చిన్నయసూరి జీవితము/ఉపోద్ఘాతము

శ్రీ

చిన్నయసూరి జీవితము

1. ఉపోద్ఘాతము

శ్రీ పరవస్తు చిన్నయసూరి పందొమ్మిదవ శతాబ్దిని విలసిల్లిన ప్రసిద్ధ పండితులలో ప్రథమగణ్యుఁడు. ఈతఁడు రచించిన గ్రంథములలో బాలవ్యాకరణమును, నీతిచంద్రికయు నూఱేండ్లనుండి పాఠశాలలోను, కళాశాలలలోను సయతముగఁ బఠనీయ గ్రంథములై పండితలోకమున ప్రామాణికములైనవి; ఆంధ్ర దేశమంతటను నధిక వ్యాప్తి నందినవి. అక్షరాస్యులగు నేఁటి తెలుఁగువారిలో నీతిచంద్రిక చదువని విద్యార్థి కాని, బాలవ్యాకరణము నెఱుఁగని పండితుఁడుగాని లేఁడని చెప్పుట నత్యోక్తియేకాని యతిశయోక్తి కాదు. ప్రాచీన కాలమున వచనరచనకు, వ్యాకరణరచనకు మార్గదర్శకుఁడగు 'నన్నయ్య' వలె నవీన కాలమున నీ రెండిటికి చిన్నయసూరి మార్గదర్శకుఁడగుటచేత "ఆనాఁడు నన్నయ్య, యీనాఁడు చిన్నయ్య" యను నానుడి యీతనియెడల సార్థకమైనది.

చిన్నయసూరి పై రెండు గ్రంథములేకాక బహుముఖముగా సంస్తవనీయమగు భాషావాఙ్మయసేవ గావించిన మహా విద్వాంసుఁడు. ఆంధ్ర వాఙ్మయ చరిత్రమున నవీన యుగ ప్రారంభ దశలో, ననఁగా పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభదశకమున చిన్నయసూరి ప్రభవించెను. అప్పుడే యాంగ్లేయులు మన దేశమున తమ ప్రభుత్వమును సుప్రతిష్ఠితము గావించుకొని తమ భాషయగు నింగ్లీషు భాషను రాజభాషగా నొనర్చి పరిపాలన ప్రారంభించిరి. పశ్చిమఖండవాసులైన యాంగ్లేయుల సమాగమమువలన వారి నాగరికత, సంస్కృతి దేశ భాషల కొక నూతన వికాసము గలుగఁజేసినవి, తెనుఁగున నవ్యయుగ చిహ్నములైన ముద్రా యంత్రములు, వార్తా పత్రికలు, విశ్వ విద్యాలయములు, వచన రచన, ప్రాచీన గ్రంథముద్రణము, భాండాగార స్థాపనము, భాషా వాఙ్మయ పరిశోధనము మున్నగునవి నాఁడే మొలకలెత్తినవి. వానికిఁ దగిన రీతిని దోహదము నిచ్చి యీ నవ్యయుగ నిర్మాణ సౌధమునకుఁ బునాదివైచినవారు భాషోద్ధారకులు బ్రౌను దొరవారు. వారి కాలమునందే చిన్నయసూరి కూలంకషమగు సంస్కృతాంధ్ర భాషా పాండిత్యము సంపాదించి యీ నూతనోద్యమము లన్నిటిని గ్రహించెను.

బ్రౌనుదొరవారి పద్ధతి యీకాలమున నాంధ్ర సారస్వతము నంతటిని నవీనరీతులను పునరుద్ధరించినదయ్యును, పండిత లోకమునకు నుపాదేయమగురీతిని పెంపొందలేకపోయినది. చిన్నయసూరి యీ నూతనపథకముయొక్క పరిస్థితిని గమనించి యది సంస్కరణార్హమని యెంచి యాయా శాఖ లన్నింటి యందు తాను పరిశ్రమచేసి యా నవీనపథకమును ప్రాచీన సంప్రదాయములతో సమ్మేళనము చేసెను. ఇట్లీరెండు పద్ధతులను జోడించుటవలన నాంధ్ర వాఙ్మయ చరిత్రలో నొకవిధమగు నూతనచైతన్యము గల సంస్కృతి యుత్పన్నమగుటకుఁ దగిన యవకాశ మేర్పడినది.

ఈపద్ధతి పండితజనసమ్మతమగుటచేత నుత్తమసాహిత్య విద్యావ్యాప్తికి నెంతేని తోడ్పడినది. కాఁబట్టియే చిన్నయ సూరిని నవ్యవాఙ్మయయుగపురుషులలో నొకనిగా మనము పరిగణింపవలయును. అతఁడు నవీనోద్యమము లన్నిటియందును పాల్గొని యానాఁటి సాహిత్యప్రపంచమునకు నియంతగా నుండిన మహారథుఁడు.

అయిన నీనాఁటి వాఙ్మయచరిత్రకారుల కేమి, పండితులకేమి చిన్నయసూరి సమగ్రజీవితము తెలియకపోవుటచేత నవ్యాంధ్రవాఙ్మయ ప్రపంచమున నాతనికిఁ గల యగ్రస్థానము గుర్తింపఁబడలేదు. రాఁబోవు ప్రకరణములలో నాతఁ డేవిధముగా నీ నవీనోద్యమరథమును నడిపించి యజరామరకీర్తి గడించి శకపురుషుఁ డయ్యెనో చదువుదము.