్ర నిఘంటువున తీసికొనఁబడి "చి. ని" అను సాంకేతికముతో చూపఁబడినవి. ఈ నిఘంటువులే కాక ఆతఁ డే యే గ్రంథములనుండి పదములను తీసెనో యవి కూడ భద్తపఱుపఁబడినవి. వానిలో నీ క్రింది గ్రంథములు కలవు.

1. కవిత్రయరచితమహాభారతము, 2. మహాభాగవతము, 3. భాస్కర రామాయణము, 4. నిర్వచనోత్తర రామాయణము, 5. పద్మపురాణము, 6. శృంగారనైషధము, 7. కాశీఖండము, 8. భీమఖండము, 9. హర విలాసము, 10. సింహాసనద్వాత్రింశిక, 11. చంద్రాంగదచరిత్రము, 12. దాశరథీశతకము, 13. లావణ్యశతకము, 14. హరభక్తవిలాసము, 15. ఆంధ్రభాషార్ణవము మున్నగునవి.

పై ప్రణాళికనుబట్టి నిఘంటు పదములను చిన్నయసూరి మూలగ్రంథములనుండియే పరిశీలించి గ్రహించెనని తెలియఁదగును.

  1. * దీనిని తొలుత శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వరరావు (యన్. యస్. యస్. రావు) ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము బులెటిన్ లో ప్రకటించి లోకమునకు వెల్లడించినాఁడు.
  2. * ఈ యపూర్వ నిఘంటువును నేఁ డాంధ్ర సాహిత్య అకాడమీ వారు పునర్ముద్రణము గావించుచున్నారు.
  3. * ఇవి చాలకాలమువఱకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున నుండెడివి. నేఁడెక్కడ నవిలయమైనవో తెలియుట లేదు.